Jaundice in Children: చిన్నారుల్లో పచ్చకామెర్లు..ఎప్పుడు ప్రమాదం..? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సాక్షి లైఫ్ : నవజాత శిశువుల్లో చర్మం లేదా కంటిలోని తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారడం సర్వసాధారణం. వైద్య పరిభాషలో దీనిని నియోనాటల్ జాండిస్ (Neonatal Jaundice) అంటారు. చాలా సందర్భాలలో ఇది సహజంగానే తగ్గిపోయినప్పటికీ, కొన్ని సమయాల్లో తీవ్ర రూపం దాల్చి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఎప్పుడు అప్రమత్తం కావాలి అనే వివరాలు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
పచ్చకామెర్లు రావడానికి కారణమేంటి..?
రక్తంలోని ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నమైనప్పుడు బిలిరుబిన్ (Bilirubin) అనే పసుపు రంగు వ్యర్థ పదార్థం ఉత్పన్నమవుతుంది. పెద్దవారిలో కాలేయం (liver) ఈ బిలిరుబిన్ను సులభంగా శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. అయితే, పుట్టిన వెంటనే శిశువుల కాలేయం పూర్తిగా పరిపక్వత చెందదు. దీనివల్ల రక్తం నుంచి బిలిరుబిన్ బయటకు వెళ్లడం నెమ్మదించి, చర్మంపై పసుపు రంగు తేలుతుంది. సాధారణ పచ్చకామెర్లు (Physiological Jaundice)..ఇది సాధారణంగా శిశువు పుట్టిన 2 లేదా 3వ రోజు కనిపిస్తుంది. ఒకటి లేదా రెండు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది.
ఎప్పుడు ప్రమాదకరంగా భావించాలి..?
కింది లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే పీడియాట్రిషియన్ ను సంప్రదించాలి.. జన్మించిన మొదటి రోజే కాళ్లు, చేతులు లేదా కళ్లు తీవ్రమైన పసుపు రంగులోకి మారడం. పసుపు రంగు ముఖం నుంచి పొట్ట, కాళ్లు, పాదాల వరకు శరవేగంగా విస్తరించడం. తల్లిపాలు తాగడానికి ఆసక్తి చూపకపోవడం లేదా పీల్చలేకపోవడం.
అతిగా నిద్రపోవడం లేదా నీరసం: పిలిచినా లేవకపోవడం, తీవ్రమైన బద్ధకం, నిస్సత్తువ.బిగ్గరగా ఏడవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటం. రక్తంలో బిలిరుబిన్ మోతాదు తీవ్రస్థాయికి చేరితే అది మెదడు కణాలపై ప్రభావం చూపే ప్రమాదం (కెర్నిక్టెరస్ - Kernicterus) ఉంటుంది. అందుకే కేవలం కంటితో చూసి కాకుండా, రక్త పరీక్షల ద్వారా బిలిరుబిన్ స్థాయులను నిర్ధారించుకోవడం ముఖ్యం.
తల్లిదండ్రులు ఏం చేయాలి..?
బిడ్డకు రోజుకు 8 నుంచి 12 సార్లు తల్లిపాలు పట్టాలి. సరిపడా ద్రవాలు శరీరంలోకి చేరితే, మలమూత్రాల ద్వారా బిలిరుబిన్ త్వరగా విసర్జించబడుతుంది. వైద్యుల పర్యవేక్షణ: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 3 నుంచి 5 రోజుల వ్యవధిలో శిశువు చర్మం రంగును గమనిస్తూ ఉండాలి. ఇంట్లో దొరికే నాటు మందులు లేదా బామ్మల చిట్కాలను పసిబిడ్డలపై ప్రయోగించకూడదు. ఇది పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది.
ఆసుపత్రిలో చికిత్స ఎలా ఉంటుంది..?
రక్తంలో బిలిరుబిన్ శాతం ఎక్కువగా ఉంటే, వైద్యులు ఫోటోథెరపీ (Phototherapy) చేస్తారు. ఇందులో శిశువును ప్రత్యేక నీలికాంతి కిరణాల కింద ఉంచుతారు. ఈ కాంతి బిలిరుబిన్ను నీటిలో కరిగే రూపంలోకి మార్చి, మూత్రం ద్వారా బయటకు పోయేలా చేస్తుంది. చాలా తీవ్రమైన కేసులలో రక్తం మార్పిడి (Exchange Transfusion) అవసరపడవచ్చు.
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
