Nutritional Deficiencies : జుట్టు రాలడానికి శరీరంలో ఈ లోపాలు కూడా కారణమే..!
సాక్షి లైఫ్ : తల దువ్వుకుంటున్నప్పుడో, స్నానం చేస్తున్నప్పుడో గుప్పిట్లోకి వెంట్రుకలు వస్తుంటే చాలామంది ఆందోళన చెందుతుంటారు. వెంటనే నూనెలు, షాంపూలు మార్చేయడం లేదా ఖరీదైన హెయిర్ ప్రొడక్టులు వాడటం మొదలుపెడతారు. సాధారణంగా రోజుకు 40 నుంచి 50 వెంట్రుకలు రాలడం సహజమే. కానీ అకస్మాత్తుగా జుట్టు ఎక్కువగా రాలడం, పలచబడడం లేదా మాడు కనిపించడం వంటివి జరుగుతుంటే సమస్య బయట కాదు.. శరీరంలోనే ఉందని గుర్తించాలని చర్మ, కేశ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. షాంపూలు, నూనెల కంటే శరీరంలోని అంతర్గత లోపాలే అధిక హెయిర్ ఫాల్‌కు కారణమవుతుంటాయి. అవేంటో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
రక్తహీనత,ఐరన్ లోపం (Anemia, Iron Deficiency)..
మన శరీరంలో ఐరన్ లోపించినప్పుడు ఎర్ర రక్తకణాలు తగ్గిపోయి, కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా మందగిస్తుంది. ఇది కేశ మూలాలపై (Hair Follicles) తీవ్ర ప్రభావం చూపుతుంది. జుట్టు రాలడంతో పాటు తీవ్రమైన అలసట, నీరసం, ఆయాసం, గుండెదడ వంటి లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే సీరమ్ ఫెర్రిటిన్, సీబీసీ ( CBC) చేయించుకోవడం మంచిది.
ప్రొటీన్లు, సూక్ష్మపోషకాల కొరత..
జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రొటీన్‌తో నిర్మితమవుతుంది. తీసుకునే ఆహారంలో తగినంత ప్రొటీన్, జింక్, బయోటిన్ వంటి పోషకాలు లోపిస్తే కుదుళ్లు బలహీనపడి ఊడిపోతాయి. బరువు వేగంగా తగ్గాలనే ఉద్దేశంతో కొందరు అతి తక్కువ కేలరీలు తీసుకుంటూ కఠినమైన డైటింగ్‌లు చేస్తుంటారు. దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడి జుట్టు విపరీతంగా రాలిపోతుంది.
థైరాయిడ్ అసమతుల్యత..
మెడ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు శరీర జీవక్రియలను నియంత్రిస్తాయి. థైరాయిడ్ హార్మోన్లు మరీ ఎక్కువగా లేదా తక్కువగా విడుదలైనప్పుడు జుట్టు స్వభావం మారిపోతుంది. జుట్టు రాలడంతో పాటు బరువులో ఆకస్మిక మార్పులు, చలిని తట్టుకోలేకపోవడం, పొడిబారిన చర్మం, మలబద్ధకం వంటి లక్షణాలుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి.
వంశపారపర్యం, మానసిక ఒత్తిడి..
కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే జుట్టు రాలడం లేదా బట్టతల సమస్య ఉంటే అది జన్యుపరంగా సంక్రమించే అవకాశం ఎక్కువ. దీనితో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడి, సరిపడా నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరిగి కేశాల పెరుగుదల చక్రం దెబ్బతింటుంది.
వైద్యనిపుణులు ఏమంటున్నారు..?
సమస్య మూలాలను తెలుసుకోకుండా మార్కెట్లో దొరికే సప్లిమెంట్లు లేదా నూనెలను సొంతంగా వాడకూడదు. తీవ్రంగా జుట్టు రాలుతుంటే వైద్యులను సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, గుడ్లు, గింజలు వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని రోజువారీ మెనూలో భాగం చేసుకోవడం ఎంతో అవసరం.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
