Milk Bank and Organ Transplant Center : గాంధీ హాస్పిటల్ లో మిల్క్ బ్యాంక్, అవయవ మార్పిడి కేంద్రం ప్రారంభం..!
సాక్షి లైఫ్ : తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య రంగంలో మరో కీలక అడుగు పడింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో రూ. 40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక 'మదర్ మిల్క్ బ్యాంక్', 'అవయవ మార్పిడి కేంద్రాన్ని' (Organ Transplant Centre) రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా విభాగాలను పరిశీలించి, అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, వాటి పనితీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
నవజాత శిశువులకు వరం.. మిల్క్ బ్యాంక్..
తల్లి పాలు లభించని అనాథ పిల్లలకు, అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు ఈ 'మదర్ మిల్క్ బ్యాంక్' ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని అధికారులు తెలిపారు. ఈ సదుపాయం ద్వారా అవసరమైన పసిబిడ్డలకు సురక్షితమైన రీతిలో తల్లి పాలను అందించే అవకాశం కలుగుతుంది.
రూ. 40 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు..
గాంధీ ఆసుపత్రిలో ప్రారంభమైన కొత్త అవయవ మార్పిడి కేంద్రంలో ఎన్నో అత్యాధునిక వసతులు కల్పించారు. ఆరు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు..అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఆపరేషన్ థియేటర్లు. మూడు ఐసీయూలు..అవయవ మార్పిడి రోగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా 25 పడకల సామర్థ్యంతో ఐసీయూలు.
ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు..ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేలా ప్రత్యేక వసతులు.
ఈ సందర్భంగా మంత్రి సి. దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆసుపత్రిలో కూడా మరొక అవయవ మార్పిడి కేంద్రాన్ని తీసుకువస్తున్నామని, అలాగే రాష్ట్రంలోని మరో ఏడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవాల సేకరణ కేంద్రాలను (Organ Retrieval Centres) ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఐవీఎఫ్ కేంద్రంలో కవలల సందడి..
గాంధీ ఆసుపత్రిలోని ఐవీఎఫ్ (IVF) కేంద్రం ద్వారా సంతాన సాఫల్యత పొంది, కవల పిల్లలకు జన్మనిచ్చిన ఒక జంటను మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. గాంధీ ఐవీఎఫ్ కేంద్రం అధిపతి డాక్టర్ శోభను, వారి బృందాన్ని మంత్రి సత్కరించారు. అలాగే, ఉస్మానియా ఆసుపత్రిలో 18 నెలల చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి చికిత్స చేసిన గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్‌ను కూడా ఈ వేదికపై మంత్రి ఘనంగా సన్మానించారు.
అనంతరం గాంధీ వైద్య కళాశాల 68వ బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొని పట్టాలను అందజేశారు.
వైద్య వృత్తి అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. మానవాళికి సేవ చేసే ఒక పవిత్రమైన బాధ్యత. 170 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన గాంధీ ఆసుపత్రి ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచింది. డెంగీ, స్వైన్ ఫ్లూ, కరోనా వంటి విపత్కర సమయాల్లో లక్షలాది మందికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడింది," అని మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
