Plantar Fasciitis : ఉదయం మంచం దిగగానే మడమలో సూదులతో గుచ్చినట్టు నొప్పా..? ఐతే ప్లాంటర్ ఫాసిటిస్ కావొచ్చు..!
సాక్షి లైఫ్ : రాత్రంతా హాయిగా నిద్రపోయి ఉదయం మంచం దిగగానే మడమలో తీవ్రమైన నొప్పి అనిపిస్తోందా? రెండు అడుగులు వేయగానే నొప్పి కాస్త తగ్గుతున్నా, ఎక్కువసేపు నిలబడితే లేదా నడిస్తే మళ్లీ బాధ మొదలవుతోందా? అయితే ఇది సాధారణ అలసట కాదు, ప్లాంటర్ ఫాసిటిస్ అనే పరిస్థితి కావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఏమిటిది..?
మడమ నుంచి కాలి వేళ్ల వరకు పాదం అడుగుభాగంలో వ్యాపించి ఉండే ఫాసియా అనే తంతు కణజాలంలో వాపు రావడాన్నే ప్లాంటర్ ఫాసిటిస్ అంటారు. ఈ కణజాలం నడక సమయంలో పాదానికి కుషన్‌లా పనిచేస్తుంది. దీనిపై ఒత్తిడి ఎక్కువైనప్పుడు చిన్న చిన్న చిరుగులు ఏర్పడి, వాపుతో పాటు నొప్పి మొదలవుతుంది.
ఎవరికి ఎక్కువ ప్రమాదం..?
రోజంతా నిలబడి పనిచేసే వారు టీచర్లు, నర్సులు, సేల్స్ సిబ్బంది.పరుగు, నడక ఎక్కువగా చేసేవారు, సరిగా సపోర్ట్ ఇవ్వని చెప్పులు, బూట్లు వాడేవారు, పాదాల ఆర్చ్‌లో నిర్మాణపరమైన మార్పులు ఉన్నవారు, చీలమండ, పిక్క కండరాలు బిగుతుగా ఉన్నవారు.
లక్షణాలు..
ఉదయం లేవగానే మొదటి అడుగులలో తీవ్రమైన నొప్పి, కాసేపు కూర్చున్న తర్వాత లేచి నడిచేటప్పుడు మళ్లీ నొప్పి రావడం, ఎక్కువసేపు నిలబడితే మంట పెట్టినట్టు అనిపించడం వంటివి సాధారణ లక్షణాలు.
నిర్ధారణ ఎలా..?
వైద్యులు సాధారణంగా పాదాన్ని పరీక్షించి, నొప్పి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి నిర్ధారిస్తారు. ఇతర కారణాలను తోసిపుచ్చడానికి అవసరమైతే ఎక్స్-రే లేదా MRI స్కాన్ సూచించవచ్చు.
చికిత్స మార్గాలు..
పాదానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం,ఐస్ ప్యాక్‌తో కాపడం పెట్టడం,వైద్యుల సూచన మేరకు నొప్పి నివారణ మందులు వాడటం,మంచి ఆర్చ్ సపోర్ట్ ఉన్న పాదరక్షలు, ప్రత్యేక ఇన్సోల్స్ వాడటం,ఫిజియోథెరపీ ద్వారా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయించడం,తీవ్రమైన కేసుల్లో షాక్‌వేవ్ థెరపీ,ఇవన్నీ ఫలితం ఇవ్వని అరుదైన సందర్భాల్లో మాత్రమే శస్త్రచికిత్స పరిగణించడం.
నివారణ చిట్కాలు..
బరువును అదుపులో ఉంచుకోవడం, ఎక్కువసేపు ఒకే భంగిమలో నిలబడకుండా ఉండటం, నడక ముందు కాళ్ల కండరాలను స్ట్రెచ్ చేయడం, నాణ్యమైన పాదరక్షలు వాడటం వంటివి ఈ సమస్యను దూరం చేయడంలో సహాయపడతాయి. ఇది ప్రాణాంతకమైన సమస్య కానప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలికంగా మారి రోజువారీ పనులకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి తొలి లక్షణాలు కనిపించగానే వైద్యుడిని సంప్రదించడం మేలు.
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
