Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?
సాక్షి లైఫ్ : ఈ మధ్య ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల నుంచి జిమ్‌లో కసరత్తులు చేసే ఫిట్‌నెస్ ప్రియుల వరకు చాలామంది చేతుల్లో రంగురంగుల సిప్పర్ బాటిళ్లు, స్ట్రాలు (Straws) ఉన్న టంబ్లర్లు దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పుణ్యమా అని ఇదొక కొత్త లైఫ్‌స్టైల్ ట్రెండ్‌గా మారిపోయింది. స్ట్రాతో నీళ్లు తాగడం వల్ల సులభంగా ఎక్కువ నీరు తాగొచ్చని, శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుందని చాలామంది భావిస్తుంటారు.
ఇది కూడా చదవండి..War Impact : యుద్ధం ఎఫెక్ట్ : మరింత భారం కానున్న దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలు..
ఇది కూడా చదవండి..LynchVax Vaccine : క్యాన్సర్‌కు ముకుతాడు.. ముందే అడ్డుకునే 'లించ్‌వ్యాక్స్' టీకా..!
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Snakebite Crisis in Telangana : తెలంగాణలో పాముకాటుతో వందలో 13 మంది బలి..! ‘సీసీఎంబీ-లాకోన్స్’ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడి..
అయితే, నాణేనికి ఉన్నట్టే ఈ 'స్ట్రా కల్చర్ కు కూడా మరో కోణం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం స్ట్రాలను, సిప్పర్లను వాడటం వల్ల దంతాలు, జీర్ణవ్యవస్థతో పాటు ముఖ కండరాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ఇంతకీ స్ట్రాతో నీళ్లు తాగడం వల్ల కలిగే లాభనష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్ట్రాతో తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
సులభంగా హైడ్రేషన్.. గ్లాసుతో పోలిస్తే స్ట్రా లేదా సిప్పర్ ద్వారా నీటిని శ్రమ లేకుండా, తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో తాగవచ్చు. ఇది శరీరంలో నీటి శాతాన్ని (Hydration) మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.
మల్టీటాస్కింగ్‌కు అనుకూలం..ఆఫీసులో కంప్యూటర్ ముందు పనిచేస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా జిమ్‌లో వర్కవుట్స్ చేసే సమయంలో నీళ్లు వలికిపోకుండా తాగడానికి సిప్పర్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.
దంతాల ఎనామెల్‌కు రక్షణ.. నిమ్మరసం, పండ్ల రసాలు లేదా కార్బోనేటెడ్ పానీయాలను స్ట్రాతో తాగినప్పుడు అవి దంతాలకు నేరుగా తాకవు. ఫలితంగా దంతాల పైపొర అయిన ఎనామెల్ దెబ్బతినకుండా కొంతవరకు రక్షణ లభిస్తుంది.
పిల్లలు, రోగులకు మేలు..గ్లాసు పట్టుకుని సరిగ్గా తాగలేని చిన్న పిల్లలకు, మంచంపై ఉన్న రోగులకు ద్రవాహారాన్ని అందించడానికి సిప్పర్ బాటిళ్లు సురక్షితమైన మార్గం.
నష్టాలు ఇవే..
ట్రెండ్ కదా అని ప్రతిదానికీ స్ట్రాలనే ఉపయోగిస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు సూచిస్తున్నారు.
గ్యాస్, కడుపు ఉబ్బరం.. స్ట్రా ద్వారా నీటిని గుటక వేసేటప్పుడు నీటితో పాటు కొంత గాలి కూడా పొట్టలోకి వెళ్తుంది. ఇలా అదనపు గాలిని మింగడం వల్ల కడుపు ఉబ్బరం (Bloating), గ్యాస్, అజీర్ణం వంటి అసౌకర్యాలు తలెత్తుతాయి.
బ్యాక్టీరియా ముప్పు.. సిప్పర్ బాటిళ్లు, ముఖ్యంగా వాటికి ఉండే స్ట్రాల లోపలి భాగాలను శుభ్రం చేయడం కొంచెం కష్టం. ప్రతిరోజూ వీటిని ప్రత్యేక బ్రష్‌లతో క్లీన్ చేయకపోతే, ఆ తేమకు లోపల హానికరమైన బ్యాక్టీరియా, ఫంగస్ చేరి ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి.
ముఖంపై ముడతలు.. నిరంతరం పెదవులను దగ్గరకు తెచ్చి స్ట్రాను గట్టిగా పీల్చడం వల్ల ముఖ కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. కాలక్రమేణా పెదవుల చుట్టూ సన్నని గీతలు, ముడతలు (Wrinkles) వచ్చే ప్రమాదం ఉందని చర్మ నిపుణులు చెబుతున్నారు.
పర్యావరణానికి హాని.. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ స్ట్రాల వల్ల పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఇవి భూమిలో అంత సులభంగా కలిసిపోవు.
నిపుణులు ఏమంటున్నారంటే..?
సాధారణంగా మంచి నీళ్లు తాగడానికి సాంప్రదాయ పద్ధతి అయిన గ్లాసు లేదా నార్మల్ బాటిళ్లను ఉపయోగించడమే అత్యంత ఉత్తమమైన మార్గం. ఒకవేళ ప్రయాణాల్లో లేదా వ్యాయామ సమయంలో సౌకర్యం కోసం సిప్పర్లను వాడాల్సి వస్తే పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
ప్లాస్టిక్ స్ట్రాలకు బదులుగా పునర్వినియోగానికి వీలుండే స్టెయిన్‌లెస్ స్టీల్, గ్లాస్ లేదా సిలికాన్ స్ట్రాలను ఎంచుకోండి. సిప్పర్ బాటిళ్లను, స్ట్రాలను ప్రతిరోజూ వేడి నీరు, డిష్ వాషర్‌తో లోపలి వరకు శుభ్రంగా కడగాలి. ఇంట్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు గ్లాసుతోనే నేరుగా నీళ్లు తాగే అలవాటు చేసుకోండి. ట్రెండ్స్ మారినప్పుడల్లా వాటిని గుడ్డిగా అనుసరించడం కంటే, మన ఆరోగ్యానికి ఏది సరైనదో గ్రహించి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
