Health Risks of Using Steroids : బాడీబిల్డింగ్ కోసం స్టెరాయిడ్స్ వాడటం వల్ల వచ్చే తీవ్రమైన అనారోగ్య సమస్యలు..
సాక్షి లైఫ్ : ఈ మధ్యకాలంలో సిక్స్ ప్యాక్, కండలు తిరిగిన దేహం కోసం యువత జిమ్‌లలో గంటల తరబడి చెమటోడ్చుతున్నారు. అయితే, త్వరగా ఫలితాలు సాధించాలనే ఆరాటంలో కొందరు అడ్డదారులు తొక్కుతూ అనబాలిక్ స్టెరాయిడ్స్ లేదా కృత్రిమ సప్లిమెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి కొద్దిరోజుల్లోనే కండలు పెరిగేలా చేసినప్పటికీ, శరీరంలోని ముఖ్య అవయవాలపై కోలుకోలేని దెబ్బతీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహా లేకుండా బాడీబిల్డింగ్ కోసం స్టెరాయిడ్స్ వాడటం వల్ల ప్రధానంగా ఎదురయ్యే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!
1. గుండెకు ముప్పు..
దీర్ఘకాలం పాటు స్టెరాయిడ్స్ వాడటం వల్ల రక్తపోటు విపరీతంగా పెరుగుతుంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచి, గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) తగ్గిస్తాయి. దీనివల్ల చిన్న వయసులోనే గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
2. కాలేయం డ్యామేజ్..
నోటి ద్వారా తీసుకునే స్టెరాయిడ్స్ కాలేయంపై తీవ్రమైన భారాన్ని మోపుతాయి. వీటిని తరచుగా వాడితే ఫ్యాటీ లివర్, కాలేయ ఎంజైమ్స్ అసాధారణంగా పెరగడం వంటివి జరుగుతాయి. కొన్నిసార్లు తీవ్రమైన కాలేయ నష్టంతో పాటు అరుదుగా కణితులు (Tumors) ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు.
3. హార్మోన్ల అసాధారణతలు - సంతానలేమి..
మగవారిలో స్టెరాయిడ్స్ వాడకం వల్ల సహజంగా ఉత్పత్తి అయ్యే 'టెస్టోస్టెరాన్' హార్మోన్ స్థాయిలు పడిపోతాయి. ఫలితంగా వీర్యకణాల సంఖ్య తగ్గడం, వృషణాలు కుంచించుకుపోవడం జరిగి సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. అదే మహిళల్లో అయితే గొంతు బొంగురుపోవడం, అవాంఛిత రోమాలు రావడం, నెలసరి సమస్యలు వేధిస్తాయి.
4. మానసిక ఆరోగ్యం అస్తవ్యస్తం..
స్టెరాయిడ్స్ ప్రభావం కేవలం శరీరం మీదే కాదు, మెదడు పైనా పడుతుంది. వీటిని వాడేవారిలో విపరీతమైన కోపం, ప్రవర్తనలో దూకుడు, చిరాకు, ఆందోళన కనిపిస్తాయి. కొందరిలో ఈ సప్లిమెంట్లను ఆపేసిన తర్వాత తీవ్రమైన డిప్రెషన్ మానసిక ఒత్తిడి తలెత్తినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
5. కిడ్నీలు, చర్మ సమస్యలు..
వీటి వాడకం వల్ల మూత్రపిండాలు అధికంగా కష్టపడాల్సి వస్తుంది. అంతేకాకుండా, ముఖంపై పెద్దపెద్ద మొటిమలు రావడం, చర్మం విపరీతంగా జిడ్డుగా మారడం, జుట్టు రాలడం వంటి సమస్యలు మొదలవుతాయి. శరీరంలో నీరు నిలిచిపోవడం (Water retention) వల్ల ముఖం, కాళ్లలో వాపు రావడం, హఠాత్తుగా బరువు పెరగడం జరుగుతుంది.
ఆరోగ్యకరంగా దేహాన్ని నిర్మించుకోవాలంటే..
కండరాల కోసం షార్ట్‌కట్స్ వెతకడం కన్నా, సహజ పద్ధతులు పాటించడమే ఎప్పటికీ సురక్షితం. సరైన ఆహారం.. మీ రోజువారీ డైట్‌లో ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉండే సమతుల్య పోషకాహారం ఉండేలా చూసుకోండి.
క్రమశిక్షణ..నిపుణుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా వ్యాయామం, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. వ్యాయామం ఎంత ముఖ్యమో.. దేహానికి తగినంత నిద్ర, విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. కేవలం నాణ్యత నిర్ధారణ అయిన, అవసరమైన సప్లిమెంట్లను మాత్రమే వాడండి. క్వాలిఫైడ్ స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్‌ను సంప్రదించకుండా ఎలాంటి హార్మోన్ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్ జోలికి వెళ్లకండి.
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
