Working Out at the Gym : జిమ్‌లో చెమటోడుస్తున్నా మార్పు కనిపించడం లేదా..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయడం ఎంతో అవసరం. అయితే, నెలల తరబడి జిమ్‌కు వెళ్లి చెమటోడుస్తున్నా.. శరీరంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని చాలామంది నిరాశతో మధ్యలోనే మానేస్తుంటారు. నిజానికి వ్యాయామం చేయడం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే దాని ప్రభావం శరీరంపై పడుతుంది. కానీ, కండరాలు పెరగాలన్నా లేదా బరువు తగ్గాలన్నా ఆశించిన ఫలితాలు కంటికి కనిపించడానికి కనీసం 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. మరి మీరు చేస్తున్న వర్కౌట్ సరైన ట్రాక్‌లో ఉందో, లేదో తెలుసుకోవడానికి మీ శరీరమే కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవేంటో చూద్దాం..
ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
మీరు చేస్తున్న వ్యాయామం ఫలిస్తోందని చెప్పే 5 సంకేతాలివే..
బరువు తగ్గడం, కండరాలు పెరగడం మాత్రమే వ్యాయామానికి గీటురాయి కాదు. మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పడానికి పలు మార్పులే నిదర్శనం..
1. చురుకైన మెదడు..వ్యాయామం కేవలం కండరాలకే కాకుండా మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మీరు క్రమం తప్పకుండా వర్కౌట్ చేస్తుంటే నాడీ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. మునుపటి కంటే మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. జ్ఞాపకశక్తి పదునుదేరుతుంది. భావోద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యం పెరుగుతుంది.
2. దుస్తుల విషయంలో మార్పు..
జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టాక వెయింగ్ స్కేల్ పై పెద్దగా మార్పు కనిపించకపోవచ్చు. కానీ, మీరు వేసుకునే పాత దుస్తులు ఇప్పుడు వదులుగా మారుతుంటే మీ వర్కౌట్ ఫలిస్తున్నట్లే. కొవ్వు కరిగి, కండరాలు పెరగడం వల్ల శరీర ఆకృతిలో ఈ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.
3. కంటినిండా నిద్ర..
వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసిపోయి రాత్రి పూట త్వరగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢనిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి సమస్యలు దూరమై, ఉదయం లేచేసరికి శరీరం ఎంతో విశ్రాంతిగా, ఉల్లాసంగా అనిపిస్తుంది.
4. ఆయాసం లేకపోవడం..
ఏరోబిక్స్, కార్డియో వంటి వ్యాయామాలు ఊపిరితిత్తులు, గుండె సామర్థ్యాన్ని పెంచుతాయి. వర్కౌట్ చేసేటప్పుడు మునుపటిలా త్వరగా ఆయాసపడకపోవడం, గుండె కొట్టుకునే వేగం పెరిగినా త్వరగా మళ్లీ సాధారణ స్థితికి రావడం మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతోందనడానికి సూచిక.
5. ఆహ్లాదకరమైన మానసిక స్థితి..
వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరంలో 'ఎండార్ఫిన్లు' విడుదల వుతాయి. ఇవి ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక సమస్యలను దరిచేరనివ్వవు. తరచూ వచ్చే చిరాకు తగ్గిపోయి, రోజంతా సానుకూల దృక్పథంతో ఉత్సాహంగా గడుపుతారు.
ఫలితాలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు..
మీ ఫిట్‌నెస్ లక్ష్యాలు నెరవేరాలంటే కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు. పలు అంశాలు కూడా కీలకంగా వ్యవహరిస్తాయి.
క్రమం తప్పకుండా చేయడం..
ఏదో రెండు రోజులు చేసి మానేయడం కాదు. కనీసం వారానికి 150 నిమిషాల పాటు కార్డియో, రెండు రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తప్పనిసరిగా చేయాలి.
సరైన పోషకాహారం..
మీరు బరువు తగ్గాలనుకుంటే, రోజువారీగా శరీరంలో ఖర్చయ్యే కేలరీల కంటే తీసుకునే ఆహారంలో కేలరీలు తక్కువగా (Caloric Deficit) ఉండేలా చూసుకోవాలి.
జీవనశైలి..
మీ జీవనశైలి సక్రమంగా లేకపోతే వ్యాయామం చేసినా ప్రయోజనం ఉండదు. నిరంతరం ఒత్తిడికి గురికావడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
జన్యువులు..
కండరాల నిర్మాణం, జీవక్రియల పనితీరులో జన్యుపరమైన అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఒకరికి వచ్చినంత వేగంగా మరొకరికి ఫలితాలు రాకపోవచ్చు. 2017లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. వారానికి 7 నుంచి 8 గంటల పాటు నాలుగు నెలల పాటు నిరంతరాయంగా తీవ్రమైన వ్యాయామం చేసిన వారు తమ శరీర బరువులో 7 శాతం వరకు తగ్గినట్లు తేలింది.
ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!
ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
