Appendicitis : కడుపు నొప్పే కదా అని లైట్ గా తీసుకోకండి.. 'అపెండిసైటిస్' కావచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన శరీరంలో ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా కడుపు నొప్పి వస్తే చాలామంది గ్యాస్, ఎసిడిటీ లేదా అజీర్ణం అనుకుని ఇంట్లో ఉండే మాత్రలు వేసుకుని సరిపెట్టుకుంటారు. అయితే, ప్రతి కడుపు నొప్పినీ అంత తేలిగ్గా తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అది ఒక్కోసారి అత్యవసర వైద్యం అవసరమయ్యే 'అపెండిసైటిస్' సమస్య కూడా కావచ్చు. దీనిని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అసలు అపెండిసైటిస్ అంటే ఏమిటి..? దాని లక్షణాలు ఎలా ఉంటాయి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

అసలు 'అపెండిక్స్' అంటే ఏమిటి..?

మన పొత్తికడుపులో కుడివైపున, పెద్ద పేగుకు చివరన అతుక్కుని ఉండే ఒక చిన్న వేలు లాంటి సంచినే 'అపెండిక్స్' అంటారు. శరీరంలోని మంచి బ్యాక్టీరియాను రక్షించడంలో ఇది పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా కారణం చేత  గట్టిపడిన మలం, ఇన్ఫెక్షన్లు లేదా ఇతర అడ్డంకుల వల్ల ఈ అపెండిక్స్ ముఖద్వారం మూసుకుపోయినప్పుడు, దాని లోపల బ్యాక్టీరియా వేగంగా పెరిగిపోతుంది. దీనివల్ల ఆ భాగం వాచిపోయి, ఇన్ఫెక్షన్‌కు గురవుతుంది. ఈ పరిస్థితినే 'అపెండిసైటిస్' అంటారు.

అపెండిక్స్ లక్షణాలు ఎలా ఉంటాయి..?

బొడ్డు చుట్టూ నొప్పి.. మొదట్లో నొప్పి బొడ్డు చుట్టూ తేలికగా ప్రారంభమవుతుంది. కానీ, కొన్ని గంటల్లోనే అది పొత్తికడుపు కుడివైపు కింది భాగానికి మారుతుంది. తీవ్రమయ్యే నొప్పి..ఈ నొప్పి సాధారణ గ్యాస్ నొప్పిలా వచ్చి పోయేది కాదు. సమయం గడుస్తున్న కొద్దీ దీని తీవ్రత పెరుగుతుంది. నడుస్తున్నప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా శరీరాన్ని కదిలించినప్పుడు కడుపులో భరించలేని నొప్పి వస్తుంది.జీర్ణక్రియలో మార్పులు..నొప్పితో పాటు వికారం, వాంతులు, ఆకలి పూర్తిగా తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం.. ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి రోగికి స్వల్పం నుంచి తీవ్రమైన జ్వరం రావచ్చు.

ఎవరికి ప్రమాదం ఎక్కువ..?

అపెండిసైటిస్ ఏ వయసు వారికైనా రావచ్చు, కానీ సాధారణంగా 10 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మహిళలతో పోలిస్తే పురుషులలో ఈ ముప్పు కొద్దిగా ఎక్కువ. అలాగే, కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నా, ఆహారంలో పీచుపదార్థాలు (fiber) తక్కువగా తీసుకుంటూ నిరంతరం మలబద్ధకంతో బాధపడేవారికి కూడా ఈ ప్రమాదం పొంచి ఉంటుంది.

నిర్లక్ష్యం చేస్తే 'పగిలిపోయే' ప్రమాదం..!

అపెండిసైటిస్‌కు సకాలంలో చికిత్స అందించకపోతే, వాపు ఎక్కువై అపెండిక్స్ సంచి ఒక్కసారిగా పగిలిపోయే (Rupture) ప్రమాదం ఉంది. అది పగిలితే లోపలి బ్యాక్టీరియా, కలుషిత పదార్థాలు పొత్తికడుపు అంతటా వ్యాపించి 'పెరిటోనైటిస్' అనే ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. ఈ పరిస్థితిలో కడుపు గట్టిగా బిగుసుకుపోయి, విపరీతమైన జ్వరం వస్తుంది. ఇది అత్యవసర పరిస్థితి (Medical Emergency), వెంటనే శస్త్రచికిత్స చేసి యాంటీబయాటిక్స్ అందించాల్సి ఉంటుంది.

నివారణ ఎలా..?

అపెండిసైటిస్‌ను పూర్తిగా అడ్డుకోవడానికి ప్రత్యేకమైన మార్గాలు లేనప్పటికీ, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లతో ముప్పును తగ్గించుకోవచ్చు.మీ రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోజుకు సరిపడా నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా సాగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పేగుల కదలికలు మెరుగవుతాయి. కడుపు నొప్పి వచ్చి, అది కాలక్రమేణా పెరుగుతూ కుడి వైపునకు చేరుతుంటే అస్సలు ఆలస్యం చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించి అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.