These Fruits : వేసవిలో ఇలాంటి పండ్లు తింటే అనారోగ్యం తప్పదా..?
సాక్షి లైఫ్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లో రంగురంగుల పండ్లు నోరూరిస్తుంటాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడం కోసం, శక్తి కోసం మనం పండ్లపైనే ఎక్కువగా ఆధారపడతాం. అయితే, 'అతి సర్వత్ర వర్జయేత్' అన్నట్లు.. అమృతం లాంటి పండ్లు కూడా ఎక్కువగా తింటే శరీరంలో వేడిని పెంచి, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో ఏ పండ్లు ఎంత మేర తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..!
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఈ పండ్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి..
1. మామిడితో జాగ్రత్త..!
పండ్ల రాజు మామిడి అంటే ఇష్టపడని వారుండరు. కానీ, మామిడి పండు స్వతహాగా ఉష్ణ గుణం కలిగి ఉంటుంది. ఇందులో చక్కెర, కేలరీలు అధికం. అతిగా తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగి మొటిమలు, నోటి పూతలు, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని పరిమితంగానే తీసుకోవాలి.
2. బొప్పాయితో జీర్ణ సమస్యలు..
బొప్పాయి జీర్ణక్రియకు మేలు చేసినప్పటికీ, ఎండాకాలంలో అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు (Loose motions), కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. కొందరిలో చర్మ సంబంధిత అలెర్జీలకు కూడా ఇది కారణమవుతుంది.
3. లీచీ..
చూడటానికి ఎర్రగా, తీయగా ఉండే లీచీల్లో గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కువ. వీటిని అధికంగా తింటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగడమే కాకుండా తల తిరగడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో లీచీలను అస్సలు తినకూడదు.
4. ద్రాక్షతో ఉబ్బరం..
ద్రాక్ష పండ్లలో ఉండే సహజ చక్కెర వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. వీటిని ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
కోసిన పుచ్చకాయతో ముప్పు పొంచి ఉందా..?
పుచ్చకాయ ఎంతో మేలు చేసే పండే అయినప్పటికీ, మనం తినే విధానంలోనే ప్రమాదం దాగి ఉంది. పుచ్చకాయను కోసిన తర్వాత ఎక్కువ సేపు గాలికి వదిలేస్తే, దానిపై బ్యాక్టీరియా వేగంగా చేరుతుంది. నిల్వ ఉంచిన లేదా బయట అమ్మే కోసిన ముక్కలను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి వాంతులు, విరేచనాల బారిన పడే అవకాశం ఉంది. ఎప్పుడూ తాజాగా కోసిన ముక్కలనే తీసుకోవడం శ్రేయస్కరం.
ఆరోగ్య సూత్రాలు..
పండ్లను కొనుగోలు చేసిన తర్వాత కాసేపు నీటిలో నానబెట్టి, బాగా కడిగిన తర్వాతే భుజించాలి. రాత్రి సమయాల్లో పండ్లను తినడం తగ్గించి, పగటిపూట తీసుకోవడం ఉత్తమం. పండ్ల రసాల కంటే ముక్కల రూపంలో తినడమే ఆరోగ్యానికి మేలు. వేసవిలో పండ్లు తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. కానీ పరిమితి మించకుండా చూసుకోండి..!
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
