Health Risk : రోజూ గంట నిద్ర తగ్గినా.. ముంచుకొచ్చే ముప్పు ఇదే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రాత్రిళ్లు వెబ్ సిరీస్‌లు చూస్తూనో.. స్మార్ట్ ఫోన్‌లో సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తూనో నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా..? "ఏదో ఓ గంట నిద్ర తగ్గితే ఏమవుతుందిలే..!" అని తేలిగ్గా తీసుకుంటున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే. ప్రతిరోజూ గంట లేదా గంటన్నర నిద్ర తగ్గినా అది బరువు పెరగడానికి, తద్వారా మధుమేహం, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

ఆ 80 నిమిషాలే.. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి..!

సాధారణంగా ఒక రోజు నిద్ర సరిపోకపోతే మరుసటి రోజు నీరసంగా అనిపించడం సహజం. కానీ, రోజూ క్రమం తప్పకుండా 80 నిమిషాల అంటే సుమారు గంటన్నర  పాటు నిద్రను కోల్పోవడం వల్ల శరీరంలో అంతర్గతంగా అనేక మార్పులు జరుగుతాయి.

శరీరం ప్రతి నిమిషం నిద్రను లెక్కలోకి తీసుకుంటుంది. దానికి తగినంత విశ్రాంతి దొరకనప్పుడు శారీరక జీవక్రియల (Metabolism) పనితీరు మారుతుంది. దీనివల్ల పగటిపూట శారీరక శ్రమ తగ్గిపోయి, క్రమంగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది. తగినంత నిద్రలేని వారిలో శరీరంలో వాపులు (Inflammation) రావడం నుంచి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే వరకు ముప్పు పొంచి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పరిశోధనలో ఏం తేలింది అంటే..?

కొద్దిపాటి నిద్రలేమి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై 'కొలంబియా యూనివర్సిటీ వాగెలోస్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్' పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఈ వివరాలు ప్రముఖ మెడికల్ జర్నల్ 'యాన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్'లో ప్రచురితమయ్యాయి.

అధ్యయనంలో..

ఈ పరిశోధనలో 95 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులు పాల్గొన్నారు. వీరిని ఆరు వారాల పాటు వారి సాధారణ సమయం కంటే 90 నిమిషాలు ఆలస్యంగా పడుకోమని సూచించారు. దీనివల్ల వారు రోజుకు సగటున 80 నిమిషాల నిద్రను కోల్పోయారు. అనంతరం ఆరు వారాల తర్వాత పరిశీలించగా.. నిరంతరం నిద్ర కోల్పోయిన వారు సగటున 450 గ్రాముల మేర బరువు పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

తేలిగ్గా తీసుకోవద్దు..

ఆరు వారాల్లో 450 గ్రాముల బరువు పెరగడం పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ, ఇదే పరిస్థితి నెలలు, సంవత్సరాల పాటు కొనసాగితే ఊబకాయం బారిన పడటం ఖాయమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మంచి ఆరోగ్యం అనగానే సమతుల్య ఆహారం, రోజూ వ్యాయామం మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ, ఆరోగ్యకరమైన జీవనశైలికి 'కంటినిండా నిద్ర' కూడా అంతే కీలకమని, రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా దినచర్యను మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.