Robotic Heart Surgery : రోబోటిక్ హార్ట్ సర్జరీ విషయంలో సందేహాలు-వాస్తవాలు..
సాక్షి లైఫ్ : ఆధునిక వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన మినిమల్లీ ఇన్వేసివ్, రోబోటిక్ విధానాలు గుండె శస్త్రచికిత్సలను గణనీయంగా సులభతరం చేశాయి. అయితే ఈ విధానం ఎంతవరకు సురక్షితం, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎవరికి ఇది అనుకూలం అనే అంశాలపై సాధారణంగా తలెత్తే సందేహాలు, వాటికి సంబంధించిన వాస్తవాలను ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా.చిన్నబాబు సుంకవల్లి వివరించారు.
1. సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీకి, రోబోటిక్ సర్జరీకి మధ్య తేడా ఏమిటి..?
ఓపెన్ హార్ట్ సర్జరీ.. ఛాతీ మధ్యభాగంలోని స్టెర్నమ్ ఎముకను పూర్తిగా తెరిచి శస్త్రచికిత్స చేస్తారు. దీనివల్ల గాయం పెద్దదిగా ఉండి, కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ.. ప్రక్కటెముకల మధ్య చిన్నపాటి గాటు పెట్టి, వాటిని వెడల్పు చేయడం ద్వారా ఆపరేషన్ నిర్వహిస్తారు.
రోబోటిక్ సర్జరీ..
ఛాతీపై అతి చిన్న రంధ్రాలు చేసి, వాటి ద్వారా సూక్ష్మ పరికరాలను లోపలికి పంపుతారు. సర్జన్ ప్రత్యేక కన్సోల్ ద్వారా ఈ పరికరాలను నియంత్రిస్తూ శస్త్రచికిత్స పూర్తి చేస్తారు. ప్రయోజనాలు ఏమిటి..? అత్యంత చిన్న గాయం, అతి తక్కువ రక్తస్రావం, తక్కువ నొప్పి, ఆసుపత్రిలో స్వల్ప వ్యవధి మాత్రమే ఉండటం, రోగి సాధారణ జీవితానికి వేగంగా చేరుకోవడం.
2. రోబోటిక్ గుండె సర్జరీ ప్రతి ఒక్కరికీ అనుకూలమేనా..?
అన్ని రకాల గుండె జబ్బులకు రోబోటిక్ విధానం సరిపోదు. రోగి పరిస్థితి, కొరోనరీ ధమనుల స్థితి, ఇతర ఆరోగ్య సమస్యలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే రోబోటిక్ ప్రక్రియ అనుకూలమా కాదా అనేది నిపుణులు నిర్ధారిస్తారు. ఆసుపత్రికి వెళ్లినప్పుడు "రోబోటిక్ సర్జరీ అందుబాటులో ఉందా?" అని అడగడం కంటే, "నా ఆరోగ్య పరిస్థితికి రోబోటిక్ విధానం సరైనదేనా..? నా సమస్యకు ఇది అవసరమా..?" అని వైద్యులను సంప్రదించి స్పష్టత తీసుకోవడం ముఖ్యం.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
3. ఆపరేషన్ చేసేది రోబోనా లేక వైద్యుడా..?
రోబో దానంతటదే ఆపరేషన్ చేయదు. శస్త్రచికిత్స ప్రక్రియ పూర్తిగా అనుభవజ్ఞుడైన సర్జన్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. రోబోటిక్ చేతుల కదలికలు నూటికి నూరు శాతం సర్జన్ నియంత్రణలోనే ఉంటాయి. సర్జన్ ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే రోబోటిక్ పరికరాలు కదులుతాయి.
4. రోబో సహాయంతో ఏయే గుండె చికిత్సలు చేయవచ్చు..?
మైట్రల్ వాల్వ్ రిపేర్ ,రీప్లేస్‌మెంట్, అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్,పుట్టుకతో వచ్చే గుండె రంధ్రాల మూసివేత (ASD closure),ధమనులను మాత్రమే ఉపయోగించి చేసే ప్రత్యేక బైపాస్ శస్త్రచికిత్సలు, గుండెలో ఏర్పడే కణతులను (cardiac tumors) తొలగించే ప్రక్రియలు.
5. రోబోటిక్ విధానానికి ఉన్న పరిమితులు ఏమిటి..?
అత్యవసర గుండె సమస్యలు ఉన్నప్పుడు ఈ విధానం సరిపడకపోవచ్చు. కాళ్ల రక్తనాళాల్లో తీవ్రమైన పూడికలు ఉన్నవారికి, తీవ్ర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఇది అనుకూలం కాదు. ఒకేసారి బైపాస్, కవాటాల (valves) మార్పిడి అవసరమైన సంక్లిష్ట పరిస్థితుల్లో పరిమితులు ఉంటాయి. ప్రత్యేక శిక్షణ పొందిన సర్జన్లు, నైపుణ్యం కలిగిన బృందం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. పరికరాల ఖర్చు కూడా సంప్రదాయ పద్ధతుల కంటే ఎక్కువ.
రోగులు గమనించాల్సిన కీలక అంశాలు..
సమస్య రోబోటిక్ ప్రక్రియకు అనుకూలంగా ఉందో లేదో సరిచూసుకోవడం. ఆసుపత్రిలో రోబోటిక్ పరికరాలు, తగిన వసతులు సమగ్రంగా ఉండటం. శస్త్రచికిత్స చేసే సర్జన్‌కు రోబోటిక్ రంగంలో తగిన అనుభవం, నిరూపితమైన నైపుణ్యం ఉండటం. అత్యవసర పరిస్థితులను సమర్థంగా నిర్వహించగల మల్టీ-డిసిప్లినరీ వైద్య బృందం అందుబాటులో ఉండటం. ఈ అంశాలన్నీ సమకూరినప్పుడే రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా సురక్షితమైన, ఆశించిన ఫలితాలు లభిస్తాయని ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా.చిన్నబాబు సుంకవల్లి చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
