Hungry : చలికాలంలో పదే పదే ఆకలి వేస్తోందా..? ఈ కారణాలు, అదుపు చేసుకునే మార్గాలు మీకోసమే..!
సాక్షి లైఫ్ : చలికాలం రాగానే వేడివేడి పకోడీలు, పరాటాలు, స్వీట్లు తినాలనిపించడం సహజం. ఈ వాతావరణంలో మనకు తెలియకుండానే ఆహారం ఎక్కువగా తీసుకుంటుంటాం. దీనికి కేవలం చలి మాత్రమే కాదు, మన రోజువారీ అలవాట్లలో వచ్చే మార్పులు కూడా ప్రధాన కారణమే. చలికాలంలో ఆకలి పెరగడానికి గల ఐదు ముఖ్య కారణాలు, ఆ కోరికలను ఎలా అదుపు చేసుకోవాలో చూద్దాం..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఆకలి పదే పదే ఎందుకు పెరుగుతుందంటే..?
శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు: బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోవడానికి మన దేహానికి అదనపు శక్తి అవసరమవుతుంది. దీనికోసం శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేయడం వల్ల తరచూ ఆకలి వేస్తుంటుంది.
సూర్యరశ్మి తక్కువగా ఉండటం..
చలికాలంలో పగటి సమయం తక్కువగా ఉండి, ఎండ ఎక్కువగా తగలదు. దీనివల్ల మూడ్, ఆకలిని నియంత్రించే 'సెరోటోనిన్' హార్మోన్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. ఈ ప్రభావంతోనే తీపి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినాలనిపిస్తుంది.
వేడివేడి పదార్థాలపై మక్కువ..
చలి వాతావరణంలో వేడివేడిగా ఉండే సూప్‌లు, పరాటాలు, హల్వా లాంటివి తినడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాలాసార్లు ఇది నిజమైన ఆకలి కాదు, కేవలం వాతావరణం వల్ల కలిగే 'ఎమోషనల్ ఈటింగ్' అంటే భావోద్వేగాలతో ముడిపడిన ఆకలి మాత్రమే.
శారీరక శ్రమ తగ్గడం..
చలికి భయపడి చాలామంది వాకింగ్, వ్యాయామం మానేసి ఇంట్లోనే ఉండిపోతారు. అలా ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు కలిగే బోర్ వల్ల లేదా టీవీ, మొబైల్ చూస్తూ ఏవో ఒక స్నాక్స్ తినే అలవాటు పెరిగిపోతుంది.
దాహాన్ని ఆకలిగా పొరబడటం..
చలికాలంలో చెమట పట్టకపోవడం వల్ల దాహం ఎక్కువగా అనిపించదు. దీనివల్ల నీళ్లు తాగడం తగ్గిస్తారు. కొన్నిసార్లు శరీరంలో నీటిశాతం తగ్గినా (dehydration), అది ఆకలిగా అనిపిస్తుంది. అందుకే ఆకలి వేసినప్పుడు ముందుగా కాసిన్ని నీళ్లు తాగి చూడటం మంచిది.
ఈ కోరికలను అదుపులో ఉంచుకోవడం ఎలా..?
ప్రొటీన్ ఆహారం..పప్పులు, పన్నీర్, గుడ్లు, పాలు, పెరుగు లాంటివి రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. సీజనల్ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలోని పీచుపదార్థం (fiber) మాటిమాటికీ స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది.
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు..నూనెలో వేయించిన పదార్థాలకు బదులుగా వెజిటబుల్ సూప్, పప్పు లేదా వెజిటబుల్ కిచిడీ లాంటివి తీసుకోవడం ఉత్తమం. దాహం వేయకపోయినా రోజంతా కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండాలి. గోరువెచ్చని నీళ్లు లేదా చక్కెర తక్కువగా ఉండే వేడి పానీయాలు తీసుకోవచ్చు. రోజూ తగినంత నిద్ర పోవాలి. వాతావరణానికి అనుగుణంగా ఇంట్లోనే యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
