జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే..? ఏమి చేయాలి..?
సాక్షి లైఫ్: పదునైన మనస్సు, పదునైన జ్ఞాపకశక్తి ఉంటే వారికంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇటీవల అధిక ఒత్తిడి, పేలవమైన జీవనశైలి, పోషకాల కొరత కారణంగా జ్ఞాపకశక్తి బలహీనపడటం జరుగుతుంది. ఇంతకుముందు జ్ఞాపకశక్తి సమస్య కేవలంవృద్ధుల్లోనే ఎక్కువగా కనిపించేది. కానీ ఈ సమస్య ప్రస్తుతం చిన్న పిల్లలలో కూడా తలెత్తుతోంది. పిల్లలకు పదునైన జ్ఞాపకశక్తి ఉంటే, వారు చదువులో బాగా రాణిస్తారు. వారి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారాలు, సరైన జీవనశైలిని అనుసరించడం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే పోషకాహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు పలురకాల మార్పుచేర్పులతో జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చని వారు వెల్లడిస్తున్నారు.
చేప నూనె..
చేప నూనె శరీరానికి మేలు చేస్తుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఇందులో కనిపిస్తాయి. దీని వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి- ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది. దీని వినియోగం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
పంచదార..
జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే పంచదార తీసుకోవడం తగ్గించాలి. చక్కెర ఎక్కువగా తినడం వల్ల మధుమేహం, గుండె సమస్యలు, అధిక రక్తపోటు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి బలహీనపడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మెదడు పనితీరు కూడా నెమ్మదిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
ధ్యానం..
జ్ఞాపకశక్తిని పదును పెట్టడానికి ధ్యానం సులభమైన,ఉత్తమమైన మార్గం. ధ్యానం రక్తపోటును,ఒత్తిడిని తగ్గిస్తుంది. ధ్యానం మెదడుకు విశ్రాంతినిస్తుంది. కాబట్టి తద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
బరువు..
ప్రస్తుతం బరువు పెరగడం అనేది అతి పెద్ద సమస్య గా మారింది. అధిక బరువు అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఊబకాయం కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడటంతో పాటు, శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. ఊబకాయం అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలను కూడా పెంచుతుంది. కనుక బరువు తగ్గించుకోవడం చాలా ఉత్తమం.
కంటినిండా నిద్ర..
తక్కువ నిద్ర కారణంగా అనేక రకాల వ్యాధులు వస్తాయి. అంతేకాదు ఒత్తిడి కూడా పెరుగుతుంది. నిద్ర తక్కువగా ఉండటం వల్ల ఏ పని మీదా దృష్టి పెట్టాలన్నా కష్టమవుతుంది. దీని వల్ల శరీరంపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. జ్ఞాపకశక్తి మెరుగుపరుచుకోవడానికి, ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
