Silent Liver Infection : నిశ్శబ్దంగా 'కాలేయ ఇన్ఫెక్షన్'.. ఎలాంటి లక్షణాలు లేకుండానే పెరుగుతున్న ముప్పు.. గుర్తించమెలా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు కలుషిత నీరు, ఆహారం కారణంగా కాలేయ సమస్యల బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా కాలేయానికి సోకే ఇన్ఫెక్షన్లను వైద్య పరిభాషలో హెపటైటిస్ (Hepatitis) అంటారు. మన శరీరంలో 500కు పైగా అత్యంత కీలక విధులను నిర్వర్తించే కాలేయం దెబ్బతింటే మొత్తం ఆరోగ్య వ్యవస్థే కుదేలవుతుంది. అయితే, ఈ ఇన్ఫెక్షన్ సోకినా నెలల తరబడి ఎలాంటి బయటి లక్షణాలు కనిపించకుండా శరీరంలోనే తిష్ఠ వేస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

‘సైలెంట్ కిల్లర్’గా హెపటైటిస్ ఎందుకు మారుతోంది..?

హెపటైటిస్ వైరస్‌లు ..ముఖ్యంగా హెపటైటిస్-బి, సి, బాక్టీరియాలు కాలేయంపై దాడి చేసినప్పుడు ప్రారంభ దశలో రోగికి ఎలాంటి స్పష్టమైన సంకేతాలు కనిపించవు. రోగి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపిస్తూ రోజువారీ పనులు చేసుకోగలరు. వైద్య నివేదికల ప్రకారం, హెపటైటిస్-సి బారిన పడిన వారిలో దాదాపు 75 నుంచి 85 శాతం మందిలో ఎలాంటి ప్రారంభ లక్షణాలు కనిపించవు. దీనివల్ల ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా మారి (chronic infection), కాలేయం తీవ్రంగా దెబ్బతినే వరకు బాధితులు దీనిని గుర్తించలేకపోతున్నారు. తగిన సమయంలో చికిత్స అందకపోతే ఇది క్రమంగా కాలేయ సిర్రోసిస్, కాలేయ వైఫల్యానికి (Liver Failure) దారితీసే ముప్పు ఉంది.

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

సాధారణంగా కనిపించే స్వల్ప సంకేతాలు..

కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపించినప్పటికీ, వాటిని పని ఒత్తిడి లేదా సాధారణ జీర్ణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కింది సంకేతాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. తీవ్రమైన అలసట, నీరసం..సరిపడా విశ్రాంతి తీసుకున్నా తగ్గని నిస్సత్తువ. జీర్ణ సంబంధ ఇబ్బందులు..ఆకలి మందగించడం, వికారం, వాంతులు, పొత్తికడుపులో ముఖ్యంగా కుడివైపు పైభాగంలో నొప్పి. ఫ్లూ లక్షణాలు.. స్వల్ప జ్వరం, కీళ్ల నొప్పులు, కండరాల పట్టేత. రంగులో మార్పులు..మూత్రం ముదురు రంగులోకి మారడం, మలం రంగు పాలిపోవడం. పచ్చకామెర్లు.. చర్మం, కళ్లలోని తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారడం.

నిర్ధారణ ఎలా..? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..?

కేవలం బాహ్య లక్షణాల ఆధారంగానే కాలేయ ఇన్ఫెక్షన్‌ను గుర్తించడం సాధ్యం కాదు. రక్త పరీక్షల ద్వారా మాత్రమే వైరస్ ఉనికిని, కాలేయం పనితీరును కచ్చితంగా అంచనా వేయవచ్చు. కాలేయ పనితీరు పరీక్షలు (LFT)..రక్తంలో ఎంజైమ్‌ల స్థాయులను పరిశీలించేందుకు ఎల్‌ఎఫ్‌టీ పరీక్ష తోడ్పడుతుంది. వైరల్ స్క్రీనింగ్..హెపటైటిస్-బి సర్ఫేస్ యాంటిజెన్ (HBsAg), హెపటైటిస్-సి యాంటీబాడీ పరీక్షల ద్వారా ఇన్ఫెక్షన్‌ను ప్రారంభంలోనే గుర్తించవచ్చు. కాచి చల్లార్చిన నీటిని తాగడం, తాజా ఆహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యం. హెపటైటిస్-బి నివారణకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నందున వైద్యుల సూచన మేరకు టీకా తీసుకోవాలి.

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.