Papaya Benefits : బొప్పాయితో కడుపుకే కాదు.. గుండెకూ ఎంతో మేలు! కానీ వీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బొప్పాయి కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు కేరాఫ్ అడ్రస్. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బొప్పాయిలో ఉండే 'పపైన్' (Papain) అనే ఎంజైమ్ ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

బొప్పాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

పోషకాల నిధి.. బొప్పాయిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, తక్కువ మోతాదులో ప్రోటీన్లు, క్యాల్షియంతో పాటు విటమిన్ ఎ, సి, ఇ, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మ ఆరోగ్యానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడుతుంది.

జీర్ణక్రియకు మేలు..బొప్పాయిలో నీటి శాతం, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. పపైన్ ఎంజైమ్ ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.

గుండెకు రక్ష..ఇందులో ఉండే విటమిన్-సి, కెరోటినాయిడ్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని (Oxidative stress) తగ్గిస్తాయి. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించగా.. ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.

క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో..: బొప్పాయిలోని లైకోపీన్ కణాల నష్టాన్ని అడ్డుకుంటుంది. అయితే ఇది క్యాన్సర్‌ను పూర్తిగా నివారిస్తుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ, ఆ ప్రమాదాన్ని తగ్గించడంలో కొంతమేర తోడ్పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎవరు జాగ్రత్తపడాలి..?

బాగా పండిన బొప్పాయిని మితంగా తీసుకుంటే అందరికీ సురక్షితమే. కానీ, కొందరు మాత్రం దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పచ్చి లేదా సగం పండిన బొప్పాయిలో 'లేటెక్స్' (Latex) శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భాశయ సంకోచాలకు దారితీసే ప్రమాదం ఉన్నందున గర్భిణులు పచ్చి బొప్పాయికి దూరంగా ఉండటమే మేలు. అంతేకాదు ఒకవేళ పండిన బొప్పాయి తినే ముందు కూడా వైద్యుల సలహా తీసుకోవాలి.

 బొప్పాయి లేదా లేటెక్స్ పడక ఎలర్జీ వచ్చే వారు దీనికి దూరంగా ఉండాలి. ఒకవేళ తిన్న తర్వాత దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మోతాదుకు మించి తింటే కడుపులో నొప్పి, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు: ఏదైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ క్రమం తప్పకుండా మందులు వాడేవారు డైట్‌లో బొప్పాయిని పెద్ద మొత్తంలో చేర్చుకునే ముందు వైద్యులను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.