Arthritis : వేళ్లు విరిచే అలవాటుతో కీళ్లవాతం వస్తుందన్నది నిజమేనా.. సైన్స్ ఏం చెబుతోంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఖాళీగా కూర్చున్నప్పుడో, పని ఒత్తిడిలో ఉన్నప్పుడో చాలామంది వేళ్లను టపటపా విరుస్తుంటారు (Knuckle Cracking). కొందరికి ఇది ఉపశమనాన్ని ఇస్తే, మరికొందరికి అదొక అలవాటుగా మారిపోతుంది. అయితే ఇలా వేళ్లు విరిస్తే భవిష్యత్తులో కీళ్లవాతం (arthritis) వస్తుందని, వేళ్లు లావుగా మారి బలహీనపడతాయని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ఇంతకీ ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది..? వైద్య పరిశోధనలు ఏం చెబుతున్నాయి..? నిపుణుల విశ్లేషణ మీకోసం..

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

శబ్దం ఎందుకు వస్తుంది అంటే..?

మన వేళ్ల కీళ్ల మధ్య ‘సైనోవియల్ ఫ్లూయిడ్’ (Synovial Fluid) అనే ప్రత్యేక ద్రవం ఉంటుంది. ఇది ఎముకల మధ్య ఘర్షణను తగ్గించి, కందెనలా పనిచేస్తుంది. మనం వేళ్లను వెనక్కి లాగినప్పుడు లేదా వంచినప్పుడు ఆ కీళ్లలోని పీడనంలో ఆకస్మిక మార్పులు వస్తాయి. ఈ క్రమంలో సైనోవియల్ ద్రవంలో ఏర్పడే చిన్న గ్యాస్ బుడగలు పగిలిపోవడం వల్లనే ఆ టపా టపా శబ్దం వస్తుంది.

కీళ్లవాతం (Arthritis) వస్తుందా..?

వేళ్లు విరవడం వల్ల కీళ్లవాతం వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిపై జరిగిన పలు సుదీర్ఘ అధ్యయనాల్లో కూడా వేళ్లు విరిచేవారిలో ఆర్థరైటిస్ ముప్పు అదనంగా పెరిగినట్లు తేలలేదు. కాబట్టి ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మరి కీళ్లకు ముప్పు ఉందా..?

సహజంగా వేళ్లు విరిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ మితిమీరిన బలంతో, బలవంతంగా వేళ్లను లాగి విరిచే ప్రయత్నం చేస్తే మాత్రం సమస్యలు తప్పవు. దీనివల్ల కీళ్ల చుట్టూ ఉండే మృదువైన కణజాలం (soft tissues), లిగమెంట్లపై తీవ్ర ఒత్తిడి పడి వాపు లేదా అసౌకర్యం కలగవచ్చు. అలాగే కొందరిలో చేతి పట్టు (Grip strength) తాత్కాలికంగా బలహీనపడే అవకాశం ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి..

వేళ్లు విరిచేటప్పుడు లేదా ఆ తర్వాత కీళ్లలో తీవ్రమైన నొప్పి రావడం. వేళ్లు ఎర్రబడటం, వాపు కనిపించడం. వేళ్లను ముడవడానికి లేదా నిటారుగా ఉంచడానికి ఇబ్బంది పడటం. చేతి పట్టు బలహీనపడటం, ఉదయం వేళల్లో కీళ్ల బిగుతు తగ్గకపోవడం.

నిపుణులు ఇచ్చే సలహా..

నొప్పి, వాపు వంటి ఇబ్బందులు లేనంత వరకు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే దీన్ని ఒక వ్యసనంలా మార్చుకోకుండా తగ్గించుకోవడమే శ్రేయస్కరం. చేతులు అలసిపోయినట్లు అనిపిస్తే బలవంతంగా శబ్దాలు వచ్చేలా లాగకుండా.. చేతి వేళ్లను మెల్లగా సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు అలవాటు చేసుకోవడం మంచిది. నొప్పి ఉన్నప్పుడు వేళ్లు విరిచే అలవాటును పూర్తిగా ఆపేసి వైద్యుడిని సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.