Hands and Legs Numbness : కాళ్లు, చేతులు మొద్దుబారుతున్నాయా..? ఎప్పుడు సాధారణం.. ఎప్పుడు ప్రమాదం..?
సాక్షి లైఫ్ : ఉదయం నిద్రలేవగానే లేదా కాసేపు ఒకేచోట కూర్చున్నప్పుడు కాళ్లు, చేతులు మొద్దుబారడం, తిమ్మిర్లు రావడం సాధారణంగా జరిగేదే. వైద్య పరిభాషలో దీనిని 'పరేస్తేసియా' (Paresthesia) అంటారు. చాలామంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ, ఈ సమస్య తరచూ వేధిస్తుంటే లేదా దీర్ఘకాలం పాటు కొనసాగుతుంటే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఈ చిన్న సమస్యే పెద్ద రోగాలకు సంకేతం కావచ్చు.
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
అసలు ఎందుకు ఇలా జరుగుతుంది..?
నాడులపై (nerves) తీవ్రమైన ఒత్తిడి పడినప్పుడు లేదా వాటికి రక్త ప్రసరణలో ఆటంకం కలిగినప్పుడు మెదడుకు సంకేతాలు సరిగా అందవు. దీనివల్ల కాళ్లు, చేతుల్లో స్పర్శ తగ్గినట్లు అనిపిస్తుంది. కొద్ది నిమిషాల్లోనే ఇది మళ్లీ సర్దుకుంటుంది. కానీ, దీర్ఘకాలం పాటు ఈ సమస్య ఉంటే నాడులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అర్థం చేసుకోవాలని 'అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ' సూచిస్తోంది.
ఎప్పుడు సాధారణం..?
అన్ని వేళలా తిమ్మిర్లు రావడం ప్రమాదకరం కాదు. ఏ సందర్భాల్లో ఇది అత్యంత సాధారణ ప్రక్రియ అంటే..?
ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చోవడం.
కాళ్లపై కాళ్లు వేసుకుని (crossed legs) కూర్చోవడం.
నిద్రపోయేటప్పుడు తల కింద చేయి పెట్టుకుని పడుకోవడం.
ఇలాంటి సమయాల్లో నాడులు, రక్తనాళాలపై ఒత్తిడి పడి తిమ్మిర్లు వస్తాయి. మనం భంగిమ మార్చగానే ఒత్తిడి తగ్గి, రక్తప్రసరణ సాధారణ స్థితికి చేరుకుంటుంది. నిమిషాల వ్యవధిలో తిమ్మిర్లు తగ్గిపోతాయి. దీనికి ఎలాంటి చికిత్స అవసరం లేదు.
ప్రమాద ఘంటికలు అని ఎలా గుర్తించాలి..?
ఎలాంటి కారణం లేకుండా కాళ్లు, చేతులు పదే పదే మొద్దుబారుతున్నా.. ఆ ప్రభావం తీవ్రంగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
స్ట్రోక్ ముప్పు..
శరీరంలో ఒకవైపు మాత్రమే అకస్మాత్తుగా మొద్దుబారడం, మాట తడబడటం, చూపు మందగించడం, బ్యాలెన్స్ తప్పడం వంటివి కనిపిస్తే తక్షణం అప్రమత్తం కావాలి. ఇది స్ట్రోక్‌కు (brain stroke) సంకేతం కావచ్చు. ఇలాంటప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ చికిత్స అందించాలి.
నరాల సమస్యలు..
తిమ్మిర్లతో పాటు కండరాల బలహీనత, నడవడంలో ఇబ్బంది, మెడ లేదా వెన్నులో విపరీతమైన నొప్పి ఉంటే అది వెన్నుపాము, మెదడు లేదా నరాలకు సంబంధించిన తీవ్ర సమస్యగా భావించాలి.
మధుమేహం (diabetes)..
షుగర్ వ్యాధి ఉన్నవారికి తరచూ కాళ్లు, చేతులు మొద్దుబారుతుంటే, అది కచ్చితంగా 'డయాబెటిక్ న్యూరోపతి' (diabetic neuropathy)అంటే నరాలు దెబ్బతినడం కావచ్చు.
విటమిన్ల లోపం..
శరీరంలో విటమిన్ బి12 లోపం, థైరాయిడ్ సమస్యలు లేదా కొన్ని రకాల ఆటోఇమ్యూన్ వ్యాధుల వల్ల కూడా ఈ తరహా సమస్యలు తలెత్తుతాయి.
మల్టిపుల్ స్క్లెరోసిస్ (Multiple Sclerosis) ముప్పు..
ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇందులో మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థే.. మెదడు, వెన్నుపాము నాడుల చుట్టూ ఉండే రక్షణ కవచంపై దాడి చేస్తుంది. చేతులు, కాళ్లు మొద్దుబారడం, కళ్లు మసకబారడం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం, కండరాల బలహీనత తదితరాలు దీని ప్రాథమిక లక్షణాలు. ఈ వ్యాధి లక్షణాలు కొన్ని రోజులు ఉండి మళ్లీ తగ్గిపోతుంటాయి. దాంతో రోగులు దీనిని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కాబట్టి తరచూ తిమ్మిర్లు వస్తుంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
