Skip Expensive Creams : మెరిసే చర్మం కోసం ఖరీదైన క్రీములు వద్దు.. రోజువారీ అలవాట్లే చాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఈ మధ్యకాలంలో మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం (Glowing Skin) కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు, లోషన్లు వాడటం పరిపాటిగా మారింది. అయితే, బాహ్య సౌందర్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయడం కంటే, మన రోజువారీ అలవాట్లు, ఆహారం, నిద్ర, శారీరక చురుకుదనంపై దృష్టి పెట్టడం వల్ల చర్మాన్ని సహజంగానే కాపాడుకోవచ్చని చర్మ రోగ నిపుణులు (Dermatologists) స్పష్టం చేస్తున్నారు. ఉదయం పూట పాటించే కొన్ని చిన్నపాటి ఆరోగ్యకరమైన అలవాట్లు దీర్ఘకాలంలో చర్మానికి సరికొత్త కాంతిని ఇస్తాయని వారు వివరిస్తున్నారు.

ఉదయం లేవగానే.. 'జీవ జలం'.. 

రాత్రంతా నిద్రపోయిన తర్వాత ఉదయానికి శరీరంలో స్వల్పంగా నిర్జలీకరణం (Dehydration) జరుగుతుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కనీసం ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగే అలవాటు చేసుకోవాలి. ఇది శరీరాన్ని లోపలి నుంచి తేమగా (Hydrated) ఉంచుతుంది. రక్తంలో పేరుకుపోయిన విషపదార్థాలను (Toxins) బయటకు పంపి, చర్మాన్ని లోపలి నుంచి శుభ్రంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

వ్యాయామంతో చర్మానికి ఆక్సిజన్..

ఉదయం వేళ కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు నడక (Morning Walk), యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల శరీరంలో రక్త ప్రసరణ (Blood Circulation) వేగవంతం అవుతుంది. దీనివల్ల చర్మ కణాలకు ఆక్సిజన్, శరీరానికి అవసరమైన పోషకాలు సులభంగా చేరతాయి. ఫలితంగా చర్మానికి సహజమైన మెరుపు లభిస్తుంది. అంతేకాకుండా, వ్యాయామం వల్ల చర్మాన్ని పాడుచేసే మానసిక ఒత్తిడి కూడా అదుపులోకి వస్తుంది.

పోషకాలతో కూడిన 'అల్పాహారం'.. 

ఉదయం వేళ హడావిడిలో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ను దాటవేస్తుంటారు (Skip). కానీ ఆరోగ్యకరమైన చర్మానికి పోషకమైన అల్పాహారం ఎంతో అవసరం. ఉదయం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. డైట్ లో ఇవి ఉండాలి.. పనీర్, పెరుగు, ఓట్స్, తాజా సీజనల్ పండ్లతో పాటు బాదం, వాల్‌నట్స్ వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. సూపర్ ఫుడ్స్..చియా సీడ్స్, అవిసె గింజలు (Flax seeds), మొలకెత్తిన పెసర్లు, శనగలు వంటివి చర్మ కణాల పునరుత్పత్తికి ఎంతో దోహదపడతాయి.

స్కిన్‌కేర్ రొటీన్: సన్‌స్క్రీన్ తప్పనిసరి..!

ఉదయం ముఖం కడుక్కునేటప్పుడు చర్మ రకానికి సరిపడే మైల్డ్ క్లెన్సర్‌ను వాడాలి. ముఖం కడిగిన వెంటనే చర్మంలో తేమను నిలుపుకోవడానికి మాయిశ్చరైజర్ రాయడం మరువకూడదు. నూనె చర్మం (Oily Skin) ఉన్నవారు కూడా జెల్ బేస్డ్ లైట్ మాయిశ్చరైజర్ వాడటం మంచిది.

అన్నింటికంటే ముఖ్యంగా, బయటకు వెళ్లేటప్పుడు లేదా ఇంట్లోనే కిటికీల దగ్గర ఎక్కువసేపు గడిపేటప్పుడు కూడా SPF 30 లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల 'బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్' రాయడం తప్పనిసరి. ఇది సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాల నుంచి చర్మాన్ని రక్షించి ముందస్తు ముడతలు, పిగ్మెంటేషన్, సన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

సహజ సౌందర్యం కోసం మరికొన్ని సూత్రాలు.. 

గాఢ నిద్ర..రోజుకు 7 నుంచి 9 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్రలోనే చర్మ కణాలు రిపేర్ (Cellular Repair) అవుతాయి.ధూమపానానికి దూరం.. స్మోకింగ్ వల్ల చర్మంలోని కొల్లాజెన్ పొర దెబ్బతిని, వయసు పైబడినట్లుగా, నిస్తేజంగా కనిపిస్తుంది. ఒత్తిడి నియంత్రణ.. తీవ్రమైన మానసిక ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి మొటిమలకు కారణమవుతుంది. కాబట్టి ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కృత్రిమ క్రీముల మాయలో పడకుండా, ఈ సహజమైన జీవనశైలి మార్పులను క్రమం తప్పకుండా పాటిస్తే నిగారించే చర్మసౌందర్యం మీసొంతం అవుతుందని నిపుణులు భరోసా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.