NIN's Latest Study : రోజూ వ్యాయామం చేస్తే ఎముకలకు బలం, జీర్ణవ్యవస్థకు మేలు..!
సాక్షి లైఫ్ : క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (NIN) శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. శారీరక శ్రమ వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా.. జీవక్రియల పనితీరు (Metabolic Health), ఎముకల సాంద్రత మెరుగుపడటంతో పాటు జీర్ణకోశంలోని మేలుచేసే సూక్ష్మజీవుల (Gut Microbiome) వృద్ధి సక్రమంగా జరుగుతుందని వెల్లడించారు. ఈ పరిశోధనా వ్యాసం ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్' (Frontiers in Nutrition) లో ప్రచురితమైంది.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
క్రీడా రకాలను బట్టి శరీరంలో మార్పులు..
మనం చేసే వ్యాయామం లేదా ఆడే క్రీడను బట్టి శరీరంలో అనుకూలమైన మార్పులు వస్తాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన సైంటిస్ట్-ఈ డాక్టర్ కె.వెంకటేష్ తెలిపారు.
రన్నింగ్, సైక్లింగ్ (Endurance Athletes)..
సుదీర్ఘకాలం శ్రమించే క్రీడాకారుల్లో కొవ్వు త్వరగా కరిగే ప్రక్రియ అంటే ఫ్యాట్ ఆక్సిడేషన్ ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా సన్నగా ఉండటమే కాకుండా, వీరి రక్తంలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.
వెయిట్ లిఫ్టింగ్, పవర్ స్పోర్ట్స్ (Strength Athletes)..
బరువులు ఎత్తే క్రీడాకారుల్లో కండరాల పరిమాణం, ఎముకల బలం (Bone Mineral Density) అధికంగా ఉంటాయి. వీరిలో విశ్రాంతి సమయంలో జరిగే జీవక్రియ రేటు (Resting Metabolic Rate) కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి..
నిశ్చల జీవనశైలి అంటే ఏ వ్యాయామం చేయనివారు గడిపే వారితో పోలిస్తే... రోజూ శారీరక శ్రమ చేసేవారి ప్రేవుల్లో ప్రోటీన్లు, కొవ్వులను సమర్థవంతంగా జీర్ణం చేసే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణ వ్యక్తుల్లో 'ల్యాక్టోబాసిల్లస్' స్థాయిలు ఎక్కువగా ఉండగా, అథ్లెట్లలో వారి వ్యాయామం, ఆహారానికి తగినట్లుగా ప్రేవులలోని సూక్ష్మజీవుల సమతుల్యత (Microbial Signature) వేర్వేరుగా రూపాంతరం చెందింది.
వ్యక్తిగత పోషకాహారం ముఖ్యం..!
"చేసే క్రీడ లేదా వ్యాయామ రకానికి అనుగుణంగా శరీరంలో జరిగే మార్పులను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అథ్లెట్లలో పనితీరు మెరుగుపడటానికి, గాయాల బారిన పడకుండా త్వరగా కోలుకోవడానికి వ్యక్తిగత పోషకాహార ప్రణాళికలు (Personalized Nutrition), ప్రత్యేక శిక్షణా పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎన్ఐఎన్ డైరెక్టర్ డా.భారతి కులకర్ణి చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
