Cervical Cancer : సర్వైకల్ క్యాన్సర్ మరణాల రేటును తగ్గించేందుకు భారత్ సరికొత్త వ్యూహం..

షేర్ చేయండి:
Cervical Cancer : సర్వైకల్ క్యాన్సర్ మరణాల రేటును తగ్గించేందుకు భారత్ సరికొత్త వ్యూహం..

సాక్షి లైఫ్ : దేశంలోని మహిళల ఆరోగ్య సంరక్షణలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మహిళా మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉన్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (Cervical Cancer) మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. దేశవ్యాప్త హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (HPV) టీకా పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ ఏడాది సుమారు 1.15 కోట్ల మంది కౌమార బాలికలకు ఉచితంగా టీకాలు అందించడమే లక్ష్యంగా ఈ బృహత్తర కార్యక్రమం సాగుతోంది.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో..  

ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో 25 శాతం మంది భారతీయులే ఉండటం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో భారత్ చేపట్టిన ఈ భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం మన దేశానికే కాకుండా, ప్రపంచ ఆరోగ్య రంగానికే దిక్సూచిగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో మరణిస్తున్న ప్రతి నలుగురిలో ఒకరు భారతీయ మహిళే కావడం గమనార్హం.

ఉచితంగా టీకా పంపిణీ..  

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జాతీయ ప్రచారాన్ని ప్రారంభించారు. దీనిని అనుసరించి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం వేగవంతమైంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు ఈ టీకాను పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు.

 భారత్‌లో ఏటా 1.20 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా.. దాదాపు 80 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరికి ఈ క్యాన్సర్ నిర్ధారణ అవుతుండగా.. ప్రతి ఏడు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒకే ఒక్క డోసు టీకాతో ఈ ప్రాణాంతక వైరస్ నుంచి జీవితకాల రక్షణ పొందవచ్చని అంతర్జాతీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

అపోహలు వద్దు..  

గతంలో టీకాలపై ఉన్న అపోహలు, సామాజిక అడ్డంకుల వల్ల ఈ కార్యక్రమం కొంత ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం వైద్యుల సహకారంతో ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. స్వదేశీ సంస్థ 'సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా' కూడా 'సర్వావాక్' (Cervavac) పేరుతో తక్కువ ధరకే టీకాను అందుబాటులోకి తెచ్చింది.

ముందస్తు జాగ్రత్త అవసరం..  

30 నుంచి 65 ఏళ్ల లోపు మహిళలు క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, అలాగే అర్హులైన బాలికలందరికీ టీకాలు వేయించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కేవలం క్యాన్సర్‌ను అడ్డుకోవడమే కాకుండా, చికిత్స కోసం అయ్యే భారీ ఖర్చును తగ్గించి కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.