సాక్షి లైఫ్ : వంట నూనెలు అనేకరకాలున్నాయి. ఎలాంటి ఆయిల్ వాడితే ప్రయోజనం ఉంటుంది..? ముఖ్యంగా ఇటీవల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వినియోగం విపరీతంగాపెరిగిపోతోంది. రిఫైండ్ ఆయిల్స్ ధరలు పెరగడంతో, అవే ధరల్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మార్కెట్లో లభించడంతో వినియోగదారులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వినియోగించడం వల్ల ఉపయోగాలేంటో చూద్దాం..!
కోల్డ్ ప్రెస్‌డ్ ఆయిల్, వుడ్ ప్రెస్‌డ్ ఆయిల్స్ అనే మాటలు మీరు తరచూ వినే ఉంటారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఇమ్యూనిటీపై శ్రద్ధ పెరిగింది. హానికారక ఆహార ఉత్పత్తులకు బదులుగా ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసే వాటిని మాత్రమే ఎంచుకుంటున్నారు. ఇదే కోవలో రిఫైన్డ్ ఆయిల్స్‌కు బదులుగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, వుడ్ ప్రెస్‌డ్ ఆయిల్స్ వాడుతున్నారు.
కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ప్రత్యేకత..?
కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ప్రత్యేకత ఏంటంటే నూనె గింజల నుంచి నూనెను వెలికి తీయడంలో రసాయనాలు వాడరు. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రతలు అవసరం లేదు. వుడ్ ప్రెస్‌డ్ ఆయిల్ అంటే గానుగ నూనె. కేవలం పశువులను వినియోగించి గానుగలో నూనె గింజలు వేరుశనగ, నువ్వులు, కుసుమలు, వంటివి వేసి క్రష్ చేయడం ద్వారా నూనెను ఉత్పత్తి చేస్తారు.
ఇది కాస్త శ్రమతో కూడుకున్న పని, యంత్రాల మాదిరిగా వేగంగా ఉత్పత్తి చేయలేరు. నూనె వెలువడేది కూడా తక్కువే. నిల్వ కాలం కూడా తక్కువే. కాబట్టి కాస్త రేటు ఎక్కువగా ఉంటుంది. కోల్డ్ ప్రెస్‌డ్, వుడ్ ప్రెస్‌డ్ వెలికితీత దాదాపుగా ఒకేరీతిలో ఉంటుంది.
రిఫైన్డ్ ఆయిల్స్ అంటే..?
రిఫైన్డ్ ఆయిల్స్ అంటే మనం సాధారణంగా వాడే రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ వంటివి. రిఫైండ్ ఆయిల్స్ తయారీలో నూనె గింజల నుంచి నూనెను వెలికితీసే ప్రక్రియలో ఎక్కువ నూనె ఉత్పత్తి చేసేందుకు కెమికల్స్ వినియోగిస్తారు.
ఎసిటిక్ యాసిడ్, హెగ్జేన్, బ్లీచింగ్ సోడా వంటివి వినియోగిస్తారు. అంతేకాకుండా ఈ వెలికితీత ప్రక్రియలో హీటింగ్ కోసం అధిక ఉష్ణోగ్రతలు వినియోగించాల్సి వస్తుంది. నిల్వ కాలం ఎక్కువగా ఉండేందుకు కూడా కెమికల్స్, హీటింగ్ ప్రాసెస్ పనికొస్తుంది.
రిఫైన్డ్ ఆయిల్స్ వెలికితీత ప్రక్రియిలో ఉపయోగించే కెమికల్స్, అధిక ఉష్ణోగ్రతల వినియోగం కారణంగా పోషకాలు, ఫ్లేవర్ కోల్పోతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఫ్యాటీ యాసిడ్స్..
కోల్డ్ ప్రెస్‌డ్, వుడ్ ప్రెస్‌డ్ ఆయిల్స్ విషయంలో ఈ సమస్య ఉండదని, అందుకే సహజమైన సువాసన, శరీరానికి కావాల్సిన ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ "ఈ", విటమిన్ "కె", విటమిన్ "సి" లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందువల్ల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారంటున్నారు.
రిఫైన్డ్ ఆయిల్స్..
రిఫైన్డ్ ఆయిల్స్ అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉత్పత్తవుతున్నందు వల్ల వాటిని ఎంత మరిగించినా పెద్దగా మార్పు ఉండదని, కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మరిగించినప్పుడు పోషకాలు కోల్పోతాయని మరో వాదన కూడా ఉంది.
తక్కువ వేడితో చేసే ఆహార పదార్థాలకు..
కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, వుడ్ ప్రెస్‌డ్ ఆయిల్స్ ఎక్కువగా మరిగించి చేయాల్సిన ఆహార పదార్థాలకు వాడకుండా, తక్కువ వేడితో చేసే ఆహార పదార్థాలకు వినియోగించడం మేలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
డీప్ ఫ్రై చేయాల్సి వస్తే ..
డీప్ ఫ్రై చేయాల్సి వస్తే కాస్త పొగ వెలువడినట్టు కనిపిస్తుంది. ఇలాంటి అవసరాలకు రిఫైన్డ్ ఆయిల్స్ వినియోగిస్తే సరిపోతుంది. మొత్తం మీద కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, వుడ్ ప్రెస్‌డ్ ఆయిల్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com