Scrub Typhus : ఏపీ వ్యాప్తంగా స్క్రబ్‌ టైఫస్‌ విజృంభణ..! తస్మాత్ జాగ్రత్త..!  

షేర్ చేయండి:
Scrub Typhus : ఏపీ వ్యాప్తంగా స్క్రబ్‌ టైఫస్‌ విజృంభణ..! తస్మాత్ జాగ్రత్త..!  

సాక్షి లైఫ్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 'స్క్రబ్‌ టైఫస్‌' జ్వరాల కేసులు తీవ్రంగా పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. నల్లిని పోలిన చిన్న కీటకం కాటు ద్వారా వచ్చే ఈ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాలకూ విస్తరించింది. ముఖ్యంగా చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సమయానికి గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 ఈ లక్షణాలను ఎలా గుర్తించాలి..?

స్క్రబ్‌ టైఫస్‌ 'ఓరియంటియా సుట్సుగముషి' అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన లార్వల్ మైట్ (చిగ్గర్) కుట్టిన 6 నుంచి 21 రోజుల లోపు లక్షణాలు బయటపడతాయి. ఇతర జ్వరాల్లాగే ప్రారంభంలో కనిపించడం వల్ల చాలా మంది గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు. ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, వణుకు వస్తుంది. సాధారణ మందులకు తగ్గదు. కీటకం కుట్టిన చోట కాలిన మాదిరిగా నల్లటి మచ్చ లేదా పుండు ఏర్పడుతుంది. ఇది స్క్రబ్‌ టైఫస్‌కు ముఖ్య సూచన. తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటాయి. దద్దుర్లు.. కొందరిలో శరీరంపై ఎర్రటి దద్దుర్లు (Rash) కనిపిస్తాయి. ఇతర సమస్యలు.. దగ్గు, జీర్ణ సమస్యలు, వికారం, వాంతులు, నీరసం ఉండవచ్చు.


 నిర్లక్ష్యం వద్దు..!

ప్రారంభ దశలోనే చికిత్స అందిస్తే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. కానీ, ఆలస్యం చేస్తే పరిస్థితి తీవ్రమై ప్రాణాంతకం కావచ్చు. సకాలంలో చికిత్స చేయకపోతే తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు (ARDS), మెదడు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్లు (మెనింజైటిస్‌), మూత్రపిండాల వైఫల్యం వంటి వాటికి దారితీయవచ్చు. సకాలంలో చికిత్స పొందితే మరణాల రేటు 2శాతం కన్నా తక్కువగా ఉంటుంది. ఆలస్యం జరిగితే ఇది 6శాతం నుంచి 30శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

  నివారణ, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి నేరుగా వ్యాపించదు. కీటకం కుట్టడం వల్లే సోకుతుంది. అందుకే నివారణ ఒక్కటే మార్గం. పొలాల్లో, తోటల్లో, గడ్డి ప్రాంతాల్లో పనిచేసేవారు తప్పనిసరిగా పూర్తి చేతులున్న చొక్కా, ప్యాంట్లు, సాక్సులు, బూట్లు ధరించాలి. పొదలు, చెత్తాచెదారం, తడి నేలలు, పశువుల పాకలు ఉన్న ప్రదేశాల్లో ఈ కీటకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాత మంచాలు, పరుపులు, దిండ్లు, పాతబడిన సామగ్రిలో ఈ కీటకాలు ఉండే అవకాశం ఉంది. వాటిని శుభ్రం చేయాలి లేదా మార్చేయాలి. పిల్లలకు కాళ్లు, చేతులు కప్పి ఉంచే దుస్తులు వేయాలి. ఆరుబయట ఆడుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

చికిత్స ఎలా..?

స్క్రబ్‌ టైఫస్‌కు యాంటీబయాటిక్స్ (ముఖ్యంగా డాక్సీసైక్లిన్) ద్వారా సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. జ్వరం ఎంతకీ తగ్గకపోయినా, శరీరంపై నల్లని మచ్చలు లేదా దద్దుర్లు కనిపించినా ఆలస్యం చేయకుండా స్క్రబ్‌ టైఫస్‌ను నిర్ధారించే ఎలిసా (ELISA) పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, అనుమానిత లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారానే స్క్రబ్‌ టైఫస్‌ తీవ్రతను అదుపు చేయవచ్చు.

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

ఇది కూడా చదవండి.. వరల్డ్ సికిల్ సెల్ డే చరిత్ర, ప్రాముఖ్యత..?  

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.