Mental health : డిజిటల్ మాయలో జీవితం.. మొబైల్ వ్యసనాన్ని హెచ్చరించే '5 సంకేతాలు' ఇవే..!
సాక్షి లైఫ్ : ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక అనివార్యమైన భాగమైపోయింది. ఆఫీసు పనులు, ఆన్‌లైన్ చదువులు, బ్యాంకు లావాదేవీలు, స్నేహితులతో సంభాషణలు.. ఇలా ప్రతి చిన్న అవసరానికీ మనం ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. అయితే, మన సౌకర్యం కోసం పుట్టిన ఈ సాంకేతికత, మెల్లమెల్లగా ఒక తీవ్రమైన వ్యసనంగా (Nomophobia) మారుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ డిజిటల్ వ్యసనం కేవలం సమయాన్ని వృథా చేయడమే కాకుండా, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, దృష్టి లోపాలు వంటి అనేక శారీరక, మానసిక రుగ్మతలకు దారితీస్తోంది. చాలామంది తాము ఈ మొబైల్ మాయలో పడిపోయామనే విషయాన్ని కూడా గుర్తించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో, మొబైల్ వ్యసనాన్ని పట్టిచూపే 5 ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలను నిపుణులు వివరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
1. కారణం లేకపోయినా పదే పదే చెక్ చేయడం..
మీకు ఎలాంటి కాల్స్, నోటిఫికేషన్లు లేదా మెసేజ్‌లు రాకపోయినా, ప్రతి కొద్ది నిమిషాలకు ఒకసారి చేతులు అప్రయత్నంగా ఫోన్ వైపు వెళ్తున్నాయా? స్క్రీన్‌ను అన్‌లాక్ చేసి సోషల్ మీడియా యాప్స్‌ను స్క్రోల్ చేయడం ఒక అలవాటుగా మారిపోతే, అది వ్యసనానికి ప్రాథమిక సంకేతం. మనకు తెలియకుండానే రోజుకు వందల సార్లు ఫోన్ స్క్రీన్ వైపు చూడటం మెదడులోని రసాయనిక మార్పులకు నిదర్శనం.
2. ఫోన్ దూరమైతే తీవ్ర ఆందోళన, చిరాకు..
ఫోన్‌ను ఇంట్లో మర్చిపోయినా, లేదా సిగ్నల్ అందకపోయినా, బ్యాటరీ అయిపోయినా మీలో విపరీతమైన ఆందోళన, అసహనం, చిరాకు పెరుగుతున్నాయా? వైద్య పరిభాషలో దీనిని 'నోమోఫోబియా' (No Mobile Phone Phobia) అంటారు. ఫోన్ అందుబాటులో లేనప్పుడు కలిగే ఈ మానసిక ఒత్తిడి, మాదకద్రవ్యాలకు బానిసైన వారిలో కనిపించే విత్‌డ్రాయల్ సింప్టమ్స్ (Withdrawal Symptoms) వంటిదేనని నిపుణులు చెబుతున్నారు.
3. కళ్లు తెరిచినా... మూసినా మొబైల్ స్క్రీనే..!
మీ రోజు మొదలయ్యేది, ముగిసేది మొబైల్ స్క్రీన్‌తోనేనా..? ఉదయం నిద్ర లేవగానే పక్కన ఉన్నవారి ముఖం కంటే ముందు ఫోన్ స్క్రీన్ చూడటం, రాత్రి పడకపైకి చేరిన తర్వాత కూడా గంటల తరబడి చీకట్లో ఫోన్ చూస్తూ గడపడం తీవ్రమైన వ్యసన లక్షణం. మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ (Blue Light) వల్ల నిద్రకు కారణమయ్యే 'మెలటోనిన్' హార్మోన్ ఉత్పత్తి దెబ్బతిని, తీవ్ర నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి.
4. బాధ్యతలు, బంధాల కంటే ఫోన్‌కే ప్రాధాన్యత..
సోషల్ మీడియా రీల్స్ చూడటం, ఆన్‌లైన్ గేమింగ్ వంటి వాటి వల్ల మీ చదువు లేదా ఆఫీసు బాధ్యతలు దెబ్బతింటున్నాయా? కుటుంబ సభ్యులతో కలిసి ఒకే గదిలో కూర్చున్నా, వారితో మాట్లాడకుండా ఫోన్ లోనే మునిగిపోతున్నారా? మీ దైనందిన జీవితాన్ని, బంధాలను మొబైల్ ఫోన్ శాసిస్తోందనడానికి ఇది స్పష్టమైన ఆధారమని మనస్తత్వ నిపుణులు వెల్లడిస్తున్నారు.
5. 'ఫాంటమ్ వైబ్రేషన్' సిండ్రోమ్..
జేబులో లేదా పక్కన ఉన్న ఫోన్ మోగకపోయినా, వైబ్రేట్ కాకపోయినా.. ఏదో మెసేజ్ వచ్చినట్లు, ఫోన్ కదిలినట్లు భ్రమపడటాన్ని 'ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్' (Phantom Vibration Syndrome) అంటారు. నిరంతరం ఫోన్ గురించిన ఆలోచనల్లోనే మునిగిపోవడం వల్ల మెదడులోని నరాలు ఈ విధమైన తప్పుడు సంకేతాలను ఇస్తాయి. ఇది మానసిక అలసటకు సంకేతం.
నియంత్రణ మార్గాలు ఇవే..
ఈ సంకేతాలు మీలో కనిపిస్తే అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించాలి. డిజిటల్ డిటాక్స్ (Digital Detox) ద్వారా దీనిని అదుపు చేయవచ్చు. స్క్రీన్ టైమ్ పరిమితి..ఫోన్‌లో స్క్రీన్ టైమర్లను సెట్ చేసుకుని సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించుకోవాలి. నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి..అనవసరమైన యాప్స్ నోటిఫికేషన్లను నిలిపివేయడం ద్వారా పదే పదే ఫోన్ వైపు చూడాలనే కోరిక తగ్గుతుంది.
బెడ్‌రూమ్‌లోకి నో ఎంట్రీ.. రాత్రి పడుకోవడానికి కనీసం ఒక గంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టేయాలి. బెడ్‌రూమ్‌కు దూరంగా ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మంచి అలవాటు. సాంకేతికతను మన అవసరాలకు వాడుకోవాలి కానీ, అదే మన జీవితాన్ని శాసించేలా మార్చుకోకూడ దని, స్మార్ట్‌ఫోన్‌కు కాస్త దూరం జరిగి, స్మార్ట్‌గా జీవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
