Pesticide Suicide Cases : దేశంలో పురుగు మందు ఆత్మహత్యల్లో తెలంగాణ టాప్.. ‘పారాక్వాట్’..
సాక్షి లైఫ్ : దేశంలో కలుపు నివారణకు విరివిగా వాడుతున్న ‘పారాక్వాట్’ (Paraquat) అనే రసాయన హెర్బిసైడ్.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాణాంతకంగా మారుతోంది. పురుగు మందు తాగి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్యలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో (NCRB) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
గడిచిన ఏడాది దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం 26,921 కీటకనాశిని ఆత్మహత్యల్లో.. ఒక్క తెలంగాణలోనే అత్యధికంగా 4,252 మరణాలు సంభవించాయి. ఇది దేశం మొత్తం మరణాల్లో దాదాపు 16 శాతంగా ఉంది. ఈ మరణాలలో పురుషులు 3,341 మంది కాగా, మహిళలు 911 మంది ఉన్నారు. తెలంగాణ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (3,748), తమిళనాడు (3,364), ఆంధ్రప్రదేశ్ (2,871) నిలిచాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలను కలిపి చూస్తే దేశంలోని మొత్తం పురుగుల మందు మరణాలలో పావు వంతు (25% పైగా) ఇక్కడే చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
విరుగుడు లేదు..
పారాక్వాట్ డిక్లోరైడ్ అత్యంత విషపూరితమైన రసాయనం. మార్కెట్లో లభించే ఈ చౌకకలుపు నివారణ మందు కేవలం 20 నుంచి 30 మిల్లీలీటర్లు శరీరంలోకి చేరినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి నిర్దిష్టమైన విరుగుడు (Antidote) అందుబాటులో లేదు. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలను (kidneys) పూర్తిగా దెబ్బతీస్తుంది.
గాంధీ ఆసుపత్రిలో జరిగిన అధ్యయనాల ప్రకారం.. పారాక్వాట్ తాగిన వారిలో మరణాల రేటు 80 నుంచి 100 శాతంగా ఉంటోంది. ఆసుపత్రికి వచ్చే ప్రతి 10 విషప్రయోగ కేసుల్లో 6 నుంచి 7 కేసులు ఈ పారాక్వాట్ వల్లే జరుగుతున్నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
శాశ్వత నిషేధం..
ఈ రసాయనం తీవ్రతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మార్చి 31 నుండి అమల్లోకి వచ్చేలా 60 రోజుల పాటు తాత్కాలికంగా దీని విక్రయాలు, నిల్వలపై నిషేధం విధించింది. అయినప్పటికీ, పొరుగు రాష్ట్రాల నుంచి దొంగచాటుగా, ఆన్లైన్ ద్వారా లేదా సరిహద్దు మార్కెట్ల ద్వారా ఇది రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఏటా దాదాపు 5,500 నుంచి 6,000 మంది పారాక్వాట్ వల్ల చనిపోతున్నారని అంచనా. ఉమ్మడి 10 జిల్లాల్లో నెలకు సగటున 100 నుండి 150 కేసులు నమోదవుతుండగా, ప్రతి జిల్లాలో 40 నుంచి 50 మరణాలు సంభవిస్తున్నాయి. కేవలం తాత్కాలిక రాష్ట్ర స్థాయి ఆంక్షలు సరిపోవని.. దేశవ్యాప్తంగా ఈ రసాయనాన్ని పూర్తిగా అరికట్టాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని 'శాశ్వత జాతీయ నిషేధం' విధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తెలంగాణ విభాగం సహా పలువురు ఆరోగ్య రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
