Pre-diabetes : ప్రీ డయాబెటిస్‌ను ఎలా రివర్స్ చేయాలి..?
సాక్షి లైఫ్ : నేటి ఉరుకులు పరుగుల జీవితం, మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మధుమేహం (diabetes) బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కసారి డయాబెటిస్ వస్తే దానిని పూర్తిగా నయం చేయడం కష్టం. మందులు, ఆహార నియమాల ద్వారా అదుపులో ఉంచుకోవడమే మార్గం. కానీ, చిన్న వయసులోనే ఆరోగ్యంపై దృష్టి పెట్టి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 'ప్రీ డయాబెటిస్' (Pre-diabetes) దశలోనే మేల్కొంటే, మధుమేహం దరిచేరకుండా నిరోధించవచ్చు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి..?
శరీరంలో రక్తంలో చక్కెర (glucose) స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి, మధుమేహంగా పరిగణించబడే స్థాయికి ఇంకా చేరకపోతే దానిని ప్రీ-డయాబెటిస్ అంటారు. ఇది భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని సూచించే హెచ్చరిక (Warning Sign). ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని, ఇది మన శరీరానికి మనం ఇస్తున్న అలారం లాంటిదని వైద్యులు వివరిస్తున్నారు. సరైన సమయంలో ఆహారపు అలవాట్లు మార్చుకుని, జీవనశైలిని మెరుగుపరచుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థితికి తీసుకురావచ్చు.
ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాధారణంగా ప్రీ-డయాబెటిస్‌లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. వ్యక్తి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లుగానే భావిస్తాడు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ఉండొచ్చు. అయితే, కొందరిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. మెడ, చంకలు లేదా ఇతర శరీర భాగాల్లో చర్మం మందంగా, నల్లగా మారడం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు సంకేతం.బరువు విపరీతంగా పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. అతిగా దాహం వేయడం, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం, త్వరగా అలసిపోవడం.ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ప్రీ డయాబెటిస్‌ను ఎలా గుర్తించాలి..?
దీనిని కచ్చితంగా నిర్ధారించడానికి రక్త పరీక్షలే సరైన మార్గం. ప్రధానంగా మూడు రకాల పరీక్షలు చేస్తారు. HbA1c టెస్ట్.. ఇది గత రెండు-మూడు నెలల సగటు బ్లడ్ షుగర్‌ను తెలుపుతుంది. దీని స్థాయి 5.7 నుంచి 6.4 శాతం మధ్య ఉంటే ప్రీ-డయాబెటిస్ కింద పరిగణిస్తారు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్.. ఉదయం పరగడుపున చేసే ఈ పరీక్షలో షుగర్ స్థాయిలు 100 నుంచి 125 mg/dL మధ్య ఉంటే అది ప్రీ-డయాబెటిస్.
గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్: గ్లూకోజ్ తాగిన రెండు గంటల తర్వాత బ్లడ్ షుగర్ స్థాయి 140 నుంచి 199 mg/dL మధ్య ఉంటే దానిని ప్రీ-డయాబెటిస్‌గా పరిగణిస్తారు.
నిపుణులు ఏమంటున్నారు..?
హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందిన డాక్టర్ సౌరభ్ సేథీ ప్రకారం, సకాలంలో చర్యలు తీసుకుంటే ప్రీ-డయాబెటిస్‌ను 70-80% వరకు రివర్స్ అంటే సాధారణ స్థితికి తీసుకురావచ్చు.
ఈ దశలో జీవనశైలిని మార్చుకోకపోతే, ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ కణాలు (beta cells) ప్రతి సంవత్సరం 4-5% మేర తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. కణాలు పూర్తిగా నాశనం కావని, విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అలసిపోతాయని, సరైన ఆహారం, వ్యాయామంతో తిరిగి వాటిని చైతన్యవంతం చేయవచ్చని డాక్టర్ సేథీ స్పష్టం చేశారు. బరువును 10 నుంచి 15శాతం తగ్గించుకున్న వారిలో 86శాతం వరకు టైప్-2 డయాబెటిస్ ముప్పు తగ్గిందని పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రీ డయాబెటిస్‌ను రివర్స్ చేయడానికి మార్గాలు..
ఆకుకూరలు, పప్పులు, తృణధాన్యాలు, తాజా పండ్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోండి. తీపి పానీయాలు, స్వీట్లు, పంచదార వాడకాన్ని బాగా తగ్గించండి. క్రమం తప్పని వ్యాయామం..వారానికి కనీసం 150 నిమిషాల పాటు చురుగ్గా నడవడం లేదా మోస్తరు శారీరక వ్యాయామాలు చేయాలి. అధిక బరువు ఉంటే క్రమక్రమంగా తగ్గించుకోవాలి. దీనివల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. కంటినిండా నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం లాంటివి సాధన చేయాలి.
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
