Food Safety Precautions : ఐదేళ్లలోపు చిన్నారుల ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
సాక్షి లైఫ్ : చిన్నారుల శారీరక ఎదుగుదల, రోగనిరోధక శక్తి, ఎముకలు, దంతాల ఆరోగ్యం వారు తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటాయి. అయితే పెద్దలు సులభంగా తినే కొన్ని పదార్థాలు ఐదేళ్లలోపు చిన్నారులకు తీవ్ర సమస్యలను తెచ్చిపెడతాయని శిశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా నమలకపోవడం వల్ల గొంతులో ఆహారం చిక్కుకుపోయే ప్రమాదంతో పాటు కడుపు సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశముంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
గొంతులో చిక్కుకునే పదార్థాలతో జాగ్రత్త..
ఐదేళ్లలోపు పిల్లలకు పళ్లు పూర్తిగా ఏర్పడినా ఆహారాన్ని సరిగ్గా నమలడం అలవాటు కాదు. గట్టిగా, గుండ్రంగా లేదా జిగురుగా ఉండే పదార్థాలను వారు నమలకుండా మింగేయడానికి ప్రయత్నిస్తారు. బాదం, వేరుశనగ, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్‌ను నేరుగా ఇవ్వకూడదు. వాటిని మెత్తటి పొడిగా మార్చి ఆహారంలో కలపాలి. ద్రాక్ష పండ్లు, క్యారెట్ ముక్కలు, గట్టి మిఠాయిలను అలాగే ఇస్తే శ్వాసనాళంలో ఇరుక్కుపోయే ముప్పు ఉంటుంది. పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మాత్రమే ఇవ్వాలి.
పచ్చి లేదా సరిగ్గా ఉడకని ఆహారాలు వద్దు..
చిన్నారులలో రోగనిరోధక వ్యవస్థ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందదు. కలుషితమైన లేదా సరిగ్గా ఉడకని ఆహారం తింటే తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. సరిగ్గా ఉడకని మాంసం, సగం ఉడికించిన గుడ్లు ఇవ్వరాదు. పాశ్చరైజ్ చేయని పాలు లేదా పాల ఉత్పత్తులను నేరుగా అందించకూడదు. తాజా పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి, అవసరమైతే బాగా ఉడికించి ఇవ్వడం మేలు.
అధిక చక్కెరలకు దూరంగా ఉంచాలి..
స్వీట్లు, కృత్రిమ శీతల పానీయాలు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ స్నాక్స్‌ను తరచూ ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదు. రెండేళ్ల లోపు పిల్లలకు చక్కెర కలిపిన ఆహారాలను అస్సలు ఇవ్వకూడదని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సూచిస్తోంది. వీటిలోని అధిక చక్కెరలు దంతక్షయానికి కారణమవడంతో పాటు చిన్న వయసులోనే ఊబకాయం ముప్పును పెంచుతాయి.
తేనె, పండ్ల రసాల వినియోగంపై అప్రమత్తత..
ఏడాది లోపు తేనె వద్దు: ఒక సంవత్సరం లోపు వయసున్న పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ తేనె పట్టకూడదు. ఇందులో ఉండే బ్యాక్టీరియా వల్ల 'ఇన్ఫాంట్ బోటులిజం' అనే తీవ్రమైన నాడీ సంబంధిత ముప్పు తలెత్తే ప్రమాదం ఉంది. జ్యూస్‌ల కన్నా తాజా పండ్లే మేలు: ఏడాది లోపు పిల్లలకు కృత్రిమ పండ్ల రసాలు ఇవ్వకూడదు. ప్యాక్డ్ జ్యూస్‌లలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఏడాది దాటిన తర్వాత కూడా జ్యూస్‌ల కంటే మెత్తగా చేసిన తాజా పండ్ల ముక్కలను ఇవ్వడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
