Chest Burning : అసలు ఛాతీలో మంట ఎందుకు వస్తుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఛాతీలో మంట (heartburn) అనగానే చాలామంది గుండె సంబంధిత వ్యాధి అని భయపడుతుంటారు. కానీ, వాస్తవానికి ఇది గుండెకు సంబంధించినది కాదు, పూర్తిగా మన జీర్ణవ్యవస్థ పనితీరులోని లోపాల వల్ల తలెత్తే సమస్య అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి పొట్టలో ఆమ్లాలు (Acids) ఉత్పత్తి అవుతాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ ఆమ్లాలు పొట్టలోనే ఉంటాయి. 

కొన్నిసార్లు ఆహార నాళానికి, పొట్టకు మధ్య ఉండే వాల్వ్ లాంటి కండరం సడలిపోవడం వల్ల, పొట్టలోని ఆమ్లాలు వెనక్కి, ఆహార నాళంలోకి ఎగదన్ను కొస్తాయి. ఆహార నాళం లోపలి పొర ఈ ఆమ్లాల తీవ్రతను తట్టుకునేలా నిర్మితమై ఉండదు. దీనివల్ల ఛాతీ మధ్యలో మంట, నొప్పి వస్తాయి. పుల్లటి ఆమ్లాలు గొంతు వరకు రావడం వల్ల నోరు చేదుగా లేదా పుల్లగా మారుతుంది.

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

 

సమస్యను తీవ్రతరం చేసే కారణాలు..

పరిమితికి మించి అతిగా తినడం, నూనె, మసాలా పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం. భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల పొట్టలోని ఆమ్లాలు సులభంగా పైకి వచ్చే ప్రమాదం ఉంటుంది. టీ, కాఫీలు (caffeine), పుల్లటి పండ్లు, మద్యపానం అలవాటు ఉన్నవారిలో ఈ ముప్పు ఎక్కువ. అధిక బరువు, ధూమపానం, అలాగే గర్భధారణ సమయంలో మహిళల్లో ఈ సమస్య తరచుగా కనిపిస్తుంది.

ఉపశమనం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఒకేసారి కడుపు నిండా భారీగా కాకుండా, తక్కువ మోతాదులో సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. రాత్రి పడుకోవడానికి కనీసం రెండు నుంచి మూడు గంటల ముందే భోజనం ముగించాలి.తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. కాసేపు నెమ్మదిగా నడవడం అలవాటు చేసుకోవాలి.

అధిక బరువు ఉంటే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.అప్పుడప్పుడు ఛాతీలో మంటగా అనిపిస్తే జీవనశైలి మార్పులు, సాధారణ మందులతో ఉపశమనం లభిస్తుంది. కానీ, తరచుగా ఈ సమస్య వేధిస్తుంటే, ఆహార నాళం దెబ్బతినే ప్రమాదం ఉన్నందున వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

 ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

  ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.