Infant Nutrition Guide : పుట్టినప్పటి నుంచి ఏడాది వరకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పుట్టినప్పటి నుంచి ఏడాది వయసు వచ్చే వరకు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల అత్యంత కీలకం. ఈ సమయంలో అందించే పోషకాహారమే వారి ఎముకల దృఢత్వానికి, మెదడు వికాసానికి, రోగనిరోధక శక్తికి బలమైన పునాది వేస్తుంది. అయితే, ఏ వయసులో పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి..? ఘన పదార్థాలను ఎప్పుడు మొదలుపెట్టాలి..? అనే విషయాల్లో చాలామంది కొత్త తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంటుంది.

పిల్లల వయసు పెరిగే కొద్దీ వారి పోషక అవసరాలు, జీర్ణవ్యవస్థ సామర్థ్యం మారుతుంటాయి. దానికి అనుగుణంగానే పసిపిల్లల ఆహార ప్రణాళిక ఉండాలని పిల్లల వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి 12 నెలల వయసున్న పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టొచ్చో తెలిపే సమగ్రమైన సమాచారం మీకోసం..

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

పుట్టినప్పటి నుంచి 6 నెలలు..తల్లిపాలే అమృతం.. 

ఈ వయసులో శిశువు జీర్ణవ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. కాబట్టి ఆరు నెలలు నిండే వరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. తల్లి పాలలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు, రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు పుష్కలంగా ఉంటాయి. ఏదైనా అనారోగ్య కారణాల వల్ల తల్లి పాలు ఇవ్వడం సాధ్యం కాకపోతే, వైద్యుల సలహా మేరకు మాత్రమే ఫార్ములా మిల్క్ వాడాలి.

ఏమి ఇవ్వాలి..? తల్లి పాలు లేదా వైద్యులు సూచించిన ఫార్ములా పాలు.

ఎలాంటివి ఇవ్వకూడదు అంటే..?

కనీసం మంచినీళ్లు కూడా పట్టకూడదు. ఆవు లేదా గేదె పాలు, తేనె, ఇతర ఘన ఆహార పదార్థాలు అస్సలు ఇవ్వకూడదు.

6 - 8 నెలలు..సెమీ సాలిడ్ ఆహారం.. 

ఆరు నెలలు నిండిన తర్వాత పిల్లలకు తల్లిపాలతో పాటు మెత్తటి గుజ్జులా ఉండే ఆహారాన్ని నెమ్మదిగా అలవాటు చేయాలి. రోజుకు 2 నుంచి 3 సార్లు ఈ ఘన ఆహారాన్ని కొద్దికొద్దిగా తినిపించవచ్చు. ఒకేసారి కాకుండా ఒక్కో కొత్త పదార్థాన్ని పరిచయం చేయాలి.

ఉదయం..తల్లి పాలు లేదా ఫార్ములా పాలు..

అల్పాహారం (break fast): బాగా పండిన అరటిపండు గుజ్జు లేదా ఉడికించి మెత్తగా చేసిన ఆపిల్ గుజ్జు.

మధ్యాహ్నం..పల్చటి పప్పుకట్టు, బియ్యం గంజి.

సాయంత్రం..ఉడికించిన క్యారెట్, బంగాళదుంప లేదా గుమ్మడికాయ గుజ్జు.

రాత్రి..తల్లి పాలు.

8 నుంచి 10 నెలలు..కాస్త చిక్కటి ఆహారం..

ఈ వయసు నాటికి పిల్లల జీర్ణశక్తి కాస్త మెరుగుపడుతుంది. కొత్త రుచులను ఆస్వాదించడం మొదలుపెడతారు. అందువల్ల ఆహారాన్ని కాస్త చిక్కగా చేసి రోజుకు 3 నుంచి 4 సార్లు ఇవ్వొచ్చు.

ఉదయం..పాలు.

అల్పాహారం..మెత్తగా చేసిన పండ్ల గుజ్జు అంటే అరటి, ఆపిల్, బొప్పాయి వంటివి ఇవ్వొచ్చు.

మధ్యాహ్నం..పప్పు, అన్నం, కూరగాయలు వేసి బాగా మెత్తగా ఉడికించిన కిచిడీ, కొద్దిగా పెరుగు.

సాయంత్రం..రాగి జావ, గంజి లేదా ఉడికించిన ఉప్మా రవ్వ.

రాత్రి..పాలు.

10 నుంచి 12 నెలలు..ఇంటి భోజనమే.. కానీ మెత్తగా చేసి ఇవ్వాలి..!

ఏడాది వయసు దగ్గరపడుతున్న కొద్దీ ఇంట్లో పెద్దవాళ్లు తినే ఆహారాన్నే పిల్లలకూ అలవాటు చేయవచ్చు. అయితే అది బాగా ఉడికి, మెత్తగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు మూడు ప్రధాన భోజనాలు, రెండుసార్లు ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇవ్వొచ్చు.

ఉదయం..పాలు..

అల్పాహారం.. బాగా ఉడికించిన గుడ్డు పచ్చసొన లేదా పండ్ల ముక్కలు.

మధ్యాహ్నం.. పప్పు అన్నం లేదా పప్పు కూరగాయలతో మెత్తగా చేసిన రోటీ.

సాయంత్రం..ఉప్పు, కారం తక్కువగా వేసిన ఉప్మా, అటుకులు లేదా జావ.

రాత్రి..పాలు.. 

తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు..

తేనె వద్దు.. ఏడాది వయసు నిండేలోపు పిల్లలకు పొరపాటున కూడా తేనె ఇవ్వకూడదు. ఇందులో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల 'ఇన్ఫాంట్ బొటులిజం' అనే తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చే ప్రమాదం ఉంది.

ఉప్పు, చక్కెర నియంత్రణ..పసిపిల్లల కిడ్నీలు పూర్తిగా అభివృద్ధి చెందవు కాబట్టి, వారి ఆహారంలో ఉప్పు, చక్కెరలను సాధ్యమైనంత వరకు కలపకపోవడమే మంచిది.

3 రోజుల నియమం.. పసిపిల్లలకు ఏదైనా కొత్త ఆహారాన్ని ఉదాహరణకు కొత్త పండు లేదా కూరగాయ పరిచయం చేసినప్పుడు, వరుసగా 3 రోజుల పాటు అదే ఆహారాన్ని కొద్ది మొత్తంలో ఇవ్వాలి. దీనివల్ల ఆ ఆహారం బిడ్డకు పడుతుందా లేదా, ఏవైనా అలర్జీలు వస్తున్నాయా అనేది స్పష్టంగా తెలుస్తుంది.

బలవంతం వద్దు..పిల్లలకు ఆకలి లేనప్పుడు బలవంతంగా ఆహారం తినిపించకూడదు. వారి ఆకలిని బట్టే భోజనం పెట్టాలి.

పరిశుభ్రత..ఆహారం వండేటప్పుడు, తినిపించేటప్పుడు చేతులు, గిన్నెలు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తపడాలి.

ఈ ఆహార పట్టిక ఒక సాధారణ మార్గదర్శకం మాత్రమే. మీ బిడ్డకు ఏదైనా కొత్త ఆహారాన్ని అలవాటు చేసే ముందు, లేదా వారి ఆరోగ్య స్థితిగతులను బట్టి ఏవైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగా పిల్లల వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.