New study : బీపీ మందులతో కిడ్నీలకు ముప్పేనా..? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..!
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు, హైబీపీ(high blood pressure) బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగు తోంది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి చాలామంది నిత్యం బీపీ మందులు వాడుతుంటారు. అయితే, బీపీని అదుపు చేసే కొన్ని సాధారణ మందులు మీ కిడ్నీల ( kidney) ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉండి, హైబీపీకి మందులు వాడేవారిలో ఈ ముప్పు 33 శాతం అధికంగా ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
అసలు అధ్యయనం ఏం చెబుతోంది..?
ఇజ్రాయెల్ పరిశోధకులు టైప్-2 డయాబెటిస్ ఉన్న సుమారు 31,000 మంది వయోజనుల ఆరోగ్య డేటాను మూడున్నరేళ్ల పాటు పరిశీలించారు. ఇందులో ముఖ్యంగా 'డైహైడ్రోపైరిడిన్ కాల్షియం-ఛానల్ బ్లాకర్స్' (DCCBs) వర్గానికి చెందిన బీపీ మందులు వాడేవారిపై అధ్యయనం చేశారు. ఈ డీసీసీబీ (DCCB) మందుల్లో ప్రధానంగా అమ్లోడిపైన్ (Amlodipine), లాసిడిపైన్, నిఫెడిపైన్ వంటివి ఉంటాయి.
ఇతర వర్గాలకు చెందిన బీపీ మందులు వాడే వారితో పోలిస్తే, ఈ డీసీసీబీ మందులు వాడేవారిలో మూత్రపిండాల సమస్యల ప్రమాదం 33శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కొందరిలో కిడ్నీల సామర్థ్యం 40శాతం కన్నా కిందకు పడిపోయి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరమయ్యే స్థాయికి చేరుకున్నట్లు గుర్తించారు.
కిడ్నీలపై ఈ మందులు ఎలా ప్రభావం చూపుతాయి..?
సాధారణంగా డీసీసీబీ మందులు రక్తనాళాలను వ్యాకోచించేలా చేసి రక్తపోటును తగ్గిస్తాయి. అయితే, ఇలా చేయడం వల్ల కిడ్నీల లోపల ఉండే సూక్ష్మమైన ఫిల్టర్లకు రక్త ప్రవాహం తీవ్రంగా పెరుగుతుంది. అప్పటికే మధుమేహం (diabetes) కారణంగా బలహీనపడి ఉన్న కిడ్నీల మీద, ఈ మందుల వల్ల అదనపు ఒత్తిడి పడి అవి త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ అధ్యయన ఫలితాలను చూసి భయపడి ఎవరూ సొంతంగా బీపీ మందులు వాడటం ఆపేయకూడదని పరిశోధకులు స్పష్టం చేశారు.
ముప్పును పెంచే కారకంగా..
ఈ మందులు నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయని కచ్చితంగా నిర్ధారించలేము, కానీ ముప్పును పెంచే కారకంగా మారొచ్చని మాత్రమే అధ్యయనం చెబుతోంది. టైప్-2 డయాబెటిస్ ఉండి బీపీ మందులు వాడుతున్న వారు క్రమం తప్పకుండా కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాలి. మందులు మార్చాలా వద్దా అనేది రోగి పూర్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ మాత్రమే నిర్ణయించగలరు. డయాబెటిస్, హైబీపీ ఉన్నవారు ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మూత్రపిండాల వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారించవచ్చు.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
