Tea Lovers : టీ లవర్స్ బీ అలర్ట్ : టీ తాగేందుకు సరైన సమయం ఏది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం నిద్ర లేవగానే ఓ కప్పు వేడివేడి టీ గొంతులో పడితేగానీ చాలామందికి రోజు మొదలవదు. మన దేశంలో పరగడుపున టీ తాగే అలవాటు చాలా సాధారణం. అయితే, ఖాళీ కడుపుతో టీ తాగడం(Drinking tea) అందరికీ సురక్షితమేనా..? మీరు కూడా టీ ప్రియులైతే, టీ తాగే సరైన సమయం, విధానం గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నిజానికి టీలో ఉండే కెఫిన్ మన శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు సహాయపడుతుంది. కానీ, అదే కెఫిన్ మోతాదు మించితే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, అసలు టీ ఎలా తాగాలో వైద్యనిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..? 

టీ తాగేందుకు సరైన సమయం ఏది..?

ఉదయం లేవగానే పరగడుపున టీ తాగే బదులు, ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగి, ఏదైనా తేలికపాటి ఆహారం తీసుకున్న తర్వాత టీ తాగడం చాలా మంచిది. ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు కొందరిలో ఛాతీలో మంట, కడుపు ఉబ్బరం లేదా ఎసిడిటీ (acid reflux) వంటి సమస్యలు వస్తాయి. టీలోని కెఫిన్ పట్ల ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా స్పందిస్తుంది కాబట్టి, మీకు గ్యాస్ సమస్యలు ఉంటే పరగడుపున టీ తాగే అలవాటును వెంటనే మానుకోవాలి.

రోజుకు ఎంత మోతాదులో తాగొచ్చు..?

టీ తాగే సమయంతో పాటు దాని మోతాదు కూడా చాలా ముఖ్యం. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) సూచనల ప్రకారం, ఆరోగ్యవంతులైన పెద్దలు రోజుకు 400 mg వరకు కెఫిన్ తీసుకోవచ్చు. ఇది సాధారణంగా ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించదు. అంటే సగటున రోజుకు 2 నుంచి 3 కప్పుల టీ తాగొచ్చు. అయితే పదే పదే టీ తాగకుండా, రోజువారీ కెఫిన్ మోతాదును అదుపులో ఉంచుకోవడం అవసరం.

పడుకునే ముందు వద్దు..!

చాలామందికి రాత్రి భోజనం తర్వాత లేదా నిద్రపోయే ముందు టీ తాగే అలవాటు ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కెఫిన్ ఉన్న టీ తాగితే, అది మీ నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్ర పట్టడంలో ఆలస్యం అవుతుంది లేదా నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి రాత్రి పూట టీకి దూరంగా ఉండటం ఉత్తమం.

మరీ వేడిగా తాగుతున్నారా..?

పొగలు కక్కే వేడి టీని గుటకలు వేస్తూ తాగడం ఏమాత్రం మంచిది కాదు. అతి వేడిగా ఉండే పానీయాలను క్రమం తప్పకుండా తీసుకుంటే అది గొంతు, అన్నవాహిక క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి టీ కాస్త చల్లారి, తాగడానికి అనువైన ఉష్ణోగ్రతకు వచ్చాకే ఆస్వాదించాలి.

టీ తాగేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు..

పరగడుపున టీ తాగడం వల్ల గ్యాస్ వస్తే, అల్పాహారం (Breakfast) తీసుకున్న తర్వాతే తాగాలి. రోజులో మీరు తాగే టీ కప్పుల సంఖ్యను పరిమితం చేసుకోవాలి. నిద్రను ప్రభావితం చేసే లక్షణం మీకు ఉంటే, రాత్రిపూట టీ మానేయాలి.

అధిక వేడితో టీ తాగకూడదు.

టీలో చక్కెర మోతాదును సాధ్యమైనంత వరకు తగ్గించాలి. టీ తాగిన తర్వాత శరీరంలో ఏమైనా అసౌకర్యం కలుగుతుందేమో గమనించా లి. తరచుగా ఎసిడిటీ, ఛాతీలో మంట వస్తుంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. రోజువారీ జీవితంలో టీ తాగడం ఒక భాగమే అయినా, దాన్ని సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు.

 

ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.