Weight Loss Drug Prices : భారీగా తగ్గనున్న వెయిట్ లాస్ మందుల ధరలు..
సాక్షి లైఫ్ : ఊబకాయం, మధుమేహంతో బాధపడేవారికి భారీ ఊరట లభించనుంది. బరువు తగ్గడానికి వాడే ఇంజెక్టబుల్ మందుల ధరలు భారీగా తగ్గనున్నాయి. సెమాగ్లుటైడ్ (Semaglutide) వంటి కీలక ఔషధాల పేటెంట్ గడువు ముగియడంతో, దేశీయ ఫార్మా కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరల కంటే ఏకంగా 90 శాతం తక్కువ ధరకే జెనరిక్ వెర్షన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈరోజు నుంచే ఈ కొత్త ధరలు అమలుకానున్నాయి. ప్రముఖ కంపెనీలైన నాట్కో ఫార్మా, ఎరిస్ లైఫ్‌సైన్సెస్ ఇప్పటికే తమ ప్రణాళికలను ప్రకటించగా.. సన్ ఫార్మా, జైడస్, డాక్టర్ రెడ్డీస్ వంటి సంస్థలు కూడా త్వరలోనే ఈ పోటీలో చేరనున్నాయి.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ధరల వ్యత్యాసం..
ప్రస్తుతం విదేశీ కంపెనీలైన నోవో నార్డిస్క్ ఓజెంపిక్, వెగోవీ, ఎలీ లిల్లీ మౌంజారో వంటి బ్రాండ్లు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే ఇప్పుడు దేశీయంగా లభించే ప్రత్యామ్నాయాలతో ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి. బరువు తగ్గించే మందుల మార్కెట్లో రాబోతున్న విప్లవాత్మక మార్పుల వల్ల సాధారణ రోగులపై ఆర్థిక భారం భారీగా తగ్గనుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండెడ్ ఓజెంపిక్ (Ozempic) వంటి మందుల కనీస ధర నెలకు రూ. 8,800 వరకు ఉండగా, ఇప్పుడు దేశీయ కంపెనీలు ప్రవేశపెడుతున్న జెనరిక్ వెర్షన్లు మరింతగా తగ్గనున్నాయి.
ఆధునిక సాంకేతికతతో కూడిన జెనరిక్ పెన్ డివైస్ (Pen Device) కేవలం రూ. 4,000 లకే లభ్యం కానుంది. మరీ ముఖ్యంగా, సామాన్యులకు మరింత చేరువయ్యేలా రూపొందించిన మల్టీ-డోస్ వయల్స్ (Vials) ధర అయితే ఏకంగా రూ. 1,290 నుంచి రూ. 1,300 మధ్య ఉండటం విశేషం. అంటే బ్రాండెడ్ మందులతో పోలిస్తే దాదాపు 90 శాతం తక్కువ ధరకే ఈ అత్యుత్తమ చికిత్స అందుబాటులోకి రాబోతోంది.
ఎలా పని చేస్తుంది..?
ఈ ఔషధాన్ని GLP-1 (Glucagon-like peptide-1) రిసెప్టర్ అగోనిస్ట్ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా రెండు రకాలుగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆకలిని తగ్గించి (improve satiety), తద్వారా ఆహారంపై కోరికను నియంత్రిస్తుంది. దీనివల్ల క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
రోగులకు పెరగనున్న అందుబాటు..
చాలా కాలంగా అధిక ధరల కారణంగా సామాన్యులకు అందని ద్రాక్షగా ఉన్న ఈ చికిత్స, ఇప్పుడు అందుబాటులోకి రానుంది. "వైయల్స్ (Vials) రూపంలో లభించే మందులు పెన్ డివైస్‌ల కంటే 70 శాతం చౌకగా లభించే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలిక చికిత్స తీసుకునే రోగులకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుంది" అని నాట్కో ఫార్మా ప్రతినిధులు తెలిపారు. అయితే, ఈ వైయల్స్‌ను సిరంజి ద్వారా నిపుణుల సమక్షంలో లేదా తగిన జాగ్రత్తలతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి బరువు తగ్గించే మందులను సొంతంగా వాడకూడదు. కేవలం అర్హత కలిగిన వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచన మేరకు మాత్రమే వాడాలి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
