Cold Shock Risk : ఎండ నుంచి రాగానే ఏసీలోకి వెళ్తున్నారా..? 'కోల్డ్ షాక్' ముప్పుతో జాగ్రత్త..!
సాక్షి లైఫ్ : సాధారణంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి అనగానే మనకు చలికాలం గుర్తుకొస్తుంది. కానీ, ఈ మధ్యకాలంలో వేసవిలోనూ చాలామంది ఈ సమస్యలతో సతమతమవుతున్నారు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్లో, లేక అలసట వల్లో ఇవి వస్తున్నాయని చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ, వైద్య పరిభాషలో దీనిని "కోల్డ్ షాక్" అని పిలుస్తారు. ఎండ తీవ్రతకు, మనం పాటించే కొన్ని అలవాట్లకు మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మన రోగనిరోధక శక్తి క్షీణించి ఈ సమస్యలు తలెత్తుతాయి. ఈ వేసవిలో మిమ్మల్ని వేధించే ఆ సమస్యలు, వాటి వెనుక ఉన్న కారణాలు,నివారణోపాయాలు ఇప్పుడు చూద్దాం..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
1. హఠాత్తుగా మారే ఉష్ణోగ్రతలు (Temperature Shock)..
కణకణలాడే ఎండలో బయట తిరిగి వచ్చి, రాగానే ఒక్కసారిగా ఏసీ గదిలోకి దూరిపోవడం ఈ కాలంలో చాలామందికి అలవాటు. ఇలా ఉష్ణోగ్రతల్లో హఠాత్తుగా వచ్చే మార్పుల వల్ల శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి వెంటనే జలుబు, గొంతునొప్పి, తలనొప్పి వంటివి దాడి చేస్తాయి. బయటి నుంచి రాగానే కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు సాధారణ గది ఉష్ణోగ్రతలో విశ్రాంతి తీసుకోండి. శరీరం సాధారణ స్థితికి వచ్చాకే ఏసీ ఆన్ చేయండి.
2. ఏసీల మితిమీరిన వినియోగం..
వేసవి తాపం తట్టుకోలేక రోజంతా ఏసీలోనే గడపడం వల్ల శరీరానికి మరో ముప్పు పొంచి ఉంది. ఏసీ నుంచి వచ్చే పొడి గాలి వల్ల గొంతు, ముక్కుల్లోని తేమ ఆరిపోతుంది. ఫలితంగా పొడి గొంతు, బొంగురు గొంతు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఉదయం లేవగానే తల బరువుగా అనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఏసీ ఉష్ణోగ్రతను ఎల్లప్పుడూ 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్యే ఉంచుకోండి. నేరుగా ఏసీ గాలి తగిలేలా కూర్చోవద్దు. గదిలోకి సహజమైన గాలి వచ్చేలా చూసుకోవడం కూడా ముఖ్యం.
3. ఫ్రిజ్ నీళ్ళు, ఐస్‌క్రీమ్‌ల మోహం..
వేసవిలో చల్లదనం కోసం ఐస్‌క్రీమ్‌లు, కూల్ డ్రింకులు, ఫ్రిజ్‌లో ఉంచిన అతి చల్లని నీటిని ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇది గొంతులోని సహజ తేమను దెబ్బతీసి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఫ్రిజ్ లోని అత్యంత చల్లని నీటి కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని లేదా కుండ నీటిని తాగడం శరీరానికి ఎంతో సురక్షితం. చల్లని పదార్థాల వినియోగాన్ని వీలైనంత వరకు పరిమితం చేయండి.
4. దుమ్ము, అలర్జీల ప్రభావం..
ఎండకాలంలో గాలిలో దుమ్ము, ధూళి రేణువులు ఎక్కువగా ప్రసాదిస్తాయి. ఇవి శ్వాస ద్వారా లోపలికి వెళ్లినప్పుడు అలర్జీలు మొదలై తుమ్ములు, ముక్కు కారడం, గొంతులో ఇరిటేషన్ సమస్యలు వస్తాయి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. బయటి నుంచి ఇంటికి రాగానే ముఖం, చేతులు, ముక్కును శుభ్రమైన నీటితో కడుక్కోవడం అలవాటు చేసుకోండి. వేసవిలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి తరచూ మంచి నీరు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి. చిన్నపాటి జాగ్రత్తలతో ఈ కోల్డ్ షాక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
