Bad Street Food : రోడ్డు పక్కన లభించే ఈ ఐదు రకాల ఆహార పదార్థాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.. ఎందుకంటే..?
సాక్షి లైఫ్ : వేసవి కాలంలో భానుడి భగభగలకు తోడు ఉక్కపోత, విపరీతమైన చెమట సాధారణం. ఈ వాతావరణంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఈ కాలంలో మన ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎండల తీవ్రతకు తోడు రుచికి ఆకర్షితులై రోడ్డు పక్కన దొరికే వీధి ఆహారం వైపు మొగ్గు చూపితే కొరివితో తలగోక్కున్నట్లేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఆహార పదార్థాలు త్వరగా పాడై పోతాయి. వీటికి తోడు దుమ్ము, ధూళి, ఈగలు వాలడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు వీటి బారినపడే ప్రమాదం ఎక్కువ.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
మీరు ఆసుపత్రుల చుట్టూ తిరగకూడదనుకుంటే.. రోడ్డు పక్కన లభించే ఈ ఐదు రకాల ఆహార పదార్థాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.
1. పానీపూరి, గోల్గప్పాతో తస్మాత్ జాగ్రత్త..!
వేసవిలో అందరినీ అమితంగా ఆకర్షించే చిరుతిండి పానీపూరి. అయితే, దీని తయారీకి ఉపయోగించే నీరు, ఐస్ చాలా చోట్ల అపరిశుభ్రంగా ఉంటాయి. ఎండ తీవ్రతకు ఆరుబయట ఎక్కువ సేపు ఉండే ఈ కలుషిత నీటిలో హానికరమైన బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. వీటి వల్ల కడుపు ఇన్‌ఫెక్షన్లు, డయేరియా, టైఫాయిడ్, అజీర్ణ సమస్యలు వస్తాయి. వీలైనంత వరకు ఇంట్లోనే శుభ్రమైన నీటితో తయారు చేసుకోవడం లేదా ప్యాక్ చేసిన సురక్షితమైన నీటిని వాడేలా చూసుకోవడం మేలు.
2. ఆరుబయట ఉంచే చాట్, ఆలూ టిక్కీ..
రోడ్డు పక్కన లభించే సమోసా చాట్, ఆలూ టిక్కీ, దహీ భల్లా వంటి పదార్థాలను గంటల తరబడి ఓపెన్‌గా ఉంచుతారు. వేడి వాతావరణం వల్ల ఈ పదార్థాలు త్వరగా పులిసిపోవడమే కాకుండా, బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇలాంటివి తినడం కారణంగా ఫుడ్ పాయిజనింగ్, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.
నమ్మకమైన, పరిశుభ్రమైన హోటళ్లలో లభించే తాజా ఆహారాన్ని మాత్రమే ఎంచుకోవాలి.
3. ముందే కోసి ఉంచిన పండ్లు (Cut Fruits)..
వేసవి తాపం తీర్చుకోవడానికి రోడ్డు పక్కన అమ్మే పుచ్చకాయ, బొప్పాయి, కర్బూజ వంటి ముక్కలను కొనేస్తుంటారు. కానీ, ముందే కోసి బహిరంగంగా ఉంచే ఈ పండ్లపై దుమ్ము, ధూళి, ఈగలు వాలుతాయి. తీవ్రమైన ఎండకు ఇవి త్వరగా కుళ్ళిపోతాయి.
ఇలాంటి పదార్థాలు తింటే కలరా, తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.
పండ్లను ఎల్లప్పుడూ ఆ క్షణంలోనే కోయించుకుని తినాలి. అంతకంటే ముందు వాటిని శుభ్రమైన నీటితో కడగడం తప్పనిసరి.
4. రోడ్డు పక్కన లభించే జ్యూస్‌లు, షేక్‌లు..
ఎండ దెబ్బకు చెమటలు పట్టినప్పుడు చల్లని చెరుకు రసం లేదా ఫ్రూట్ జ్యూస్ తాగాలనిపించడం సహజం. అయితే, వీటిలో వాడే ఐస్ గడ్డలను నాణ్యమైన నీటితో తయారు చేయకపోవచ్చు. అలాగే రసం తీసే యంత్రాలు, గ్లాసుల పరిశుభ్రత కూడా ప్రశ్నార్థకమే. వీటివల్ల కామెర్లు, గొంతు ఇన్‌ఫెక్షన్, డీహైడ్రేషన్ తలెత్తుతుంది. ఐస్ లేని తాజా రసాలను ఎంచుకోండి లేదా ఇంట్లోనే నిమ్మరసం, మజ్జిగ వంటివి ప్రిపేర్ చేసుకోవడం సురక్షితం.
5. మూతలేని కుల్ఫీలు, లోకల్ ఐస్‌క్రీమ్‌లు..
బండ్ల మీద అమ్మే కొన్ని రకాల కుల్ఫీలు, ఐస్‌క్రీమ్‌లను సరైన ఉష్ణోగ్రతలో ఉంచరు. పదేపదే కరగడం, మళ్లీ గడ్డకట్టడం వల్ల వాటిలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు చేరతాయి. దీంతో ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, గొంతు నొప్పి వంటివి అనిపిస్తాయి.
గుర్తింపు పొందిన బ్రాండ్లు, ప్యాక్ చేసిన ఐస్‌క్రీమ్‌లను మాత్రమే తీసుకోవడం మంచిది.
వేసవిలో వీటికి బదులు ఏం తీసుకోవాలి..?
ఆరోగ్యంగా ఉండటానికి రోడ్డు పక్కన దొరికే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, ప్రకృతిసిద్ధమైన పలు రకాల ఆహారాలను మీ డైట్‌లో భాగం చేసుకోండి:
ఇంట్లో తయారుచేసిన నిమ్మరసం..తక్షణ శక్తిని ఇస్తుంది, శరీరాన్ని తాజాగా ఉంచుతుంది.
కొబ్బరి నీరు..శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందించి, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.
మజ్జిగ, లస్సీ..జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరాన్ని చల్లబరుస్తాయి. తాజా పండ్లు..ఇంట్లోనే శుభ్రంగా కడిగి కోసుకున్న సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. నాలిక రుచి కోసం చూసి రోగాల బారిన పడేకంటే, స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండటమే ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
