యూరిక్ యాసిడ్ నియంత్రించాలంటే..? ఏం చేయాలి..?   

షేర్ చేయండి:
యూరిక్ యాసిడ్ నియంత్రించాలంటే..? ఏం చేయాలి..?   

సాక్షి లైఫ్ : మన శరీరం యంత్రంలా పనిచేస్తుంది. అందులో చాలా అంశాలు ఉన్నాయి. వాటి సమతుల్యత చెదిరినప్పుడు, మొత్తం వ్యవస్థ చెదిరిపోతుంది. అంటే అనారోగ్య సమస్య మొదలవుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్, హిమోగ్లోబిన్ వంటి స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే, అప్పుడు పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటిలో యూరిక్ యాసిడ్ ఒకటి. 

యూరిక్ యాసిడ్ మన కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. మూత్రం ద్వారా బయటకు పోతుంది. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగినప్పుడు కొన్నిసమస్యలు మొదలవుతాయి. యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరిగితే, అది శరీరంలోని చిన్న కీళ్లలో పేరుకుపోయి గౌట్ సమస్యను కలిగిస్తుంది. అంతేకాదు మూత్రపిండాల్లో రాళ్లు , కిడ్నీల వైఫల్యానికి దారితీయవచ్చు. దానిని నియంత్రించడం చాలా ముఖ్యం. అందుకొసం ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
ఎంత ఉంటే నార్మల్..?  

యూరిక్ యాసిడ్ మన శరీరానికి అవసరమైన మూలకం.అయితే దాని పరిమాణం సాధారణం కంటే ఎక్కువగా ఉంటే, అది అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. సాధారణంగా, వయోజన మహిళల్లో యూరిక్ యాసిడ్ 2.5 నుంచి 6 mg/dL మధ్య ఉంటే, అది సాధారణమైనదిగా పరిగణిస్తారు. 

ఎంత ఉండాలి..?  

యురిక్ యాసిడ్ 3.5 నుంచి 7 mg/dL వరకు వయోజన పురుషుల శరీరంలో సాధారణమైనదిగా పరిగణిస్తారు. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే..? దానిని నియంత్రించడానికి ప్రయత్నించాలి. యూరిక్ యాసిడ్ సమస్యను ముందుగానే గుర్తిస్తే, కొన్ని నెలల్లో పూర్తిగా సాధారణ స్థాయికి తీసుకురావచ్చు. అందువల్ల, ప్రజలు ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోవాలి. వయస్సు పెరుగుతున్న కొద్దీ దాని పర్యవేక్షణ చాలా ముఖ్యమని యూరాలజిస్టులు చెబుతున్నారు.

యూరిక్ యాసిడ్‌ పెరగకుండా.. 

మొదట్లో యూరిక్ యాసిడ్‌ను మందులు లేకుండా నియంత్రించవచ్చు. ఇందుకోసం రెడ్ మీట్ సహా నాన్ వెజ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా తగ్గించి, తగినన్ని నీళ్లు తాగాలి. ఇది కాకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యూరిక్ యాసిడ్ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే, ఈ విషయాలన్నీ కాకుండా డాక్టర్ ఇచ్చే మందులను సరిగ్గా తీసుకుంటూ, ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోవాలి. 

ఇది కూడా చదవండి.. వెరికోస్ వెయిన్స్ కు చికిత్స తీసుకోకపోతే ఏమౌతుంది..?  


కాలేయం, మూత్రపిండాల పనితీరు క్షీణించినప్పుడు కొన్నిసార్లు యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వైద్య పరీక్షలు చేసిన తర్వాత యూరాలజిస్టులు  యూరిక్ యాసిడ్ పెరిగినట్లు నిర్ధారించాక అవసరమైన మందులు ఇస్తారు.  అలా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.