Summer Diet : సమ్మర్ డైట్ ఎలా ఉండాలి అంటే..? 

షేర్ చేయండి:
Summer Diet : సమ్మర్ డైట్ ఎలా ఉండాలి అంటే..? 

సాక్షి లైఫ్ : వేసవి వేడి, వడదెబ్బల తీవ్రతకు శరీర ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగిపోతుంటాయి. దీనివల్ల నీరసం, అలసట, జీర్ణక్రియ మందగించడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా చాలామంది రుచి కోసమో, అలవాటు కొద్దీనో ఎండకాలంలో కూడా కొన్ని పాత ఆహార నియమాలనే పాటిస్తుంటారు. కానీ, వేసవిలో శరీరాన్ని చల్లబరిచే, తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. మరి ఈ కాలంలో వేటిని దూరం పెట్టాలి? వేటిని డైట్‌లో చేర్చుకోవాలో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

 

స్నాక్స్ విషయంలో జాగ్రత్త..!

ఇవి వద్దు.. వేయించిన వేరుశెనగలు, నట్స్, పల్లీ పట్టీలు వంటి వాటిలో కొవ్వు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని పెంచి, కడుపులో బరువుగా అనిపించేలా చేస్తాయి.ఇవి మేలు.. వీటికి బదులుగా శరీరానికి చల్లదనాన్నిచ్చే సబ్జా గింజల పానీయాలు, రాత్రంతా నానబెట్టిన బాదం పప్పులు, తాజా పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోవడం ఎంతో మంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

దాహం వేస్తే సాదా నీళ్లేనా..?

ఇవి వద్దు.. మార్కెట్లో దొరికే కోలాలు, శీతల పానీయాలు, ప్రిజర్వేటివ్‌ లు అధికంగా ఉండే ప్యాకేజ్డ్ జ్యూస్‌ల వల్ల శరీరంలో చక్కెర శాతం పెరిగి మరింత డీహైడ్రేషన్‌కు గురవుతారు. అలాగే, కేవలం సాదా నీటిపైనే ఆధారపడటం వల్ల ఒక్కోసారి శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇవి మేలు.. వేసవి దాహార్తిని తీర్చడానికి ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీరు, నిమ్మరసం, అమృతం లాంటి మజ్జిగను ఎంచుకోండి. ఇవి శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలను అందించి రీఛార్జ్ చేస్తాయి.

పండ్ల ఎంపికలో ఈ మార్పులు చేసుకోండి..

వేసవి కాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పండ్లు తినడం ఎంతో మంచిదే అయినప్పటికీ.. కొన్ని రకాల పండ్ల విషయంలో మాత్రం కాస్త నియంత్రణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండకాలంలో అమితంగా ఇష్టపడే మామిడి పండ్లు, సపోటాలను అతిగా తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది. అలాగే పండ్లు, పాలు, చక్కెరతో కలిపి తయారుచేసే హెవీ ఫ్రూట్ షేక్స్ జీర్ణవ్యవస్థపై భారాన్ని పెంచుతాయి. కాబట్టి వీటిని వీలైనంత పరిమితంగా తీసుకోవడం ఉత్తమం.

దీనికి ప్రత్యామ్నాయంగా.. నీటి శాతం పుష్కలంగా ఉండే పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్లను ధారాళంగా డైట్‌లో చేర్చుకోవచ్చు. వీటితో పాటు నిమ్మ, బత్తాయి, నారింజ వంటి సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్-సి అందడమే కాకుండా, శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

జీర్ణవ్యవస్థ మందగిస్తుంది..

వేసవిలో జీర్ణవ్యవస్థ కాస్త మందగిస్తుంది. అందువల్ల నూనెలతో వేయించిన మాంసం, చీజ్ అధికంగా ఉండే బరువైన పదార్థాలు, చిక్కటి మిల్క్ షేక్‌లకు దూరంగా ఉండాలి. ఇవి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఫలితంగా అలసట పెరుగుతుంది.

దీనికి ప్రత్యామ్నాయంగా.. ఇంట్లో వండుకునే తేలికపాటి పప్పులు, పలచటి మజ్జిగ చారు, తాజా పెరుగు, పలచటి జ్యూస్‌లను ఆహారంగా తీసుకోవాలి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే పొట్టను తేలికగా ఉంచుతాయి. వేసవి కాలంలో వడదెబ్బ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి దూరంగా ఉండాలంటే.. 'రుచి కంటే ఆరోగ్యమే ముఖ్యం' అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. నిరంతరం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వాతావరణ మార్పులను తట్టుకోవడానికి ఏకైక మార్గం..!

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.