Obesity : 30 ఏళ్లలోపు వయసున్న వారికి ప్రాణాంతకంగా మారనున్న ఊబకాయ సమస్య !

షేర్ చేయండి:
Obesity : 30 ఏళ్లలోపు వయసున్న వారికి ప్రాణాంతకంగా మారనున్న ఊబకాయ సమస్య !

సాక్షి లైఫ్ : చిన్న వయసులో బొద్దుగా ఉంటే మురిసిపోకండి. వయసుతో పాటు బరువు కూడా హద్దులు దాటుతుంటే జాగ్రత్త పడాల్సిందే! 30 ఏళ్లు నిండక ముందే ఊబకాయం బారిన పడితే అది ప్రాణాంతకమేనని, అకాల మరణాలకు దారితీస్తుందని తాజా పరిశోధనలు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. 'సైలెంట్ కిల్లర్'గా మారుతున్న ఈ స్థూలకాయం మన ఆరోగ్యాన్ని ఎలా హరిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

 

నేటి ఉరుకులు పరుగుల జీవనశైలి, జంక్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఆహారాలకు అలవాటు పడటం, గంటల తరబడి స్క్రీన్ల ముందు కదలకుండా కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం వల్లే యువత వేగంగా బరువు పెరుగుతున్నారు.

నిశ్శబ్దంగా దెబ్బతీస్తుందిలా..

ఊబకాయం లేదా అధిక బరువు ఉన్నవారికి మధుమేహం, గుండె జబ్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువ. ఈ వ్యాధి రాత్రికి రాత్రే దాడి చేయదు. తొలుత నీరసం, ఆయాసం లేదా స్వల్పంగా బలహీనత వంటి లక్షణాలతో మొదలై.. క్రమంగా తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది. శరీరంలో పేరుకుపోయే కొవ్వు.. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, శరీర జీవక్రియ (metabolism)ను మందగించేలా చేస్తుంది. దీంతో శరీరం రోగాల పుట్టగా మారుతుంది.

స్వీడన్ పరిశోధనలో సంచలన విషయాలు.. 

ఊబకాయం ముప్పును అంచనా వేసేందుకు స్వీడన్‌లోని 'లండ్ విశ్వవిద్యాలయాని'కి చెందిన శాస్త్రవేత్తలు సుమారు 6 లక్షల మందిపై 17 నుంచి 60 ఏళ్ల వయసు వారు సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. 'క్లినికల్ మెడిసిన్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.

70శాతం పెరిగిన ముప్పు.. 

17 నుంచి 29 ఏళ్ల మధ్య వయసులోనే అధిక బరువు బారిన పడిన వారిలో.. భవిష్యత్తులో అకాల మరణం సంభవించే ముప్పు ఏకంగా 70 శాతానికి పైగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు సగటున ఏడాదికి 0.4 కిలోల చొప్పున బరువు పెరిగారు. వేగంగా బరువు పెరిగితే.. కాలక్రమంలో అతి వేగంగా బరువు పెరిగిన వారిలో గుండె జబ్బులు, 'మెటబాలిక్ సిండ్రోమ్' వంటి ఊబకాయ సంబంధిత సమస్యలతో మరణించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

నిపుణుల హెచ్చరికలు ఏంటంటే..?

బరువు పెరగడం ఏ వయసులోనైనా ప్రమాదకరమే. కానీ, అది ఏ వయసులో మొదలైందనేది మరింత తీవ్రమైన అంశం అని ఈ అధ్యయన ప్రధాన రచయిత తాన్యా స్టాక్స్ స్పష్టం చేశారు. చిన్న వయసులోనే ఊబకాయం రావడం వల్ల.. బరువు పెరగడం వల్ల కలిగే జీవసంబంధమైన (biological) దుష్ప్రభావాలను వారు ఎక్కువ కాలం పాటు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె వివరించారు. అధిక బరువు వల్ల టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులే కాకుండా కనీసం 13 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లోనూ అధిక బరువు ఉన్నవారే ఎక్కువగా ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు.

హార్మోన్ల మార్పులు.. 

పరిశోధనలో పాల్గొన్న మరో వైద్యురాలు డాక్టర్ హుయెన్ లే మాట్లాడుతూ.. హార్మోన్లలో వచ్చే మార్పులు కూడా దీనికి ఒక కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఊబకాయం ఉన్నవారికి అకాల మరణం ముప్పు 70 శాతం ఎక్కువగా ఉంటుందంటే.. వారంతా వెంటనే చనిపోతారని కాదు, కానీ జనాభా ప్రాతిపదికన చూసినప్పుడు సగటు మనిషితో పోలిస్తే వీరిలో మరణాల ముప్పు (risk) అత్యధిక స్థాయిలో పొంచి ఉంటుందని వివరించారు. యువత సరైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామం ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవడమే ఈ 'సైలెంట్ కిల్లర్'ని అడ్డుకునే ఏకైక మార్గమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.