Maximum Health Benefits of Walnuts : వాల్‌నట్స్‌ ఇలా తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : డ్రైఫ్రూట్స్ అనగానే ముందుగా బాదం, జీడిపప్పు గుర్తుకొస్తాయి కానీ.. వాల్‌నట్స్ (walnuts) గురించి ప్రస్తావించడం చాలా తక్కువే. అచ్చం మన మెదడు ఆకృతిలో ఉండే ఈ గింజలు పోషకాల గని అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మరెన్నో ఖనిజ లవణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. మన రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. అయితే, వీటిని కేవలం తినడం మాత్రమే కాదు.. సరైన పద్ధతిలో తీసుకుంటేనే పూర్తి లాభాలు అందుతాయి. వాల్‌నట్స్ వల్ల కలిగే ఆరు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, వాటిని తినాల్సిన విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

వాల్‌నట్స్‌తో 6 అద్భుత ప్రయోజనాలు.. 

వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పాలీఫెనాల్స్ మెదడు చురుకుగా పనిచేయడానికి అద్భుతంగా సాయపడతాయి. రోజూ వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

వాల్‌నట్స్‌లోని ఆరోగ్యకరమైన కొవ్వులు (healthy fats), యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత సమస్యలను దూరంగా ఉంచుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

 ఫైబర్ (fiber) అధికంగా ఉండటం వల్ల వాల్‌నట్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలను దరిచేరనివ్వవు.

వాల్‌నట్స్‌లో క్యాలరీలు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఇందులోని ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీనివల్ల పదే పదే జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

 వాల్‌నట్స్‌లో మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనతను అడ్డుకుంటాయి.

వీటిలో పుష్కలంగా లభించే విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు 'ఫ్రీ రాడికల్స్' వల్ల చర్మానికి జరిగే నష్టాన్ని నివారిస్తాయి. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచడమే కాకుండా, జుట్టు రాలడాన్ని తగ్గించి కురులు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

తినాల్సిన సరైన పద్ధతి ఇదే..!

వాల్‌నట్స్ ఒక అద్భుతమైన సూపర్‌ఫుడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, వీటిని నేరుగా అలాగే తినడం కంటే.. రాత్రి నిద్రపోయే ముందు ఓ రెండు లేదా మూడు వాల్‌నట్స్‌ను నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తింటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది. ఇలా నానబెట్టడం వల్ల గింజల్లోని వేడి చేసే గుణం తగ్గి, వాటిలోని పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. మితంగా, క్రమం తప్పకుండా వాల్‌నట్స్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చని పోషకాహారనిపుణులు చెబుతున్నారు.  

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.