చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు..
సాక్షి లైఫ్: ఉష్ణోగ్రతలు తగ్గడంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. శీతాకాలంలో ఇన్ఫ్లుఎంజా, జలుబు సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో పొడి దగ్గు సమస్య చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఈ సీజన్ లో చేసే జలుబు వైరల్ ఇన్ఫెక్షన్ సమస్యగా పరిగణిస్తారు.
కొందరికి ముక్కు, శ్వాసనాళాలు, గొంతు,సైనస్ సమస్య కూడా ఉంటుంది. ఇది కాకుండా, దగ్గుతో పాటు, కొంతమందికి ముక్కు మూసుకుపోవడం లేదా కారడం, తుమ్ములు, అలసట, గొంతు నొప్పి వంటివి కూడా ఉండవచ్చు.
చలికాలంలో ప్రజలందరూ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పొడి దగ్గు సమస్య ఎందుకు వస్తుంది. దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలంలో పొడి దగ్గు సమస్య..
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇంటి లోపల ఎక్కువ సమయం గడుపుతుంటారని వైద్యులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితి ఇన్ఫ్లుఎంజా వైరస్ వంటి అంటు వ్యాధుల సంక్రమణను పెంచుతుంది. చల్లని వాతావరణంలో గాలి పొడిగా ఉండటం వల్ల పొడి దగ్గు సమస్య కూడా పెరుగుతుంది. పొడి గాలి మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీంతో నాసికా రంధ్రాలు పొడిగా మారతాయి. దీని కారణంగా ఇన్ఫ్లుఎంజా సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది.
పొడి దగ్గును ఎలా నివారించవచ్చు..?
తేనె దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి గొంతులో వాపును తగ్గించడంలో సహాయ పడతాయి. అంతేకాదు శ్లేష్మాన్నీ తగ్గించడంలోనూ గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఒక కప్పు వేడి "టీ " లేదా వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల దగ్గు, గొంతు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గుతో బాధపడే పిల్లలకు తేనె ఇవ్వడం ప్రయోజనకరమని అధ్యయనాల్లో సైతం వెల్లడైంది.
ఉప్పు నీటిని పుక్కిలించాలి..
దగ్గు, గొంతు నొప్పి సమస్య ఉంటే ఉప్పు నీటితో పుక్కిలించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉప్పు నీరు కణజాలాల వాపును తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఉప్పు నోరు , గొంతులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ కనీసం మూడు సార్లు ఉప్పు నీటితో పుక్కిలిస్తే దగ్గు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఆవిరి పీల్చడం వల్ల కలిగే ప్రయోజనాలు..
గొంతు నొప్పి లేదా ఇన్ఫెక్షన్ కారణంగా మూసుకు పోయిన ముక్కు సమస్యను తగ్గించడానికి ఆవిరిని పీల్చడం ప్రయోజనకరంగా ఉంటుంది. వేడి నీటి నుంచి వచ్చే ఆవిరి నాసికా రంధ్రాలను గొంతు పొడిబారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు గొంతు నొప్పి, మంట, దగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
