Breast Cancer : గర్భిణుల్లోనూ రొమ్ము క్యాన్సర్ ముప్పు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!
సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు రావడం సహజం. ముఖ్యంగా రొమ్ముల పరిమాణంలో, ఆకృతిలో మార్పులు వస్తుంటాయి. అయితే, వీటిని కేవలం గర్భధారణ లక్షణాలుగా మాత్రమే భావించి నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే, ఇటీవలి కాలంలో చిన్న వయసు వారిలో, ముఖ్యంగా గర్భిణుల్లోనూ రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణ మార్పులకు, క్యాన్సర్ లక్షణాలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి సకాలంలో వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యం.
ప్రధాన కారణాలు..?
వయసు పెరగడం, కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉండటం, జన్యుపరమైన లోపాలు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అలాగే అధిక బరువు, శారీరక వ్యాయామం లేకపోవడం, మద్యం సేవించడం, హార్మోన్ల అసమతుల్యత వంటివి ముప్పును పెంచుతాయి. అయితే, ఎలాంటి ముందస్తు కారణాలు లేకపోయినా కొందరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనించాల్సిన ముఖ్య లక్షణాలు..
రొమ్ములో కొత్తగా గడ్డలు ఏర్పడటం, లేదా ఆ గడ్డలు తగ్గకుండా అలాగే ఉండిపోవడం. చర్మం రంగులో లేదా ఆకృతిలో అసాధారణ మార్పులు రావడం. చనుమొనలు (Nipples) లోపలికి లాగినట్లుగా ముడుచుకుపోవడం. చనుమొనల నుంచి అసాధారణ స్రావాలు లేదా రక్తం కారడం. చంక భాగంలో గడ్డలు తగలడం.
వ్యాధి నిర్ధారణ (Diagnosis)..
గర్భిణుల్లో రొమ్ము గడ్డలను గుర్తించడానికి ముందుగా అల్ట్రాసౌండ్ (Ultrasound) స్కాన్ చేస్తారు. అనుమానం ఉంటే, క్యాన్సర్ తీవ్రతను తెలుసుకోవడానికి మమ్మోగ్రఫీ లేదా బయాప్సీ వంటి పరీక్షలు సూచిస్తారు. గడ్డ తగిలిన వెంటనే దాన్ని గర్భధారణ వల్ల వచ్చిన మార్పుగా కొట్టిపారేయకూడదు.
చికిత్స ఎలా అంటే..?
రొమ్ము క్యాన్సర్ ఏ దశలో ఉంది, గర్భం దాల్చి ఎన్ని వారాలు అవుతోంది, మహిళ ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనే అంశాల ఆధారంగా చికిత్సను నిర్ణయిస్తారు. గర్భధారణ సమయంలో కూడా సురక్షితంగా సర్జరీ చేసే అవకాశాలు ఉంటాయి. మొదటి త్రైమాసికం (First Trimester) ముగిసిన తర్వాత వైద్యుల పర్యవేక్షణలో కీమోథెరపీ కూడా అందించవచ్చు.
అయితే రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ వంటివి మాత్రం కడుపులోని బిడ్డపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, వాటిని సాధారణంగా ప్రసవం తర్వాతే ఇస్తారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన వెంటనే కంగారు పడకుండా, తల్లి ప్రాణాలతో పాటు బిడ్డ భద్రతను దృష్టిలో ఉంచుకుని గైనకాలజిస్ట్, ఆంకాలజిస్ట్ పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
