Diabetes and High BP : ఏం తింటున్నాం.. ఎప్పుడు తింటున్నాం..?..రెండూ కీలకమే..! షుగర్, బీపీ బాధితులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని అందరికీ తెలుసు. అయితే కేవలం మంచి ఆహారాన్ని ఎంచుకుంటే సరిపోదు.. దానిని ఏ సమయంలో తింటున్నామనేది కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో వేళ తప్పి తినడం సర్వసాధారణమైపోయింది. కానీ, ఆహార సమయాల్లో వచ్చే ఈ హెచ్చుతగ్గులు జీవక్రియల (metabolism) నుంచి రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిల వరకు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా మధుమేహం (diabetes), అధిక రక్తపోటు (hypertension) ఉన్నవారికి ఇది మరింత చేటుచేస్తుంది.

శరీర గడియారానికి (biological clock) ఆహార సమయానికి సంబంధమేంటి..?

 మన శరీరంలో నిద్ర, జీర్ణక్రియ, హార్మోన్ల విడుదలను సమన్వయం చేసే సహజసిద్ధమైన అంతర్గత గడియారం (circadian rhythm) ఉంటుంది. ఉదయం నిద్రలేవగానే జీర్ణవ్యవస్థ ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ చాలామంది ఉదయం అల్పాహారాన్ని (breakfast) దాటవేయడం, పగటిపూట గంటల తరబడి ఏమీ తినకుండా ఉండటం, రాత్రివేళ బాగా పొద్దుపోయాక భారీ భోజనం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఈ క్రమరాహిత్యం శరీర జీవక్రియలను తలకిందులు చేసి, శక్తిని, గ్లూకోజ్‌ను నియంత్రించే అంతర్గత వ్యవస్థలను దెబ్బతీస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలపై చూపే ప్రభావం..

మధుమేహ బాధితులు ఆహార సమయాలను మార్చడం వల్ల తీవ్రమైన ఒడిదొడుకులు ఎదురవుతాయి. వేళతప్పి తినే అలవాటు వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) పెరుగుతుంది. కణాలు గ్లూకోజ్‌ను సమర్థవంతంగా వినియోగించుకోలేవు.

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

హైపోగ్లైసీమియా, హైపర్‌గ్లైసీమియా ముప్పు.. మందులు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునే రోగులు సరైన సమయానికి భోజనం చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయికి పడిపోవడం (hypoglycemia) లేదా ఆ తర్వాత ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోవడం (hyperglycemia) జరుగుతుంది.
 సాయంత్రం తర్వాత మన శరీరంలో ఇన్సులిన్ పనితీరు నెమ్మదిస్తుంది. రాత్రి 9 లేదా 10 గంటల తర్వాత కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే భోజనం చేస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు రాత్రంతా నియంత్రణ కోల్పోతాయి.

రక్తపోటు (bp)పై పడే భారం..

ఆహార సమయాల్లో తేడాలు నేరుగా రక్తపోటును సైతం ప్రభావితం చేస్తాయి. రాత్రి ఆలస్యంగా ఉప్పు, మసాలాలు ఎక్కువగా ఉండే భోజనం చేయడం వల్ల శరీరంలో నీటి నిల్వలు (water retention) పెరిగి, రాత్రి సమయంలో రక్తపోటు తగ్గకుండా అలాగే ఉండిపోతుంది దీనిని 'నాన్-డిప్పింగ్ బీపీ' అంటారు. ఇది గుండె, మూత్రపిండాలపై అదనపు భారాన్ని మోపి దీర్ఘకాలంలో గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలను పెంచుతుంది. వేళకు తినకపోవడం వల్ల పెరిగే ఒత్తిడి హార్మోన్ల (cortisol) ప్రభావంతో రక్తనాళాలు సంకోచించి బీపీ మరింత పెరుగుతుంది.

పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు..

ఉదయం అల్పాహారాన్ని వదలొద్దు..నిద్రలేచిన గంట నుంచి రెండు గంటలలోపు సమతుల్యమైన అల్పాహారంలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఉండేలా తీసుకోవాలి. నిర్ణీత సమయాల నియమం.. ప్రతిరోజూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాన్ని దాదాపు ఒకే సమయానికి పూర్తి చేసేలా షెడ్యూల్ అలవర్చుకోవాలి.

రాత్రి భోజనం ముందుగానే..నిద్రపోయే సమయానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందే రాత్రి 7:30 - 8:00 లోపు తేలికపాటి భోజనం ముగించడం శ్రేయస్కరం. వైద్యులు సూచించిన డయాబెటిస్ లేదా బీపీ మందులను ఆహార సమయంతో సరిగ్గా సమన్వయం చేసుకుని వేసుకోవాలి. ఆహార నాణ్యత ఎంత ప్రధానమో, భోజన వేళల క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. సమయానికి తినే అలవాటు మందుల వాడకాన్ని తగ్గించడమే కాకుండా, రక్తపోటు, షుగర్‌లను సులభంగా అదుపులో ఉంచుతుంది.

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.