LynchVax Vaccine : క్యాన్సర్‌కు ముకుతాడు.. ముందే అడ్డుకునే 'లించ్‌వ్యాక్స్' టీకా..!
సాక్షి లైఫ్ : క్యాన్సర్.. ఈ పేరు వినగానే గుండెల్లో వణుకు పుడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ మహమ్మారి వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో యువత సైతం ఈ వ్యాధి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా క్యాన్సర్ సోకిన తర్వాతే చికిత్సలు అందుబాటులో ఉంటాయి. అయితే, వ్యాధి రాకముందే దానిని ఆదిలోనే తుంచివేసే దిశగా వైద్య శాస్త్రం ఒక అద్భుతమైన మైలురాయిని చేరువలో ఉంది. అదే బ్రిటిష్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న విప్లవాత్మక టీకా ‘లించ్‌వ్యాక్స్’ (LynchVax).
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?
జన్యు ముప్పునకు విరుగుడు..!
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన 'క్యాన్సర్ రీసెర్చ్ యూకే' శాస్త్రవేత్తలు ఈ సరికొత్త వ్యాక్సిన్‌పై ముమ్మర పరిశోధనలు చేస్తున్నారు. ముఖ్యంగా జన్యుపరమైన లోపాల వల్ల వచ్చే 'లించ్ సిండ్రోమ్' ఉన్నవారికి ఈ టీకా ఒక సంజీవనిలా మారనుంది. లించ్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులలో పెద్దప్రేగు (Colorectal), అండాశయం, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఏకంగా 80 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే ఈ జన్యు లోపం వల్ల బాధితులకు జీవితాంతం క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. ఒక్క ఇంగ్లాండ్‌లోనే సుమారు 1.75 లక్షల మంది ఈ సిండ్రోమ్‌తో బాధపడుతుండగా, వారిలో కేవలం 5 శాతం మందికే తమకున్న ముప్పు గురించి తెలుసని నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక వ్యవస్థకు ముందస్తు శిక్షణ..
ఈ వ్యాక్సిన్ పనితీరుపై ప్రముఖ సీనియర్ ప్రొఫెసర్ డేవిడ్ చర్చ్ కీలక వివరాలు వెల్లడించారు. ఇది సాధారణ టీకాల లాంటిది కాదు. శరీరంలో క్యాన్సర్ ప్రక్రియ ప్రారంభం కాకముందే, ముందస్తు జాగ్రత్తగా ఇది పనిచేస్తుంది.
mRNA సాంకేతికత: ఈ టీకా బాడీలోని రోగనిరోధక వ్యవస్థకు ఒక గైడ్‌లా పనిచేస్తుంది. జన్యు ఉత్పరివర్తనాల వల్ల శరీరంలో ఏర్పడే అసాధారణ కణాలను రోగనిరోధక వ్యవస్థ గుర్తించేలా చేస్తుంది. అనుమానాస్పద కణాలు క్యాన్సర్‌గా మారకముందే, వాటిపై దాడి చేసి నాశనం చేసేలా మన రోగనిరోధక శక్తికి ఈ mRNA టీకా ముందస్తు శిక్షణ ఇస్తుంది.
త్వరలోనే మానవ ప్రయోగాలు..
పెద్దప్రేగు, అండాశయ క్యాన్సర్లను నివారించడమే లక్ష్యంగా లించ్‌వ్యాక్స్ క్లినికల్ ట్రయల్స్ (human trials) త్వరలోనే ప్రారంభం కానున్నాయి. లించ్ సిండ్రోమ్ ఉన్న రోగులలో ఒక రకమైన క్యాన్సర్ తగ్గి, మరో రకమైన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే, ఈ టీకా ద్వారా ఒకేసారి పలు రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైద్య చరిత్రలో ఇప్పటికే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. లించ్‌వ్యాక్స్ ప్రయోగం విజయవంతమైతే, క్యాన్సర్ మహమ్మారిపై మానవాళి సాధించిన అతిపెద్ద విజయంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది.
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
