Food Safety Rules : ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక నిర్ణయం.. న్యూ ఫుడ్ సేఫ్టీ రూల్స్ అమలు..
సాక్షి లైఫ్ : బయట హోటళ్లు, రెస్టారెంట్లు, లేదా రోడ్డు పక్కన ఉండే ధాబాలలో తరచుగా భోజనం చేస్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే! వినియోగదారుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, భోజనశాలల వంటగదులలో తుప్పుపట్టిన, విరిగిన లేదా పాడైపోయిన కత్తులు, కట్టర్ల వాడకంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కఠిన నిషేధం విధించింది.
ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో అనేక చోట్ల తుప్పుపట్టిన కత్తులతోనే కూరగాయలు, మాంసం కోస్తున్నట్లు వెల్లడి కావడంతో ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, తుప్పుపట్టిన కత్తుల వల్ల కలిగే అనర్థాల గురించిన ప్రత్యేక కథనం..
ఇది కూడా చదవండి..Gen Z Trend ‘Panic Pouch’ : జెన్ జెడ్ ట్రెండ్ ‘పానిక్ పౌచ్’.. యాంగ్జైటీ, ఒత్తిడికి చెక్ పెట్టే మినీ కిట్..!
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
వంటగదిలో ఇకపై 'స్టెయిన్‌లెస్ స్టీల్' మాత్రమే..!
ఆహార వ్యాపార నిర్వాహకులు (FBOs) తమ వంటశాలలలోని పరికరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. తుప్పుపట్టిన లేదా విరిగిన కత్తులను వెంటనే తొలగించి, వాటి స్థానంలో కేవలం అధిక నాణ్యత గల, తుప్పు నిరోధక స్టెయిన్‌లెస్ స్టీల్ (Stainless Steel) కత్తులను మాత్రమే ఉపయోగించా లని ఆదేశించింది. పదునైన పనిముట్లన్నీ సురక్షితమైన స్థితిలో ఉంచడం ఇకపై తప్పనిసరి.
తుప్పుపట్టిన కత్తుల వాడకంతో పొంచి ఉన్న ముప్పులు..
1. బ్యాక్టీరియా ముప్పు-ఆహారం కలుషితం..
కత్తులకు తుప్పు పట్టినప్పుడు వాటి ఉపరితలం గరుకుగా మారి, సూక్ష్మజీవులు, హానికరమైన బ్యాక్టీరియా స్థావరాలుగా మారుతాయి. వీటిని ఎంత కడిగినా బ్యాక్టీరియా పూర్తిగా నశించదు. అటువంటి కత్తులతో కూరగాయలు, పండ్లు కోసినప్పుడు ఆ బ్యాక్టీరియా ఆహారంలోకి సులభంగా ప్రవేశిస్తుంది.
2. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం..
తుప్పుపట్టిన కత్తుల ద్వారా ఆహారంలోకి చేరే బ్యాక్టీరియా కారణంగా ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. దీనివల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు, మరియు విరేచనాలు వంటి తీవ్రమైన జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి.
3. లోహ కణాలు శరీరంలోకి..
పాతబడిన, తుప్పుపట్టిన కత్తులను నిరంతరం ఉపయోగించడం వల్ల వాటి నుంచి కంటికి కనిపించని చిన్న చిన్న తుప్పు ముక్కలు ఆహారంలో కలిసిపోతాయి. ఇటువంటి ఆహారాన్ని దీర్ఘకాలం పాటు తీసుకోవడం ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
4. పరిశుభ్రత ప్రమాణాల ఉల్లంఘన..
ఆహార భద్రతా నిబంధనల ప్రకారం వంటగది పరికరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండాలి. తుప్పుపట్టిన వస్తువులను ఉపయోగించడం ప్రాథమిక ఆరోగ్య సూత్రాల ఉల్లంఘన కిందకే వస్తుంది.
చిన్నపాటి తుప్పు కూడా ప్రమాదకరమేనా..?
తుప్పుపట్టిన కత్తితో కోసిన ఆహారాన్ని ఒకట్రెండు సార్లు తిన్నంత మాత్రాన అందరికీ తక్షణమే ప్రాణాంతక సమస్యలు రాకపోవచ్చు. కానీ, హోటళ్లలో వందలాది మందికి రోజూ అదే పరికరాలతో వంట చేయడం వల్ల ఇన్ఫెక్షన్ల తీవ్రత పెరుగుతుంది. అందుకే 'ముందు జాగ్రత్తే అమృతం' అన్నట్లుగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇకపై బయట తినేటప్పుడు వినియోగదారులు కూడా పరిసరాల పరిశుభ్రతను గమనించడం ఎంతో అవసరం.
