World hepatitis day 2026 : హెపటైటిస్.. ప్రాణాంతకమైందా..? ఎంతవరకు వాస్తవం..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన శరీరంలో అతి కీలకమైన రసాయనాగారం కాలేయం (Liver). మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడం, రక్తంలోని వ్యర్థాలను బయటకు పంపడం, జీర్ణక్రియను మెరుగు పరచడం.. ఇలా ఎన్నో బాధ్యతలను ఇది మోస్తుంది. అలాంటి కాలేయానికి వాపు రావడాన్నే వైద్య పరిభాషలో 'హెపటైటిస్' అంటారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదంగా మారే ఈ మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

ప్రపంచవ్యాప్తంగా కాలేయ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జూలై 28న 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' జరుపుకుంటారు. హెపటైటిస్-బి వైరస్‌ను తొలిసారిగా గుర్తించిన నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ బరూచ్ బ్లంబెర్గ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ముప్పు ఎవరికి..? ఎలా వస్తుంది..?

ప్రధానంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వీటితో పాటు మితిమీరిన మద్యపానం, కలుషిత ఆహారం తీసుకోవడం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు, ఆటో-ఇమ్యూన్ సమస్యల వల్ల కూడా కాలేయం దెబ్బతింటుంది.

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే..

ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొందరిలో ఈ ఇన్ఫెక్షన్ కొద్ది రోజుల్లోనే తగ్గిపోయినా, మరికొందరిలో మాత్రం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే లివర్ సిర్రోసిస్, కాలేయ వైఫల్యం, చివరకు కాలేయ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది.

హెపటైటిస్ - ప్రధాన రకాలు..

వైద్యుల సూచనల ప్రకారం హెపటైటిస్ ప్రధానంగా ఐదు రకాలు. వాటి లక్షణాలు, వ్యాప్తి చెందే విధానం ఇలా ఉంటాయి.

1. హెపటైటిస్-ఎ (Hepatitis A)
కారణం: కలుషితమైన నీరు, అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత లోపించిన ప్రాంతాల్లో దీని ముప్పు ఎక్కువ.

లక్షణాలు: తీవ్రమైన జ్వరం, విపరీతమైన నీరసం, కడుపునొప్పి, వాంతులు, ఆకలి మందగించడం, పచ్చకామెర్లు.

నివారణ: వండిన వేడి ఆహారం, కాచి చల్లార్చిన సురక్షితమైన నీరు తీసుకోవాలి. పిల్లలకు సకాలంలో టీకా (వ్యాక్సిన్) వేయించడం ద్వారా దీన్ని అడ్డుకోవచ్చు.

2. హెపటైటిస్-బి (Hepatitis B)
కారణం: వ్యాధి సోకిన వారి రక్తం ఎక్కించడం, అసురక్షిత శృంగారం, ఒకరు వాడిన సూదులు మరొకరు వాడటం వల్ల వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ ఉన్న గర్భిణుల నుంచి పుట్టబోయే శిశువుకు సంక్రమించే ప్రమాదం ఉంది.

ప్రభావం: కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా మారి, లివర్ సిర్రోసిస్ మరియు కాలేయ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంటుంది.

నివారణ: ఈ వైరస్ బారిన పడకుండా ముందుస్తుగా నివారించేందుకు అత్యంత సమర్థవంతమైన టీకాలు అందుబాటులో ఉన్నాయి.

3. హెపటైటిస్-సి (Hepatitis C)
కారణం: హెపటైటిస్-బి లాగే ఇది కూడా ప్రధానంగా కలుషిత రక్తం ద్వారానే వ్యాపిస్తుంది. ఒకే సిరంజిని పలువురు వాడటం, అసురక్షిత వైద్య పరికరాల వల్ల ముప్పు పెరుగుతుంది. (స్క్రీనింగ్ పద్ధతులు పెరిగాక రక్తమార్పిడి ద్వారా వచ్చే ముప్పు కాస్త తగ్గింది).

దీన్ని 'సైలెంట్ కిల్లర్' అంటారు. వ్యాధి సోకిన చాలా మందిలో ఎలాంటి ప్రారంభ లక్షణాలు కనిపించవు. కొన్నేళ్ల పాటు వైరస్ లోపలే ఉండిపోయి కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.

నివారణ: దీనికి ప్రస్తుతం ఎలాంటి టీకా అందుబాటులో లేదు. సురక్షిత వైద్య విధానాలు పాటించడమే ఏకైక మార్గం.

4. హెపటైటిస్-డి (Hepatitis D)
కారణం: ఈ వైరస్ స్వతహాగా దాడి చేయదు. ఇప్పటికే హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్ ఉన్నవారిపైనే దీని ప్రభావం ఉంటుంది. ఈ రెండు (కో-ఇన్ఫెక్షన్) కలిస్తే కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

నివారణ: ఇది కూడా రక్తం, శరీర ద్రవాల ద్వారానే వ్యాపిస్తుంది. ముందుగా హెపటైటిస్-బి కి వ్యాక్సిన్ వేయించుకుంటే, 'డి' వైరస్ నుంచి ఆటోమేటిక్‌గా రక్షణ పొందవచ్చు.

5. హెపటైటిస్-ఇ (Hepatitis E)
కారణం: హెపటైటిస్-ఎ లాగానే ఇది కూడా కలుషిత జలాలు, అపరిశుభ్ర ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో దీని ముప్పు అధికంగా ఉంటుంది.

నివారణ: మలవిసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.

 
కాలేయ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. కడుపునొప్పి, ఆకలి లేకపోవడం, కళ్లు లేదా చర్మం పసుపు పచ్చగా మారడం (కామెర్లు) వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు (Liver Function Tests) చేయించుకోవాలి. సకాలంలో మందులు వాడి, ముందుస్తుగా టీకాలు తీసుకుంటే ఈ మహమ్మారి నుంచి కాలేయాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.