Noodles : పిల్లలకు నూడుల్స్ పెడుతున్నారా..? వారానికి ఎన్నిసార్లు పెట్టొచ్చంటే..?
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలితో పాటు పిల్లల ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఇంట్లో వండిన వేడి వేడి అన్నం, పప్పు, కూరగాయల స్థానంలో.. ఫాస్ట్ ఫుడ్స్ వచ్చి చేరాయి. ముఖ్యంగా నూడుల్స్ అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నిమిషాల్లో తయారవ్వడం, రుచిగా ఉండటంతో వీటిని మళ్లీ మళ్లీ అడుగుతుంటారు. తల్లిదండ్రులు కూడా ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలు అడిగారు కదా అని తరచుగా ఇస్తుంటారు. అయితే, ఇలా రోజూ నూడుల్స్ తినిపించడం పిల్లల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇన్స్టంట్ నూడుల్స్‌లో మైదా, సోడియం, నిల్వ ఉంచే రసాయనాలు (preservatives) మోతాదుకు మించి ఉంటాయి. శరీర ఎదుగుదలకు అవసరమైన పోషకాలు వీటిలో దాదాపు శూన్యం. మరి పిల్లలకు నూడుల్స్ అసలు పెట్టకూడదా..? వారానికి ఎన్నిసార్లు పెట్టొచ్చు..? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
వారానికి ఎన్నిసార్లు సురక్షితం..?
పోషకాహార నిపుణుల సూచన ప్రకారం.. పిల్లలకు ఇన్స్టంట్ నూడుల్స్‌ను వారానికి ఒక్కసారి, మహా అయితే రెండుసార్లు మాత్రమే తినిపించాలి. అంతకుమించి తరచుగా ఇవ్వడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.
మితిమీరితే జరిగే నష్టాలివే..
నూడుల్స్ ఎక్కువగా తినడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
పోషకాహార లోపం..విటమిన్లు, మినరల్స్ అందకపోవడం వల్ల పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడుతుంది.
ఊబకాయం..మైదా, కొవ్వుల కారణంగా త్వరగా బరువు పెరిగి ఊబకాయం బారిన పడతారు. అధిక రక్తపోటు..ఇందులో ఉప్పు అధికంగా ఉండటం వల్ల చిన్న వయసులోనే బీపీ వచ్చే ముప్పు పెరుగుతుంది.
జీర్ణ సమస్యలు..పీచు పదార్థం (fiber) లేకపోవడం వల్ల మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు బాధిస్తాయి.
రోగనిరోధక శక్తి క్షీణత..అవసరమైన పోషకాలు అందక పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి తరచుగా జబ్బుల పడుతుంటారు.
ఏకాగ్రత లోపం..సరైన పోషకాలు లేని జంక్ ఫుడ్ వల్ల చురుకుదనం తగ్గి, చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది.
నూడుల్స్‌ను ఆరోగ్యకరంగా ఇలా మార్చండి..!
పిల్లలు మారం చేసినప్పుడు నూడుల్స్ ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటే.. ఈ కింది జాగ్రత్తలు పాటించడం ద్వారా వాటిని కొంత ఆరోగ్యకరంగా మార్చవచ్చు:
మసాలా వద్దు..ప్యాకెట్‌తో పాటు వచ్చే ఇన్స్టంట్ మసాలా పొడిని వాడకపోవడమే మంచిది. అందులో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి.
కూరగాయలు జోడించండి..క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, క్యాప్సికమ్, పాలకూర, బీన్స్ వంటివి ఎక్కువగా ఉడికించి వేయాలి.
ప్రోటీన్ జత చేయండి..గుడ్డు, చికెన్ ముక్కలు, పనీర్ లేదా చీజ్ కలపడం ద్వారా నూడుల్స్‌లో ప్రోటీన్ శాతాన్ని పెంచొచ్చు.
పండ్లు ఇవ్వండి..నూడుల్స్ తిన్న తర్వాత కాసేపటికి తాజా పండ్లు లేదా పెరుగు ఇస్తే జీర్ణక్రియకు మేలు జరుగుతుంది.
పిల్లల కోసం ఇతర ఆరోగ్యకరమైన స్నాక్స్..
నూడుల్స్‌కు బదులుగా ఇంట్లోనే రుచికరంగా, ఆరోగ్యకరంగా తయారు చేసే ఈ కింది వాటిని అలవాటు చేయడం ఉత్తమం.
కూరగాయలు వేసిన ఉప్మా లేదా పోహా
గోధుమ రవ్వ..
పెసరట్టు లేదా వెజిటబుల్ శాండ్విచ్
ఇడ్లీ-సాంబార్ లేదా పరాఠా-పెరుగు
ఓట్స్, సిరిధాన్యాలతో చేసిన స్నాక్స్
నూడుల్స్ పూర్తిగా విషం కాదు, కానీ పరిమితికి మించి తింటేనే అనర్థం. అందులో కూరగాయలు, గుడ్డు లాంటివి వేసి సమతుల్యంగా చేసి వారానికి ఒకట్రెండు సార్లు పెడితే ఎలాంటి నష్టమూ ఉండదు. ఎదిగే వయసులో పిల్లలకు ఎప్పుడూ పోషక విలువలున్న ఆహారానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
