ఉపవాసం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
సాక్షి లైఫ్ : ఉపవాసం.. అనేది ఆధ్యాత్నికానికి మాత్రమే సంబంధించిందికాదు.. ఆరోగ్యానికి సంబంధించింది కూడా. మన పూర్వీకులు ఎప్పటినుంచో ఉపవాసం చేయడం అలవాటు చేసుకున్నారు. నిర్ణీత సమయం వరకూ కడుపు ఖాళీగా ఉంచడమే ఉపవాసం. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించడమేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఉపవాస నియమాల్లో రకాలు..
ఉపవాసం సమయంలో నీరు తప్ప మరేదీ ముట్టకుండా ఉండేవాళ్ళు కొందరు.. అల్పాహారాన్ని తీసుకునే వారు మరికొందరు ఉంటారు. ఉపవాసం అన్నది 12 నుంచి 24 గంటల పాటు సాగే నియమం. ఇందులోనూ చాలా రకాలున్నాయి. పేగుల ఆరోగ్యం కోసం, శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపేందుకు వీలుగా ఆయుర్వేదం ఉపవాసాన్ని ఆచరించమనే చెబుతోంది. ‘‘ఫాస్టింగ్ అన్నది భౌతికంగానే కాదు మానసిక ఆరోగ్యానికీ ఉపయోగపడుతుంది. ఒబెసిటీ, అధిక కొలెస్ట్రాల్, కాలేయ సమస్యలకు ఉపవాసం పరిష్కారం చూపిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి.. నిద్రనాణ్యత ను ఎలా మెరుగు పరుచుకోవాలంటే..?
ఒక్కొక్కరికి ఒక్కో విధంగా..
ఉపవాసం సమయంలో పండ్లు, నట్స్ కొబ్బరి నీరు, చెరకు రసం, పాలు, పెరుగు, మజ్జిగ, చిలగడ దుంపలు తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఫాస్టింగ్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఫలితాలనిస్తుందని డాక్టర్లు అంటున్నారు. శరీర తత్వానికి సరిపడే ఫాస్టింగ్ ఆచరించడం కూడా మంచి ఫలితాలుంటాయి.
ఉప్పు, తీపి పదార్థాలకు దూరంగా ఉండడం, కేవలం నీరు తీసుకునే ఉండడం, ద్రవ పదార్థాలు అంటే పండ్ల రసం, పాలు, ఆహారానికి, ఆహారానికి మధ్య సుదీర్ఘ విరామం ఇవ్వడం వంటి ఎన్నో రకాల ఫాస్టింగ్ లు ఉన్నాయి. అయితే ఫాస్టింగ్ ఉన్న వారు జంక్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు.
శరీరంలో మార్పులు..
శరీర వ్యవస్థలో మార్పులు పునరావృతమయే 40 నుంచి 48 రోజుల కాలాన్ని మండలంగా భావిస్తారు. ఈ సమయంలో మూడు రోజుల పాటు ఆహారం అవసరం లేదు. మీ శరీరం ఎలా పనిచేస్తోందో అనే స్పృహ ఉంటే, మీకు ఫలానా రోజున భోజనం అక్కరలేదన్న సంగతి తెలుస్తుంది. మీరు ఆ రోజునా ఏ శ్రమ లేకుండానే, భోజనం చేయకుండా గడపాలి. చివరకి కుక్కలకు, పిల్లులకు కూడా ఈ అవగాహన ఉంటుంది. ఒకరోజు అవి అసలు ఆహారం ముట్టుకోవు. ఏ రోజైతే వ్యవస్థ ఆహారం తీసుకోవడానికి నిరాకరిస్తుందో, ఆ రోజు శరీరం తనిని తాను శుద్ధి చేసుకోవడానికి వీలుకలుగుతుంది.
ఉపవాసానికి సిద్ధం చేయాలి..
మనసునీ, శరీరాన్నీ ముందుగా ఉపవాసానికి తగిన విధంగా సిద్ధం చేయకుండా బలవంతంగా ఉపవాసం చేస్తే, లాభానికి బదులు ఆరోగ్యానికి ప్రమాదమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీ శరీరమూ, మనసూ, శక్తీ, ఆ సాధనకి తగినట్లుగా తయారుగా ఉంటే, మీకు ఉపవాసం వల్ల లాభం చేకూరుతుంది. తరచు పొగతాగేవారికీ, కాఫీ తాగేవారికీ, ఉపవాసం చేయడం చాలా కష్టంగా అనిపించవచ్చు.
పోషక విలువలున్న పదార్థాలు..
ఉపవాసం ప్రారంభించక ముందు మీ శరీరాన్ని సరియైన పోషక విలువలున్న పదార్థాలు తినడం ద్వారా సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా నీరు ఎక్కువగా ఉండే పళ్ళూ, కూరగాయలూ తినడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఉపవాసం చేయడం అనేది అందరికీ మంచిది కాకపోవచ్చు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే దానివల్ల ఎన్నో లాభాలున్నాయి.
ఇది కూడా చదవండి.. New study : మీ బెడ్ రూమ్ ఎంత సేఫ్ ..? పిల్లో కవర్‌లో మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
