మంచి నిద్ర కోసం ఎన్ని గంటలు వ్యాయామం చేయాలి..?
సాక్షి లైఫ్ : ఇన్సోమియా అంటే "నిద్రలేమి సమస్య". ఇది వయసుతో సంబంధం లేకుండా ఎటువంటి వారిలోనైనా తలెత్తవచ్చు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే, ఈ సమస్య ఎక్కువ కాలం పాటు కొనసాగితే, అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా పరిగణించాల్సి వస్తుందని, నిద్ర సంబంధిత సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన వ్యాధుల సంకేతాల్లోనిద్రలేమి సమస్య కూడా ఒకటని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి సరైన నిద్ర కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
వైద్యనిపుణులు ఏమంటున్నారు..?
రోజుకి కనీసం 6 నుంచి 8 గంటలు నిరంతరాయంగా నిద్రపోవడం చాలా అవసరమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. నిద్రలేమి సమస్యల విషయంలో తప్పనిసరిగా వైద్యనిపుణుల సలహా తీసుకోవాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని పరిస్థితులలో నిద్రలేమి సమస్య శరీరంలో అభివృద్ధి చెందుతున్న తీవ్రమైన వ్యాధులకు కారణమ వుతుంది. కాబట్టి ఈ సమస్యకు సకాలంలో చికిత్స అవసరం అవుతుంది.
అలసిపోతే హాయి నిద్ర..
శరీరం బాగా అలసిపోతే హాయిగా నిద్ర పడుతుందని సరికొత్త అధ్యయనం చెబుతోంది. ఏడురోజుల్లో మూడు రోజులు గంటపాటు వ్యాయామం చేయడం ద్వారా సంతృప్తిగా నిద్ర పడుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచదేశాల్లో నేడు శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం వల్ల నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
అధిక బరువు..
కంటికి సరిపడా నిద్ర లేకపోతే.. అధిక బరువు సమస్యతోపాటు గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యల బారీన పడే ప్రమాదం ఉందని యూరప్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఫిజికల్ యాక్టివిటీ..
ఈ అధ్యయనంలో 4,399 మంది పాల్గొన్నారు. వీరిలో శారీరక శ్రమ చేసేవారిలో నిద్రలేమి సమస్యలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు కొన్ని ఐరోపా దేశాలకు చెందిన కొంతమంది వ్యక్తులను పది సంవత్సరాలు పరిశీలించిన తర్వాత వారిలో కనిపించిన మార్పుల ఆధారంగా అధ్యయన ఫలితాలను ప్రకటించారు పరిశోధకులు.
ఇది కూడా చదవండి.. తృణధాన్యాలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
