Eyeglasses : కళ్లజోడుపై గీతలు పడ్డాయా..? సరిగ్గా శుభ్రం చేయకపోతే కంటికే ప్రమాదం..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కంటి చూపు సరిగ్గా కనిపించాలన్నా, కంప్యూటర్ స్క్రీన్ల నుంచి రక్షణ పొందాలన్నా చాలామంది నిత్యం కళ్లజోడు వాడుతుంటారు. అయితే, రోజూ వాడే క్రమంలో అద్దాలపై చిన్న చిన్న గీతలు (scratches), జిడ్డు, దుమ్ము చేరడం సహజం. చాలామంది కనిపించిన చొక్కా కొంగుతోనో, చేతిరుమాలుతోనో అద్దాలను రుద్దేస్తుంటారు. కానీ ఈ అలవాటు వల్ల కళ్లజోడు అద్దాలు మరింత పాడవుతాయి. అద్దాలపై పడిన లోతైన గీతలను ఇంట్లో పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. అయితే సరైన పద్ధతుల్లో శుభ్రం చేసుకోవడం ద్వారా అద్దాలు మసకబారకుండా, కొత్తవాటిలా స్పష్టంగా కనిపించేలా చూసుకోవచ్చు. కళ్లజోడును నిత్యం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..

శుభ్రం చేసే సరైన విధానం..

ముందుగా గోరువెచ్చని నీటితో కడగాలి..కళ్లజోడును శుభ్రం చేయడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత అద్దాలను సాధారణ లేదా గోరువెచ్చని నీటి ధార కింద ఉంచాలి. దీనివల్ల అద్దాలపై చేరిన దుమ్ము ధూళి రేణువులు కొట్టుకుపోతాయి. అద్దాలు పొడిగా ఉన్నప్పుడు నేరుగా గుడ్డతో తుడిస్తే ఆ దుమ్ము రేణువులే గీతలు పడటానికి కారణమవుతాయి.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

మైల్డ్ లిక్విడ్ సోప్ వాడాలి..అద్దాలపై ఒక చుక్క సున్నితమైన లిక్విడ్ సోప్ లేదా బేబీ షాంపూ వేసి వేళ్లతో నెమ్మదిగా రుద్దాలి. రసాయనాలు, సువాసనలు లేదా మాయిశ్చరైజర్లు ఎక్కువగా ఉండే సబ్బులను వాడకూడదు. ఇవి అద్దాలకున్న యాంటీ గ్లేర్ కోటింగ్‌ను దెబ్బతీస్తాయి. ఆపై మంచి నీటితో కడిగేయాలి.

మైక్రోఫైబర్ క్లాత్‌తో మాత్రమే తుడవాలి..కడిగిన తర్వాత అద్దాలను కళ్లజోడు బాక్స్‌తో పాటు వచ్చే మైక్రోఫైబర్ క్లాత్‌తో మృదువుగా తుడవాలి. టిష్యూ పేపర్లు, పేపర్ నాప్‌కిన్లు, బట్టలతో ఎప్పుడూ తుడవకూడదు. మైక్రోఫైబర్ క్లాత్‌ను కూడా తరచూ ఉతుకుతూ శుభ్రంగా ఉంచుకోవాలి. లెన్స్ క్లీనింగ్ స్ప్రే..బయటకు వెళ్లినప్పుడు నీటి సౌకర్యం లేకపోతే ప్రత్యేకమైన లెన్స్ క్లీనింగ్ స్ప్రేను ఉపయోగించవచ్చు. స్ప్రే చల్లిన తర్వాత మైక్రోఫైబర్ క్లాత్‌తో సున్నితంగా తుడుచుకోవాలి.

పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..!

టూత్‌పేస్ట్, బేకింగ్ సోడా వద్దు..ఇంటర్నెట్‌లో కనిపించే చిట్కాలను చూసి టూత్‌పేస్ట్, బేకింగ్ సోడా లేదా వెనిగర్‌తో గీతలు పోగొట్టే ప్రయత్నం చేయకండి. వీటిలోని ఘర్షణ కలిగించే పదార్థాలు లెన్స్‌పై ఉండే యూవీ (UV), బ్లూ-రే కోటింగ్‌ను పూర్తిగా పాడుచేస్తాయి. చొక్కా, చీర కొంగులతో తుడవద్దు.. బట్టల ఫైబర్స్ గరుకుగా ఉండటం వల్ల అద్దాలపై కనిపించని సూక్ష్మ గీతలు ఏర్పడతాయి. వేడి నీటిని వాడకండి.. ఎక్కువ వేడి ఉండే నీటితో కడిగితే లెన్స్ కోటింగ్ దెబ్బతినే ప్రమాదం ఉంది.

భద్రంగా ఉంచేందుకు కొన్ని జాగ్రత్తలు..

కేస్‌లో మాత్రమే భద్రపరచండి: కళ్లజోడును తీసిన వెంటనే హార్డ్ కేస్‌లో పెట్టడం అలవాటు చేసుకోవాలి. టేబుల్స్ లేదా మంచంపై అద్దాలు కిందకు ఉండేలా ఎప్పుడూ బోర్లించకూడదు. కళ్లజోడు పెట్టుకునేటప్పుడు, తీసేటప్పుడు రెండు చేతులను ఉపయోగించాలి. ఒకే చేత్తో తీయడం వల్ల ఫ్రేమ్ వంగిపోయి, అద్దాలపై ఒత్తిడి పడుతుంది. గీతలు మరీ ఎక్కువగా ఉండి ఎదురుగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించకపోతే కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. తలనొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాంటి సందర్భాల్లో సొంత ప్రయోగాలు చేయకుండా ఆప్టికల్ స్టోర్‌కు వెళ్లి కొత్త లెన్స్‌ వేయించుకోవడమే ఉత్తమం.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.