Painkillers effect : పెయిన్ కిల్లర్స్ తరచూ వేసుకుంటున్నారా..? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..!
సాక్షి లైఫ్ : తలనొప్పి, కీళ్ల నొప్పులు, నడుంనొప్పి లేదా కండరాల నొప్పులు రాగానే చాలామంది వెంటనే పెయిన్ కిల్లర్స్ (painkillers) వేసుకుంటుంటారు. అప్పటికప్పుడు ఉపశమనం కోసం సరైన మోతాదులో వీటిని వాడటం బాగానే ఉన్నప్పటికీ.. వైద్యుల సలహా లేకుండా తరచూ ఇష్టానుసారంగా వాడటం ఆరోగ్యానికి తీవ్ర హానికరం. మోతాదు, వాడే వ్యవధిని బట్టి ఇవి శరీరంలోని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
నిత్యం పెయిన్ కిల్లర్స్ వాడితే శరీరంలో ఏం జరుగుతుంది..?
జీర్ణాశయంలో అల్సర్లు..
నొప్పి నివారణ మాత్రలను ఎక్కువగా వాడటం వల్ల జీర్ణాశయం లోపలి రక్షణ పొర దెబ్బతింటుంది. ఇది అల్సర్లు, అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతుల్లో రక్తం పడటం, మలం నల్లగా రావడం వంటివి గమనిస్తే వెంటనే వైద్యులను కలవాలి.
కిడ్నీల పనితీరుపై ప్రభావం..
కొన్ని రకాల మాత్రలు మూత్రపిండాలకు జరిగే రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. సుదీర్ఘకాలం పాటు అధిక మోతాదులో వాడితే, లేదా డీహైడ్రేషన్‌తో ఉన్నప్పుడు వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
కాలేయానికి ముప్పు..
పారాసెటమాల్‌ను పరిమితికి మించి వాడితే కాలేయం (liver) తీవ్రంగా దెబ్బతింటుంది. జలుబు, జ్వరం, బాడీ పెయిన్స్ కోసం వాడే చాలా మందుల్లో పారాసెటమాల్ కలిసి ఉంటుంది కాబట్టి.. ఒకేసారి రెండు వేర్వేరు మందులు వేసుకునేటప్పుడు డోస్ రెట్టింపు కాకుండా జాగ్రత్త వహించాలి. హై డోస్ ఉన్న కొన్ని ఎన్ఎస్ఏఐడీ (NSAID) మాత్రలను ఎక్కువ కాలం వాడటం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా హై బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
తలనొప్పి తగ్గడానికి తరచూ మాత్రలు వేసుకునేవారిలో 'మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్' వచ్చే అవకాశం ఉంది. అంటే.. ఉపశమనం కోసం వాడే మందులే తిరిగి తలనొప్పి రావడానికి కారణమవుతాయి. పెయిన్ కిల్లర్స్ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. నొప్పికి గల అసలు కారణాన్ని కనిపెట్టి చికిత్స తీసుకోకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది.
పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వైద్యులు సూచించిన మోతాదు మేరకు మాత్రమే వేసుకోవాలి.
ఒకే రకమైన రసాయనాలు (Active ingredients) ఉండే రెండు వేర్వేరు మందులను ఒకేసారి వేసుకోకూడదు. వైద్యుల సలహా లేకుండా ఎక్కువ కాలం పాటు సొంతంగా ఈ మాత్రలను వాడకూడదు. కిడ్నీ, లివర్, జీర్ణాశయం, గుండె సమస్యలు ఉన్నవారు ముందుగానే ఆ విషయాన్ని వైద్యులకు తెలియజేయాలి. రక్తం పలచబడే మందులు (Blood thinners) వాడేవారు వైద్యులు లేదా ఫార్మసిస్ట్ సూచన మేరకే నొప్పి నివారణ మాత్రలు వేసుకోవాలి.
ఓవర్‌డోస్ అయితే కనిపించే లక్షణాలు..
వాడే మందును బట్టి ఓవర్‌డోస్ లక్షణాలు ఉంటాయి. వాంతులు, కడుపు నొప్పి, తీవ్రమైన మగత, గందరగోళం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలి. ముఖ్యంగా పారాసెటమాల్ ఎక్కువైతే మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా, లోపల కాలేయం దెబ్బతింటుంది కాబట్టి తక్షణ వైద్య సహాయం తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
