Snakebite Crisis in Telangana : తెలంగాణలో పాముకాటుతో వందలో 13 మంది బలి..! ‘సీసీఎంబీ-లాకోన్స్’ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడి.. 

షేర్ చేయండి:
Snakebite Crisis in Telangana : తెలంగాణలో పాముకాటుతో వందలో 13 మంది బలి..! ‘సీసీఎంబీ-లాకోన్స్’ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడి.. 

సాక్షి లైఫ్ : గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు ఉదంతాలు కేవలం ప్రాణాలను బలిగొనడమే కాకుండా, సదరు బాధితుల కుటుంబాలను కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని తాజా అధ్యయ నంలో వెల్లడైంది. తెలంగాణలో పాముకాటు బాధితులు, వారి కుటుంబాలపై పడుతున్న సామాజిక, ఆర్థిక భారంపై హైదరాబాద్‌కు చెందిన 'లాబొరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్' (CCMB-LaCONES) శాస్త్రవేత్తలు తొలిసారిగా ఒక సమగ్ర పరిశోధన చేపట్టారు. జగిత్యాల జిల్లాలోని 205 గ్రామాల్లో, గత 11 ఏళ్ల కాలంలో నమోదైన పాముకాటు కేసులపై రెండేళ్లపాటు క్షేత్రస్థాయిలో ఈ అధ్యయనం నిర్వహించారు.

ఇది కూడా చదవండి.. మధుమేహం ఉన్నవారికి మేలుచేసే పప్పు..? 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

అధ్యయనంలో తేలిన దిగ్భ్రాంతికర నిజాలు..

ఈ పరిశోధనలో ఎన్నో కీలకమైన అంశాలు వెలుగుచూశాయని సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వాసుదేవన్ కార్తికేయన్ వెల్లడించారు.ప్రతి 100 మంది పాముకాటు బాధితుల్లో సుమారు 13 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలతో బయటపడిన ప్రతి 100 మందిలో 25 మంది బాధితులు, వారి కుటుంబాలు దీర్ఘకాలిక శారీరక, మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు.

 బాధితుల్లో అత్యధికంగా 15 నుంచి 59 ఏళ్ల వయసు గలవారే (88.17%) ఉండటం గమనార్హం. అంటే కుటుంబానికి ఆధారమైన వారే ఈ ముప్పునకు గురవుతున్నారు. 0-14 ఏళ్ల వారు 4.4 శాతంగా, 60 ఏళ్లు పైబడిన వారు 7.39 శాతంగా ఉన్నారు.  బాధితుల్లో పురుషులు 58.04 శాతం కాగా, మహిళలు 41.96 శాతంగా నమోదయ్యారు. వృత్తి పరంగా.. బాధితుల్లో అత్యధికులు వ్యవసాయ రంగంపై ఆధారపడినవారే (46.40%) ఉన్నారు. ఉద్యోగులు 35.30%, నిరుద్యోగులు 9.80% గా తేలింది.

అప్పుల ఊబిలోకి.. 

పాముకాటు వల్ల సంభవిస్తున్న ఆర్థిక నష్టాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా లెక్కగట్టారు. మరణిస్తే ఆ కుటుంబానికి నష్టం: పాముకాటుతో వ్యక్తి మరణిస్తే సదరు కుటుంబానికి కలిగే సగటు నష్టం విలువను రూ. 19,83,093 గా నిర్ధారించారు. చికిత్స కాలంలో రోగి కోల్పోతున్న సగటు ఉపాధి/ఆదాయ అవకాశం విలువ రూ. 26,528 గా ఉంది.

 జగిత్యాలలో బాధితుల వైద్య ఖర్చులు కొన్ని సందర్భాల్లో గరిష్టంగా రూ. 8,11,403 వరకు చేరినట్లు గుర్తించారు. 30 శాతం మంది బాధితులు ఒకరి కంటే ఎక్కువ ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా, కొంతమంది ఏకంగా నాలుగు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒకే ఒక్క పాముకాటుతో మధ్యతరగతి, పేద కుటుంబాలు పూర్తిగా దారిద్య్రరేఖకు దిగువకు పడిపోతున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు.

నాటు వైద్యం వైపే మొగ్గు.. ఆలస్యమే శాపం..!

image_1937c2.jpg నివేదిక ప్రకారం.. పాముకాటు వేసిన వెంటనే ఆధునిక ఆసుపత్రులను ఆశ్రయించకుండా, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది నాటు వైద్యులను (Faith Healers) ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల అమూల్యమైన సమయం వృధా అయి, సరైన చికిత్స అందక ప్రాణాపాయం కొనితెచ్చుకుంటున్నారు. సర్వే చేసిన 541 మంది బాధితులలో 69 మంది మరణించగా, 337 మంది పూర్తిగా కోలుకున్నారు. అయితే 131 మంది బాధితులు ఆ తర్వాత వివిధ రకాల దీర్ఘకాలిక శారీరక వైకల్యాల బారిన పడ్డారు.

"ప్రభుత్వ ఆసుపత్రులలో పాముకాటు విరుగుడు మందు (antivenom) కొరత లేదు. కానీ సమాజంలో అవగాహన లోపమే పెద్ద సమస్యగా మారింది" అని డాక్టర్ కార్తికేయన్ పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ రికార్డుల ఆధారంగానే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల డేటాను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయి విధానంలో వైద్య వ్యవస్థను సన్నద్ధం చేయాలని సూచించారు. జిల్లా, గ్రామ స్థాయిల్లో యుద్ధప్రాతిపదికన అవగాహన సదస్సులు నిర్వహిస్తే, పాముకాటు మరణాలను పూర్తిగా సున్నాకి తీసుకురావడం సాధ్యమేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి.. మండే ఎండల్లో చల్లటి నీరు తాగుతున్నారా..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..? 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.