Brain-Tickling Content : వింత రీల్స్..మెదడుకు గిలిగింతలు..నాట్యం చేసే కాఫీ.. పాటలు పాడే కూరగాయలు.. ఎందుకింత క్రేజ్..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) పుణ్యమా అని సోషల్ మీడియా సరికొత్త రూపం సంతరించుకుంది. కప్పులోంచి లేచి డ్యాన్స్ చేసే కాఫీ, పాటలు పాడే టాయిలెట్ కమోడ్, మనుషుల్లా గలగలా మాట్లాడే కూరగాయలు, వింత హావభావాలు పలికించే నిత్యావసర వస్తువులు... ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తెరిస్తే చాలు ఇలాంటి అర్థంపర్థం లేని ‘అబ్‌సర్డ్’ రీల్స్ దర్శనమిస్తున్నాయి. చూడ్డానికి ఎంత విడ్డూరంగా అనిపించినా, కోట్లాది మంది వేళ్లకు పనిచెప్పి వీటిని గంటల తరబడి చూస్తూ ఉండిపోతున్నారు. అసలు ఇలాంటి వెర్రి వీడియోల వైపే మెదడు ఎందుకు లాగుతోంది..? తాత్కాలిక నవ్వుల వెనుక దాగి ఉన్న మానసిక చిక్కులేమిటి..? నిపుణుల విశ్లేషణ ఇదీ..!

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

మెదడుకు శ్రమలేని వినోదం.. ‘డోపమైన్’ విందు..!

సాధారణంగా ఏదైనా సినిమా చూసినా లేదా పుస్తకం చదివినా కథను అర్థం చేసుకోవడానికి మెదడు కొంత శ్రమించాల్సి ఉంటుంది. కానీ ఈ వింత రీల్స్ విషయంలో ఆలోచించాల్సిన పనే ఉండదు. ఊహించని దృశ్యాలు (Novelty).. కాఫీ కప్పు గాల్లో తేలుతూ నృత్యం చేస్తుందని మన మెదడు అస్సలు ఊహించదు. ఇలాంటి ఆశ్చర్యకరమైన వింతలు కళ్లముందు ప్రత్యక్షమైనప్పుడు మెదడులోని రివార్డ్ వ్యవస్థ ఉత్తేజితమై ‘ఫీల్ గుడ్’ హార్మోన్లు (dopamine and serotonin) విడుదలవుతాయి.

మెదడుకు చిన్న విరామం..ఉదయం నుంచి ఆఫీస్ పని, చదువు, బాధ్యతలతో అలిసిపోయిన మెదడుకు ఏకాగ్రత అవసరం లేని ఈ రీల్స్ ఓ తాత్కాలిక మానసిక విశ్రాంతిలా (Mental Break) అనిపిస్తాయి. ఇక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. కొన్ని సెకన్ల వినోదంతో మొదలై, ఆల్గోరిథమ్ విసిరే వలలో పడి ఒకదాని వెనుక మరొకటి చూస్తూ గంటల సమయాన్ని ఇట్టే కరిగించేస్తున్నారు.

‘బ్రెయిన్ రాట్’ సంస్కృతి.. డిజిటల్ అలసటపై యువత తిరుగుబాటా..?

అమెరికాలోని రోవన్ విశ్వవిద్యాలయానికి చెందిన డిజిటల్ కల్చర్ పరిశోధకులు 13 నుంచి 26 ఏళ్ల యువతపై చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. నేటి డిజిటల్ ప్రపంచంలో ఇలాంటి అర్ధంలేని రీల్స్‌ను ‘బ్రెయిన్ రాట్’ (Brain Rot) కంటెంట్‌గా పిలుస్తున్నారు.

వినియోగ ఒత్తిడికి వ్యతిరేకం..సోషల్ మీడియాలోని చాలా పోస్టులు యూజర్ల నుంచి ఏదో ఒకటి ఆశిస్తాయి. ఒక వస్తువును కొనమనో, కొత్త నైపుణ్యం నేర్చుకోమనో లేదా ఇతరులతో పోల్చుకుని మరింత అందంగా కనిపించాలనో ఒత్తిడి తెస్తాయి. యాంటీ-కంటెంట్ సిద్ధాంతం..ప్రతిదీ సమాచారంగా మారిన చోట.. ఈ వింత రీల్స్ ఏమీ డిమాండ్ చేయవు. మెదడుపై ఏ ఒత్తిడీ పెట్టని ఈ కంటెంట్‌ను యువత ‘యాంటీ-కంటెంట్’గా చూస్తూ మైండ్‌ను స్విచ్ఛాఫ్ చేసుకోవడానికి వాడుతున్నారు.

 జ్ఞాపకశక్తి, నిద్రకు గ్రహణం..!

ఈ వింత వీడియోలను సరదాగా చూడటంలో తప్పులేనప్పటికీ, అది వ్యసనంగా మారితే తీవ్ర పరిణామాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏకాగ్రత లోపం (Short Attention Span)..10-15 సెకన్ల వేగవంతమైన రీల్స్ చూడటం అలవాటైతే, వాస్తవ జీవితంలో పుస్తకం చదవడం లేదా ఒకే పనిపై ఎక్కువసేపు దృష్టి నిలపడం అసాధ్యంగా మారుతుంది.

నిద్రలేమి ముప్పు..రాత్రి నిద్రపోయే ముందు బెడ్‌పై పడుకుని రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల స్క్రీన్ నుంచి వచ్చే నీలికాంతి మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఫలితంగా నిద్రలేమి, ఉదయాన్నే చిరాకు, అలసట చుట్టుముడతాయి. మానసిక మందగమనం.. నిరంతరం మెదడును ఇలాంటి తక్కువ శ్రమగల వినోదానికే పరిమితం చేస్తే ఆలోచనా శక్తి, విశ్లేషణాత్మక సామర్థ్యం దెబ్బతింటాయి.

మీరూ డిజిటల్ ఉచ్చులో పడ్డారా..? ఇలా బయటపడండి..!

టైమ్ లిమిట్ పెట్టుకోండి.. రోజూ రీల్స్ చూడటానికి 15-20 నిమిషాలకు మించి సమయం కేటాయించవద్దు. ఫోన్‌లో యాప్ టైమర్లను యాక్టివేట్ చేసుకోండి. బెడ్‌రూమ్‌లోకి నో ఫోన్..నిద్రపోవడానికి కనీసం గంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టేయాలి. మెదడుకు ఉపశమనం కావాలనుకున్నప్పుడు తోటపని, చిన్నపాటి నడక, సంగీతం వినడం లేదా పుస్తకం చదవడం వంటి నిజమైన వ్యాపకాలను అలవరుచుకోండి. సాంకేతికత అందించే వినోదాన్ని ఆస్వాదించడం తప్పుకాదు; కానీ ఆ వినోదమే మన విలువైన సమయాన్ని, ఆలోచనాశక్తిని హరించివేసే వ్యసనంగా మారకుండా చూసుకోవడమే విచక్షణ.

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.